బిగ్‌బాసూ జ‌నం మీ షో చూడాలంటే…మార్పులు‌ తప్పవు బాసూ..!

బిగ్‌బాస్‌ షో హిందీలో ఇప్పటికే 11 సీజన్లు ముగించుకుని 12వ సీజన్‌ ఇటీవలే మొదలయింది. అక్కడ అన్ని సీజన్లు ఎలాంటి వివాదాలు లేకుండా ఎలా సాగుతోందోగానీ….తెలుగులో రెండో సీజన్‌కే బిగ్‌బాస్‌ చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టాయి. తీవ్రమైన సవాళ్లు ఎదురయ్యాయి. ఈ షో ఫార్మేట్‌పైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు షోపైనే ప్రేక్షకులు విశ్వాసం కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని మార్పులు చేయకుంటే…మూడో సీజన్‌కు ప్రేక్షలకు ఆదరణ లభించడం సాధ్యంకాదేమో.

ఈ సీజన్‌లో ప్రధానంగా ముందుకొచ్చిన అంశం…ఓటింగ్‌ విధానం. ధనబలం కలిగిన సెలబ్రిటీ ఎవరైనా బిగ్‌బాస్‌ ఇంటిలోకి వెళితే….ఓట్లను రాబట్టుకోవడం పెద్ద సమస్య కాదని కౌశల్‌ ఆర్మీ ద్వారా రుజువయింది. టైటిటే ప్రధానం అనుకుని కాస్త డబ్బులు వెచ్చించగలిగితే….ఓట్లు సంపాదించుకోవడం (అది అక్రమమా…సక్రమమా అనేదానితో సంబంధం లేకుండా) పెద్ద కష్టం కాదని తేలిపోయింది. ఓట్లు సంపాదించి పెట్టడానికే కొన్ని సంస్థలు పట్టుకొచ్చిన ఉదంతాలూ వెలుగుచూశాయి.

అందుకే ఓట్ల ద్వారానే సభ్యుల ఎనిమినేషన్‌, ఫైనల్‌లో విజేతను ఎంపిక చేస్తామంటే అది పారదర్శకం అనిపించుకోదు. ఓట్లతో పాటు మరో వ్యవస్థ కూడా అవసరం అనిపిస్తోంది. ఇంటి సభ్యుడు ఎటువంటి వాడైనా బయట బలంవుంటే గెలిచిపోవచ్చన్న భావన బిగ్‌బాస్‌-2తో స్థిరపడింది. అందుకే ఇది పోవాలంటే….ఓట్లతో పాటు ఇంటిలో జరిగే వ్యవహారాలను విశ్లేషించి, ఎవరు ఇంటిలో ఉండేందుకు అర్హులు, ఎవరు అనర్హులు అని నిర్ణయించడానికి ఒక ప్యానెల్‌ వంటిది అవసరం ఉంది. ఆ న్యాయ నిర్ణేతల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఎలిమినేషన్‌ ప్రక్రియ నిర్వహించడం ద్వారా…షోపై విశ్వసనీయతను పెంచడానికి వీలవుతుంది.

బిగ్‌బాస్‌ షో అనేది వ్యక్తిత్వాల పరిశీలనకు సంబంధించిన అంశం. ఎవరి వ్యక్తిత్వం ఉన్నతంగా ఉంటుందో వారినే విజేతలుగా నిలపాలి. ఈ వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకురావడానికే రకరకాల టాస్క్‌లు ఇస్తుంటారు. ఓటింగ్‌కు వచ్చే సరికి….వ్యక్తిత్వంతో నిమిత్తం లేకుండా…బలం, పలుకుబడి ఉన్నవారికి ఎక్కువ ఓట్లు వచ్చేస్తున్నాయి. అది లేనివారు ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్నవారైనా బయటకు వెళ్లిపోవాల్సి వస్తోంది. అందుకే ఓటింగ్‌కు తోడు న్యాయ నిర్ణేతల వ్యవస్థ కూడా అవసరం అనిపిస్తోంది.

అదేవిధంగా ఓటింగ్‌ విధానంలోనూ మార్పులు చేయాలి. ఒక సభ్యుడు ఒక్క ఓటు మాత్రమే వేసేలావుండాలి. అప్పుడు రిగ్గింగ్‌ చేయడం, అక్రమ పద్ధతుల్లో ఓట్లు సంపాదించడం అంత తేలికకాదు. ఇప్పుడు ఒక్కో ప్రేక్షకుడు వారంలో కొన్ని వందల ఓట్లు వేసే అవకాశం ఉండటంతో….ధనబలం కలిగిన వ్యక్తులు కొన్ని వందల మందిని నియమించుకుని, నెట్‌వర్క్‌ పద్ధతిలో లక్షల ఓట్లు సంపాదించడం సులభమైపోతోంది. దీంతో మిగతా సభ్యులకు ఎన్ని ఓట్లు వచ్చినా….అక్రమాలకు పాల్పడేవారితో పోటీపడటం సాధ్యమవడం లేదు. ఒకరికి ఒక ఓటు పద్ధతే పెట్టాలి. అదీ మిస్ట్‌కాల్‌ వ్యవస్థ ఒక్కటే అనుసరించాలి. ఇంటర్‌నెట్‌ ద్వారా ఓటింగ్‌ పద్ధతిని తీసేయాలి.

బిగ్‌బాస్‌ తెలుగు-2 చూశాక బిగ్‌బాస్‌కు కూడా షో నిర్వహణలో ఉన్న లోపాలు అర్థమైవుంటాయి. వచ్చే సీజన్‌లో ఈ మార్పులు తీసుకొస్తారనే ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు…ఈ పద్ధతే కొనసాగిస్తాం అనుకుంటే ఈ షోకు ఆదరణ తగ్గిపోవడం ఖాయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*