బిజెపి-టిడిపి గొడవల్లోకి…..తిరుమల వేంకటేశ్వర్వున్నీ లాగేస్తున్నారు!

గత ఎన్నికల్లో కలిసి పోటీచేసి, నాలుగేళ్లు కలిసి ప్రభుత్వాలు నడిపి, ఇటీవలే తెగదెంపులు చేసుకుని, ఒకరిపై ఒకరుతు కత్తులు దూసుకుంటున్న బిజెపి-టిడిపి గొడవల్లోకి తిరుమల శ్రీవారినీ లాగేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంపై కేంద్ర ప్రభుత్వం కన్నేసిందని, వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని, రాష్ట్రంపై కక్ష సాధింపుతోనే ఇదంతా చేస్తోందని….ఇలా మధ్యాహ్నం నుంచి ఏవేవో విశ్లేషణలు టివీల్లో వచ్చేస్తున్నాయి. టిడిడి ఆధ్వర్యంలో ఉన్న పురాతన ఆలయాల స్థితిగతుల వివరాలు తెలుసుకోడానికి పురావస్తు శాఖ అధికారులు వస్తారని, వారికి తగిన అనుమతులు ఇవ్వమని కేంద్ర పురావస్తు శాఖ టిటిడికి రాసిన ఓ లేఖ ఆధారంగా ఇలాంటి కథనాలు వండి వర్చేస్తున్నారు. ఈ అంశంలోకి రాజకీయాలను తెచ్చేశారు.

దేశంలోని ఏ పురాతన స్థలమైనా పురావస్తు శాఖ సంరక్షణలో ఉంటాయి. పురాతన కట్టడాలను సంరక్షించాల్సిన బాధ్యత పురావస్తు శాఖపై (ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా – ఎఎస్‌ఐ) ఉంటుంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు శ్రీనివాసమంగాపురం, గోవిందరాజస్వామి ఆలయం, ఒంటమిట్ట ఆలయం ఇవన్నీ అత్యంత పురాతనమైనవే. ఒకప్పుడు తిరుమల ఆలయం, శ్రీనివాసమంగాపురం ఆలయం పూర్తిగా పురావస్తు శాఖ ఆధీనంలోనే ఉండేవి. ఆ తరువాత వాటి నిర్వహణ మాత్రం టిటిడికి అప్పగించారు. ఇటీవలే టిటిడి ఆధ్వర్యంలోకి వచ్చిన ఒంటిమిట్ట ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలోనే ఉంది. తన ఆధీనంలో ఉన్న కట్టడాలను సంరక్షించే క్రమంలో పురావస్తు శాఖ కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. ఆ శాఖ అనుమతి లేకుండా ఎవరూ సంరక్షిత కట్టడాలపై మేకైనా కొట్టడానికి వీల్లేదు. కరిన సిమెంటు వేయడానికీ అవకాశం ఉండదు. ఒకవేళ కట్టడం పాడుపడితే…ఆ శాఖ ఆధ్వర్యలోనే శాస్త్రీయ పద్ధతుల్లో మరమ్మతులు చేపడుతారు. సంరక్షిత ప్రాంతాలకు నిర్ణీత దూరంలో ప్రైవేట్‌ కట్టడాలు కట్టాలన్నా ఈ శాఖ అనుమతి తీసుకోవాల్సిందే. ఇంత కఠినంగా లేకుంటా మన వారసత్వ సంపద అయిన పురాతన కట్టడాలను భావి తరాలకు అందివ్వలేం.

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏం జరుగుతోంది అనే విషయా నికొద్దాం…వాస్తవంగా ఆలయం లోపల నిర్మాణంలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలంటే పురావస్తు శాఖ అనుమతి తప్పనిసరి. అయితే…ఇప్పుడు జరుగుతున్నది వేరు. టిటిడి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే శ్రీవారి పోటుకు సంబంధించిన కొన్ని గోడలు కూల్చేశారు. దీన్ని బయటకు రానీకుండా నొక్కిపేట్టేశారు. ఇక క్యూలైన్ల ఏర్పాటు కోసం ఆలయం లోపల నేలపైన వందల కొద్దీ గోతులు (హోల్స్‌) తవ్వారు. ధర్మచక్రం గతంలో ఈ అంశంపై ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది. అదేవిధంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న పురాతన వెయ్యికాళ్ల మండపాన్ని ఏకపక్షంగా కూల్చేసింది. ఆలయ ప్రాకారాలకు బంగారు తొడుగు వేయాలని తీవ్రంగా ప్రయత్నించారు. దీనికి స్వర్ణమయం అని పేరుపెట్టి దాతల నుంచి బంగారును విరాళంగానూ స్వీకరించారు. అయితే అనేక అభ్యంతరాల వల్ల ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. ఏ పురాతన నిర్మాణమైనా దాని అసలు స్వరూపం కోల్పోకుండా కాపాడాలి. పురాతన నిర్మాణాల స్థానంలో కొత్త నిర్మాణాలు వచ్చేస్తే…దానికి విలువ ఉండదు. ఇప్పుడు తిరుమల శ్రీవారి ఆయలంలో జరుగుతున్నది ఆందోళన కలిగించేంతటి తీవ్ర సమస్య కాకపోయినా…పురావస్తు శాఖ నిబంధనలకు విరుద్ధం.

ఈ నేపథ్యంలో పురావస్తు శాఖ టిటిడి అధికారులకు లేఖ రాసింది. టిటిడి ఆధీనంలో ఉన్న పురాతన కట్టడాలను పరిశీలించడానికి, ఫొటోలు తీసుకోడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరింది. ఇందులో తప్పపట్టాల్సిన అంశం ఏమీ లేదు. ఒక విధంగా ఇది మంచిదే. పురాతన కట్టడాలకు ఏదైనా ప్రమాదం పొంచివుంటే… జాగ్రత్తలు తీసుకోడానికి అవసరమైన సలహాలు ఇస్తారు. ప్రస్తుతం టిటిడి అనుమతి లేకుండా పురావస్తు శాఖ అధికారులు ఆలయాల్లోకి కాలుపెట్టేందుకైనా అవకాశం లేదు. అందు ఉన్నతాధికారులు లేఖ రాసినట్లున్నారు. అయితే…దీన్ని రాజకీయాలకు ముడిపెట్టేస్తున్నారు. తిరుమల ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు కుట్రలు చేస్తోందని ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీపై కక్షగట్టిన కేంద్రం కావాలనే ఇదంతా చేస్తోందని ప్రచారం చేస్తున్నారు. ఏమైనా దీనిపై పురావస్తు శాఖ వెంటనే సరైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*