బిగ్‌బాస్‌ షోలో గెలవకుండా బాబు గోగినేనిపై కుట్ర

బాబు గోగినేని – ఈ పేరు తెలియని తెలుగువారు లేరు. ప్రజల్లోని మూఢ విశ్వాసాలను, నమ్మకాలను సొమ్ముచేసుకునే నకిలీ బాబాలు, వాస్తు మేధావులను చీల్చిచీల్చి చెండాడి; టివి ఛానళ్ల లైవ్‌ కార్యక్రమాల్లోనే అనేక మంది బండారం బట్టబయలు చేసిన ఆయన తక్కువ కాలంలోనే అనన్యమైన గుర్తింపును తెచ్చుకున్నారు. టివి ఛానళ్లలో బాబాలు, మత విశ్వాసాలు వంటి వాటిపై ఏ చర్చ జరిగినా గోనినేని తప్పక కనిపించే పరిస్థితి వచ్చింది. అటువంటి వ్యక్తి బిగ్‌బాస్‌ షోలోకి ప్రవేశించారు. రెండు వారాలకుపైగా బిగ్‌బాస్‌ ఇంట్లో ఉంటున్నారు. ఆయన చివరి దాకా షోలో కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే తనదైన తర్కంతో ఇటు ఇంటి సభ్యులను, ఇటు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను సాధ్యమైనంత త్వరగా షో నుంచి బయటకు రప్పించడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఇంతకీ బాబు గోగినేనిపై ఎవరు కుట్రలు చేస్తున్నారు? ఎందుకు కుట్రలు చేస్తున్నారు?

బాబు గోగినేని బిగ్‌బాస్‌ షో గెలివడం మనువాదులకు, మత ఛాందసులకు పెద్ద దెబ్బే అవుతుంది. షోలో గెలిస్తే ఆయన పాపులారిటీ మరింత పెరుగుతుంది. బయటకు వచ్చిన తరువాత గోనినేని మాట్లాడే ప్రతి మాటకు ఇప్పటికంటే కొన్ని రెట్లు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. ఆలకించే జనం పెరుగుతారు. అందుకే ఆయన షో గెలవకూడదు. అది జరగాలంటే ముందుగా ఆయన్ను జనంలో తక్కువ చేయాలి. ఆయన దేశద్రోహిగా, హిందూ వ్యతిరేకిగా ప్రచారం చేయాలి. అలా చేయడం వల్ల జనంలో వ్యతిరేకత వచ్చి…ఆయనకు లభించే ఓట్లు తగ్గిపోతాయి. ఓట్లు తగ్గిపోతే షో నుంచి ఎలిమినేట్‌ అవుతారు. ఇదీ బాబుపై జరుగుతున్న కుట్ర. ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్లే షోలో గెలుస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. ఎంతోకొంత తారుమారు ఉన్నా…తీవ్ర వ్యతిరేకత ఉన్నవాళ్లను షొలో కొనసాగించరు.

అలాంటి వ్యతిరేకతను బాబుపై తీసుకొచ్చేందుకే…ఆయనపై దేశద్రోహం కేసులు బనాయించారు. మతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని కూడా కేసులు పెట్టారు. హేతువాద కార్యక్రమాలకు హాజరయ్యే వారి నుంచి ఆధార్‌ కార్డు నెంబర్లు స్వీకరించడమే దేశ ద్రోహమట. మూఢ నమ్మకాలను చీల్చిచెండాటం మతాల మధ్య ఘర్షణ సృష్టించడమట. కెవి నారాయణ అనే వ్యక్తి హైదరాబాద్‌ మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులూ ముందూ వెనుకా ఆలోచించకుండా కేసులు నమోదు చేశారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉన్న ఆయన్ను విచారించే అవకాశాలూ ఉన్నాయి. మొదటి సీజన్‌లో మాదకద్రవ్యాల కేసులో ముమైత్‌ఖాన్‌ను హైదరాబాద్‌ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.

మనువాదులు, మత ఛాందసులు గోగినేనిపై చేస్తున్న కుట్రలు ఫలించవు. ఎందుకంటే…కుట్రలను భగ్నం చేయడానికి ఆయనకు మద్దతుగా సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలయింది. గోగినేనికి మద్దతుగా ఉంటామని కత్తి మహేష్‌ వంటి వారు పోస్టులు పెడుతున్నారు. అదేవిధంగా వామపక్ష భావజాలం ఉన్నవారూ గోగినేనిపై కేసులను ఖండిస్తున్నారు. ఈ విధంగా బాబుకు ఒక వర్గం ప్రజల మద్దతు అనూహ్యంగా పెరుగుతోంది. ఇది కచ్చితంగా ఆయనకు మేలు చేస్తుంది.
ఈ వెబ్‌సైట్‌లోని పాత క‌థ‌నాల కోసం క్లిక్ చేయండి….
www.dharmachakram.in

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*