బిగ్‌బాస్‌ షో విమర్శకులకు కమల్‌ హాసన్‌ సమాధానం!

బిగ్‌ బ్రదర్‌ పేరుతో విదేశాల్లో మొదలై, అక్కడ విశేష ఆదరణపొంది….మన దేశానికి సంబంధించి బిగ్‌బాస్‌ పేరుతో హిందీలో ప్రారంభమై…ఇప్పుడు తెలుగు, తమిళం, మళయాలం, కనడ…తదితర ప్రాంతీయ భాషలకూ విస్తరించిన ఈ టెలివిజన్‌ రియాలిటీ షోను చిన్నచూపు చేస్తున్నారు. ఇంకేమీ పనిలేదా…ఇదేమి షో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ షోలో పాల్గొనేవారికి, చూస్తున్నవారికి పనిలేదన్నట్లు కామెంట్లు చేస్తున్నారు. అయినా…ఇటువంటి షోకి తమిళంలో మొదటి సీజన్‌లోనూ, రెండో సీజన్‌లోనూ విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ హోస్ట్‌ చేస్తుండటం కొందరికి అర్థం కాలేదు.

ఈ నేపథ్యంలో కమల్‌ హాసనే స్వయంగా బిగ్‌బాస్‌ షో ప్రత్యేకత గురించి వివరించడం ద్వారా విమర్శకులకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వారంలో విడుదల కానున్న విశ్వరూపం-2 చిత్ర ప్రమోషన్లో భాగంగా తెలుగు బిగ్‌బాస్‌-2 ఇంట్లోకి వచ్చిన ఆయన షో గురించి క్లుప్తంగానే విమర్శించే ప్రయత్నం చేశారు. ‘ఇది చిల్లర కార్యక్రమం (సిల్లీ షో) కొందరు విమర్శిస్తున్నారుగానీ…వాస్తవంగా ఇది బయటవున్న జీవితానికి ఒక సెటైర్‌ వంటిది…ఒక నకలు వంటిది’ అని చెప్పారు. ఈ షోవల్ల సమాజంలో సున్నితత్వం పెరుగుతుందని చెప్పారు. ప్రజలు తమను తాము బిగ్‌బాస్‌ ఇంటి సభ్యుల్లో చూసుకుంటున్నారని అన్నారు. షో మెల్లగా అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు. కమల్‌ చెప్పిన దానికి బిగ్‌బాస్‌ ఇంట్లో ఉంటున్న బాబు గోగినేని కూడా మద్దతు పలికారు. బయటికీ, ఇక్కడికీ ఏమీ తేడా లేదని అన్నారు.

కమల్‌హాసన్‌ చెప్పింది నూటికి నూరు శాతం సరైనది. ఎందుకంటే…ప్రేక్షకులు తమను తాను ఇంటి సభ్యులతో పోల్చుకుంటారు. ఎవరి వ్యక్తిత్వాలు ఎలావున్నాయో గమనిస్తారు. ఫలానా సందర్భంలో తామైతే ఎలా వ్యవహరిస్తామో అంచనా వేసుకుంటారు. ఇంటి సభ్యుల్లో కనిపించే వ్యక్తిత్వ లోపాలు తమలో ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలించుకుంటారు. ఇంటి సభ్యుల్లో ఏదైనా నచ్చని గుణం కనిపిస్తే….అదే గుణం తనలో ఉంటే…ఆ ఇంటి సభ్యుడి గురించి తాను అనుకున్నట్లే…తన గురించి కూడా చుట్టుపక్కల వారు అనుకుంటారు కదా…ఆత్మ పరిశీలన చేసుకుని….సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే బిగ్‌బాస్‌ షో వ్యక్తిత్వ వికాస పాఠం వంటిది.

ఈ షో గురించి ఒక ప్రొఫెసర్‌ ధర్మచక్రం ప్రతినిధితో మాట్లాడుతూ….’ఇది ప్రయోగ శాలలో వ్యక్తిత్వాల పరిశీలన. ఒక రకంగా ఇది మనుషుల వ్యక్తిత్వాలపై అధ్యయనం. ఈ ప్రక్రియ గురించి సైకాలజీ పాఠాల్లో ఉంది. ఇలా వ్యక్తులపై ప్రయోగాలు చేసిన మనో శాస్త్రవేత్తలూ ఉన్నారు. ఆ ప్రయోగాల నుంచి వచ్చినదే బిగ్‌బాస్‌ షో’ అని వివరించారు. షోను రక్తికట్టించడం కోసం నిర్వాహకులు కాస్త మసాలా జోడించొచ్చుగానీ… పరిస్థితులను బట్టి మనుషుల వ్యక్తిత్వాలు, అనుబంధాలు ఎలా మారిపోతుంటాయో కళ్ల ముందు కనిపిస్తూవుంటుంది. అందుకే బిగ్‌బాస్‌ షోను కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. అది నిరుపయోగమైన కార్యక్రమం కాదు. ఆసక్తిగా చూడగలిగితే…మానవ ప్రవర్తనను నిర్ధిష్టంగా అధ్యయనం చేయడానికి బాగానే ఉపయోగపడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*