బిగ్‌బాస్‌ ఇంటి ప్రేమలు స్క్రిప్ట్‌ కాదు : శ్యామల

బిగ్‌ బాస్‌ ఇంటిలో నడుస్తున్న వ్యవహారాలు స్క్రిప్ట్‌ మాత్రం కాదని, అలాగని అవి ప్రేమలుగా చెప్పలేమని ఈ ఆదివారం ఎలిమినేటై బయటకు వచ్చిన శ్యామల చెప్పారు. ఆమె ఓ టివి చానల్‌తో మాట్లాడారు. ‘బిగ్‌బాస్‌ ఇంట్లో ఏదైనా జరగొచ్చనడానికి నేనే ఉదాహరణ. నేను ఇంత త్వరగా బయటకు వస్తానని అనుకోలేదు. ఊహించని విధంగా నన్ను ఎలిమినేట్‌ చేశారు. ప్రేక్షకుల ఓట్లతో ఎలిమినేట్‌ చేశారనేది కరెక్టు కాదు. ఓట్లు తక్కువ వచ్చాయని చెప్పారంతే….తేజస్విని, కౌశల్‌ ద్వారా నన్ను ఎలిమినేట్‌ చేశారు. తేజస్వీని వ్యూహాత్మకంగానే దీప్తిని రక్షించి, నన్ను ఎలిమిట్‌ చేసింది. నేను తనకు గట్టిపోటీ ఇస్తానని అనుకునివుండొచ్చు. నాతో పోల్చితే దీప్తితో పోటీపడటమే మేలని భావించివుండొచ్చు. అందుకే నన్ను ఎలిమినేట్‌ చేసింది’ అంటూ తన ఎలినిమేషన్‌ గురించి వివరించారు.

ఇక ఇంటిలోని ప్రేమ వ్యవహారాలు నిజమైన ప్రేమలేనా లేక బిబ్‌బాస్‌ స్క్రిప్ట్‌ ప్రకారం జరుగుతోందా లేక మసాలా కోసం ఇంటి సభ్యులే అలా నటిస్తున్నారా అని యాంకర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ…’మీరు చెప్పిన ఏ ఆప్షనూ కరెక్టు కాదు. స్క్రిప్ట్‌ కాదు. మసాలా కోసం సభ్యులు చేస్తున్న నటన కాదు. ఒక ఇంటిలో ఉన్నప్పుడు సహజంగానే కొందరి పట్ల అభిప్రాయాలు ఏర్పడుతాయి. అలాంటివే అవ్వి. కాలేజీలో ఒక అమ్మాయి-అబ్బాయి మాట్లాడుకుంటుంటే వారి మధ్య ఏదో ఉందని గుసగుస మాట్లాడుకుంటారు. ఇదీ అలాంటిదే’ అని శ్యామల చెప్పుకొచ్చారు.

బిగ్‌బాస్‌ షోలో గెలవడానికి ఏది ప్రమాణికం…ఇంటిలో వారి ప్రదర్శనా లేక వారి వ్యక్తిత్వమా? లేక చాకచక్యంగా వ్యవహరించడమా? అని అడిగిన ప్రశ్నకు విశ్లేషణాత్మక వివరణ ఇచ్చారు. ‘వ్యక్తిత్వమే ప్రధానమైన అంశం. నటన ద్వారా షోను గెలవడం అసాధ్యం. 24 గంటలూ ఎవరూ నటించలేరు. ఏదో సందర్భంలో అసలు స్వరూపం బయటపడుతుంది. అందుకే మంచి వ్యక్తిత్వం ఉన్నవారు దాన్ని ప్రదర్శించాలి. అది ప్రేక్షకులకు నచ్చితే వారు గెలుస్తారు’ అని సరిగానే చెప్పారు. తన వ్యక్తిత్వ ప్రదర్శనకు పూర్తి అవకాశం లభించలేదని, ఇంకొంతకాలం ఇంటిలో ఉండివుంటే తనకు ఆ అవకాశం లభించేదేమో అని శ్యామల అభిప్రాయపడ్డారు. ఎవరు గెలుస్తారు, వచ్చేవారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారు అనే ప్రశ్నలకు…’ఆ ఇంటిలో ఏమైనా జరగొచ్చు…ఏదీ ఊహించలేం’ అని అన్నారు.

నాని హోస్టింగ్‌ ఆయన నటనలాగే సహజసిద్ధంగా ఉందని శ్యామలా కొనియాడారు. దీప్తితో తనకు ఏర్పడిన బంధం గురించి చెబుతూ….ఇంటి లోపలికి వెళ్లేదాకా ఆమెతో ఎప్పుడూ పరిచయం కూడా లేదని చెప్పారు. ఇద్దరి వ్యక్తిత్వాలు కలవడం వల్లే అంత దగ్గరయ్యామని అన్నారు. ఇక గణేష్‌ను ‘రారా..పోరా’ అని సంబోధించేంతగా దగ్గరయ్యాడని, తాను అలా పిలవగలిగిన ఏకైక వ్యక్తి గణేషేనని శ్యామల తన అనుబంధాలను గుర్తు చేసుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*