బిగ్ బాస్ ఇంటి సభ్యులకు సంకెళ్లు..!

బిగ్ బాస్ ఇంట్లో జైలు ఉన్న సంగతి తెలిసిందే…తాజాగా సంకెళ్లూ వచ్చాయి. ఇంటి సభ్యులకు సంకెళ్లు బిగించిమరీ నామినేట్ చేశారు. నామినేషన్ ప్రక్రియ మొదలవగానే అసలు విషయం చెప్పకుండా…ఇంటిలో మీరు ఎవరితో మాట్లాడ కూడదని అనుకుంటున్నారో వారి పేరు చెప్పండి అని బిగ్ బాస్ అడిగారు. దానికి సరదాగానే అమిత్ పేరు ఎక్కువమంది చెప్పారు. దాంతో మీరు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారంటూ అమిత్ పేరు ప్రకటించారు. ఆ తరువాత మీకు నచ్చిన ఒకరి పేరు చెప్పండి అని కోరారు.

ఈ విధంగా బాబు గోగినేని – రోల్ రైడా, సునయన – తనిష్, దీప్తి – గణేష్, సామ్రాట్ – కౌశల్, తేజస్వీ – నందిని జంటలుగా సిద్ధమయ్యారు. అప్పుడు ప్రకటించారు బిగ్ బాస్…జంటలకు సంకెళ్లు వేస్తామని, ఎవరు నామినేషన్ లో ఉండాలో, ఎవరు ఉండకూడదో ఏ జంటకు ఆ జంట నిర్ణయించుకోవాలని, నానినేషన్ నుంచి తప్పించాలనుకున్న వారి చేతికి సంకెళ్లు తొలగించాలని చెప్పారు. అంటే అత్యంత సన్నిహితుల మధ్య బిగ్ బాస్ గొడవ పెట్టేశారన్నమాట. అయితే అన్ని జంటలూ ఏదో ఒక కారణంతో ఏకాభిప్రాయానికి వచ్చి ఒకొక్కరిని సంకెళ్ల నుంచి విముక్తి చేశారు. దీప్తి – గణేష్ మధ్య మాత్రం కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. తాను ఇప్పటికే ఐదు పర్యాయాలు నామినేట్ అయ్యానని, ఇంకోసారి కాబోనని గణేష్ తెగేసి చెప్పారు. విధిలేక దీప్తి తాను నామినేట్ అయ్యేందుకు సిద్ధపడి గణెష్ సంకెళ్లు తీసివేయించింది. దీంతో రోల్, దీప్తి, తేజస్వీ, తనిష్, సామ్రాట్ నామినేట్ అయ్యారు.

ఈ ప్రక్రియలో ఆసక్తికర ఉదంతం ఒకటి జరిగింది. ముందుగా నామినేట్ అయిన అమిత్ కు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఇంటిలో ఏదైనా వంటకం చెడగొట్టడం, ఎవరైనా ఒక సభ్యుని తలపై కోడిగుడ్డు పగలగొట్టడం, ఒకరు దుస్తులు తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్ లో పడేయడం, ఒకరి తో డాన్స్ చేయించడం…ఇవి చేయాలి. గీత జ్యూస్ చేస్తుంటే ఆమెకు తెలియకుండా ఉప్పు కలిపేశాడు, తనిస్ దుస్తులు నీళ్లలో పడేశాడు. గణేష్ వద్దకు సీరియస్ గా వెళ్లి అతని తలపై టఫీమని గుడ్డు పగలగొడ్డాడు. అది సీరియస్ అనుకుని గణేష్ ఏడ్చేశాడు. ఎందరు సర్దిచెప్పినా అతని ఏడుపు ఆగలేదు. ఇంటి సభ్యులంతా అమిత్ తప్పు చేశాడని నిందించడం మొదలుపెట్టారు.

ఇదంతా చూసి తట్టుకోలేని అమిత్…అందరి ముందుకెళ్లి నేను నామినేషన్ లో ఉన్నా ఫర్వాలేదు అంటూ సీక్రెట్ టాస్క్ గురించి చెప్పి గణేష్ కు పదేపదే సారీ చెప్పారు. ఇదంతా ఆసక్తికరంగా సాగింది. ఇందులో కొసమెరుపు ఏమంటే…సీక్రెట్ టాస్క్ పూర్తి చేయని అమిత్ ను మందలిస్తారని అనుకుంటే …టాస్క్ లో ఎక్కువ పనులు చేసినందువల్ల నానినేషన్ నుంచి తప్పిస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు.

ఇక ఎపిషోడ్ ప్రారంభంలోనే అమిత్, సునయన ఎక్కిఎక్కి ఏడవడం చూపించారు. భాను వెళ్లిపోయిన బాధలో ఆ ఇద్దరూ దుఃఖంలో మునిగిపోయారు. ఇదిలావుండగా సభ్యులను యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లమని చెప్పి …వాళ్లు తిరిగివచ్చేలోపు కొన్ని బెడ్స్ తీసుకెళ్లిపోయారు. అమ్మాయిలు ఐదుగురుండగా ఆరు బెడ్స్ ఉంచారు. జెంట్స్ లోనూ ఒక బెడ్ అదనంగా ఉంచారు. దీన్నిబట్టి వైల్డ్ కార్డు ఎంట్రీ లు ఉండవచ్చని సభ్యులు ఊహించు కుంటున్నారు. మొత్తంమ్మీద 36 వ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈ వారం ఎలిమినేషన్ లోని సభ్యులందరూ చురుకైనవారే. ఎలిమినేషన్ కాస్త కష్టంగానే ఉంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*