బిగ్‌బాస్‌ ముగిసింది : డొల్లతనం బయటపడింది..!

బిగ్‌బాస్‌ తెలుగు-2 ముగిసింది. అందరూ ఊహించినట్లే కౌశల్‌ విజేతగా నిలిచారు. గీతామాధురి రెండోస్థానంలో ఉన్నారు. మూడోస్థానంలో తనిష్‌, నాలుగో స్థానంలో దీప్తి, ఐదో స్థానంలో సామ్రాట్‌ నిలిచారు. ఈ సీజన్‌లో కౌశల్‌ గెలుస్తారని గత కొంతకాలంగా అందరూ చెబుతూవస్తున్నారు. ఫైనల్స్‌ దగ్గరపడేకొద్దీ టైటిల్‌ కౌశల్‌కే అని నిర్ధారణకు వచ్చేశారు ప్రేక్షకులు. దీనికి కారణాలు లేకపోలేదు.

ఈ షోలో ఎలిమినేషన్‌కు, విజేత నిర్ణయానికి ప్రేక్షకుల ఓట్లే ప్రామాణికం అని చెప్పారుగానీ…ఆ ఓటింగ్‌ విధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో, అంతు డొల్లగా ఉందే బిగ్‌బాస్‌-2 రుజువు చేసింది. ఒక విధంగా ఓటింగ్‌ విధానంలోని డొల్లతనాన్ని బిగ్‌బాస్‌ కూడా అంగీకరించారు. జాగ్రత్తగా గమనిస్తే ఫైనల్స్‌లో ఇది అవగతం అవుతుంది.

బిగ్‌బాస్‌ షో ఓటింగ్‌ విధానం అక్రమాలు చేయడానికి వీలుగావుంది. ప్రతి ప్రేక్షకుడు, రోజుకు మిస్డ్‌కాల్‌ ద్వారా 50 ఓట్లు, ఇంటర్‌నెట్‌ ద్వారా 50 ఓట్లు వేయొచ్చు. అంటే ఒక సిమ్‌, ఒక ఫోన్‌వుంటే…వారంలో వందలాది ఓట్లు వేయొచ్చు. దీన్ని ఆసరా చేసుకుని కౌశల్‌ను విజేతగా నిలపడం కోసం ఇంటి బయట కౌశల్‌ ఆర్మీ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఈ ఆర్మీ ఓటింగ్‌ను కౌశల్‌కు అనుకూలంగా మార్చిందన్నదాంట్లో సందేహం లేదు. అందుకే కౌశలే గెలుస్తారని అందరూ ఊహించారు. మరో ఇంటి సభ్యురాలు కూడా తనకు ఓట్లు సమీకరించే పనిని ఓ డిజిటల్‌ కంపెనీకి అప్పగించినట్లు వార్తలొచ్చాయి.

ఈ మొత్తం వ్యవహారం ద్వారా అర్థమయిందేమంటే….కాస్త డబ్బు, పలుకుబడి ఉండే వ్యక్తులు బిగ్‌బాస్‌ ఇంటిలోకి వెళితే….బయట ఓట్లు రాబట్టడం పెద్ద సమస్య కాదు. ఆ ఇంటి సభ్యును ఆట, వ్యవహార శైలితో నిమిత్తం లేకుండా….ఎవరికి అనుకూలంగానైనా ఓట్లు వచ్చేలా చేయవచ్చనేది బిగ్‌బాస్‌-2 నేర్పిన అనుభవం. షోకు మూలసూత్రమైన ఓటింగ్‌ వ్యవస్థపైన విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఓట్లకు ఏమి విలువ ఉందన్న ప్రశ్న ఉదయించింది.

ప్రేక్షకుల వైపు నుంచి వచ్చిన ఈ విమర్శను బిగ్‌బాస్‌ కూడా అంగీకరించినట్లు ఉన్నారు. గతంలో ఇంటి సభ్యులకు ఇన్ని కోట్ల ఓట్లు వచ్చాయి, అన్ని కోట్ల ఓట్లు వచ్చాయి అని చెప్పేవారు. కానీ ఫైనల్స్‌లోని ఐదుగురు ఇంటి సభ్యుల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్న ప్రస్తావనే లేకుండా….కౌశల్‌ను విజేతగా ప్రకటించి ముగించారు. ఫైనల్స్‌లో ఓట్ల వివరాలు ఎందుకు వెల్లడించలేదు….అనే అనుమానం అందరికీ కలిగింది. దీనికి కారణం…ఓటింగ్‌ పద్ధతిపై వచ్చిన విమర్శలే. అందుకే ఓట్ల వివరాలు చెప్పి, దానిపైన వచ్చే విమర్శలను భరించడం కంటే…ఆ వివరాలే వెల్లడించకుండా షో ముగించడం మంచిదనుకున్నట్లున్నారు. ఇదంతా చూస్తుంటే…తన విధానంలోని డొల్లతనం ఏమిటో బిగ్‌బాస్‌ కూడా గుర్తించారని భావించాలి.
(బిగ్‌బాస్‌ షోలో ఎటువంటి మార్పులు చేయాలి అనే అంశంపై ధర్మచక్రం కథనం ఇంకో పోస్టులో చూడొచ్చు.)

బిగ్‌బాస్ షోకు ఎదురైన స‌వాళ్ల గురించి గ‌తంలో రాసిన క‌థ‌నం కోసం కింది లింక్‌పై క్లిక్ చేయండి…

బిగ్‌బాస్‌కే బిగ్‌ సవాల్‌ : 100 రోజులు పూర్తయిన షో!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*