బిగ్‌బాస్‌ నుంచి నానికి విముక్తి..!

బిగ్‌బాస్‌ – టెలివిజన్‌ రియాలిటీ షోలలో అత్యంత విజయవంతమైన షో. అది ఏ భాషయినా…బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకే కాదు…హోస్ట్‌కు కూడా చాలా ప్రాచుర్యం లభించింది. గత ఏడాది తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-1కు హోస్ట్‌గా వ్యవహరించిన జూనియర్‌ ఎన్‌టిఆర్‌ క్రేజ్‌ అంతకంత పెరిగిందనడంలో సందేహం లేదు. జూనియర్‌లోని మరో కోణాన్ని ఈ షో బయట ప్రపంచానికి తెలియజేసింది.

బిగ్‌బాస్‌-2కు హోస్ట్‌ చేసే అవకాశం లభించడంతో నేచురల్‌ స్టార్‌ నాని ఎగిరి గంతేశారు. అయితే…షో ముగింపునకు వచ్చే సరికి…ఎప్పుడెప్పుడు అది అయిపోతుందా, అక్కడి నుంచి బయటపడిపోదామా అనే పరిస్థితి తెలిత్తింది నానికి. షో అయిపోతున్నందుకు తనకు బెంగగా ఉందని నాని కొన్ని వారాలుగా చెబుతున్నప్పటికీ…లోలోన మాత్రం ఎంతగానో సంతోషిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.

బిగ్‌బాస్‌-2 మొదటి ఎపిషోడ్‌ నుంచే నానిపై విమర్శల దాడి మొదలయింది. ఎన్‌టిఆర్‌తో పోల్చి సరిగా చేయడం లేదంటూ పెదవి విరిచినవారు. మొదట్లో షోకు రేటింగ్స్‌ కూడా సరిగా రాలేదు. దీంతో స్టార్‌ మా టివి యాజమాన్యంలోనూ నానిపై ఒకింత అసంతృప్తి ఉందన్న వార్తలొచ్చాయి. కిందామీదా పడి షోను రక్తికట్టించడంతో రేటింగ్స్‌ పెరిగాయి. వాణిజ్యపరంగా ఇబ్బందిలేని పరిస్థితి ఇచ్చింది. ఈ దశలో నాని చాలా టెన్ష్‌న్‌కు గురయ్యారట.

ఇక ఇంటి సభ్యుల విషయంలో….తనిష్‌ తన స్నేహితుడు కావడంతో అతని పట్ల పక్షపాతం చూపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దానికి షోలోనే వివరణ ఇచ్చుకున్నారు. అన్నింటికన్నా కౌశల్‌ ఆర్మీ చేసిన దాడి తీవ్రమైనది. కౌశల్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై మాటల దాడి చేసిన కౌశల్‌ ఆర్మీ నానినీ విడిచిపెట్టలేదు. రాయలేని బూతులతో సోషల్‌ మీడియాను నింపేశారు. సినీ నటులకు ప్రశంసలు, చిన్నపాటి విమర్శలు తప్ప…ఈ విధమైన బూతులు, దాడి కొత్తే. దీన్ని భరించడమూ కష్టమే.

కౌశల్‌ ఆర్మీ దాడితో నాని బెదిరిపోయారన్న విమర్శలూ వచ్చాయి. కౌశల్‌ ఏ తప్పు చేసినా చెప్పడానికి వెనుకంజ వేస్తున్నారని ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. బాబు గోగినేని వంటి వారి విషయంలో…ఇది వాస్తవం అనిపించేలావుంది నాని వ్యవహారం. అటు కౌశల్‌ ఆర్మీ, ఇటు ఇతర ఇంటి సభ్యుల అభిమానులు….ఎవరో ఒకరు నానిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు.

ఇటీవల నాని ఓ ఫంక్షన్‌లో మాట్లాడుతూ…బిగ్‌బాస్‌ షోతో చాలా తెలుసుకున్నానని అన్నారు. మనుషుల్లో ఇన్ని వివాదాలు, విభేదాలు ఉంటాయా…అని ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే… ఇది హోస్ట్‌ ఇష్టానుసారం చేసేది కాదు. బిగ్‌బాస్‌ డైరెక్షన్‌లో చేయాల్సినది. ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెట్టాలి…వారాంతంలో వాటిని తీర్చాలి. కలిసివుంటే…ఎందుకు కలిసివున్నారని ప్రశ్నించాలి. గొడవపడుతుంటే…మీకు అనుబంధాలు ఆత్మీయతలు తెలియవా అంటూ మందలించాలి. ఈ వారం చెప్పిన మాటకు భిన్నంగా ఇంకోవారం మాట్లాడాలి. అందరు సభ్యుల ప్రవర్తను బేరీజు వేసుకుని ఎవరది కరెక్టో, ఎవరిది తప్పో చెప్పాలి. అది ప్రేక్షకులకూ ఆమోదయోగ్యంగా ఉండాలి. ఇది కత్తిమీద సామువంటిదే.

బిగ్‌బాస్‌ షో హోస్ట్‌ టివి తెరపై కనిపించేది శని, ఆదివారాలు రెండు రోజులో అయినా…రోజూ కొన్ని గంటల పాటు పనివుంటుందనడంలో సందేహం లేదు. టివిలో గంట మాత్రమే షో ప్రసారమైనా….ఇంట్లో ఏమి జరిగిందో తెలియాలంటే కనీసం నాలుగైదు గంటల కంటెంటునైనా హోస్ట్‌ చూడాలి. అంటే షో జరిగినన్ని రోజులూ హోస్ట్‌కు పని ఉంటుందన్నమాట.

ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో నాని బిగ్‌బాస్‌ షోను ఒకింత కష్టంగా, అయిష్టంగానే నిర్వహించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఫైనల్స్‌ అయిపోతే….నాని ఊపిరి పీల్చుకున్నట్లేనని అంటున్నారు. బిగ్‌బాస్‌-3కి హోస్ట్‌గా ఉండమన్నా ఉండరని అభిప్రాయపడుతున్నారు. ఆదివారంతో నానికి బిగ్‌బాస్‌ నుంచి విముక్తి లభించినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*