బిజెపి మాటతప్పినా…బిజెపికి టిడిపి ఇచ్చిన మాట తప్పదట!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని, రాజధాని అమరావతిని ఢిల్లీని తలదన్నేలా నిర్మిస్తామని….ఇలా ఎన్నో హామీలను బిజెపి ఇచ్చి, మాట తప్పినా…. తెలుగుదేశం మాత్రం బిజెపికి ఇచ్చిన మాట తప్పదట. ‘మాట తప్పడం…మడమ తిప్పడం మా వంశంలో లేదు’ అని జగన్‌ అంటుంటారుగానీ….ఆచరణలో చూపిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

ఇంతకీ కథ ఏమిటంటే….ప్రతిష్టాత్మక టిటిడి ధర్మకర్తల మండలిలో బిజెపికి చెందిన మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సతీమణి సప్నాను సభ్యురాలిగా నియమించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులను ఉపసంహరించుకుని, ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చి…రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెబుతున్న తరుణంలో బిజెపికి చెందిన వారికి టిటిడి పాలక మండలిలో స్థానం కల్పించడం వివాదాస్పదమయింది. బిజెపి వాళ్లు టిటిడి బోర్డులో ఉంటారని ఎవరూ ఊహించలేదు. సన్నా వ్యహారం జీవో విడుదలైనప్పటి నుంచే సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపైన ప్రభుత్వ పెద్దలు వివరణ ఇచ్చినట్లు ఓ పత్రికలో వార్త వచ్చింది. దాని సారాంశం ఏమంటే…’మహారాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీవారికి పరమ భక్తుడు. తెలుగుదేశం ఎన్‌డిఏలో భాగస్వామిగా ఉన్నప్పుడే టిటిడి పాలక మండలిలో సభ్యత్వం అడిగారు. అవసరమైతే ఆర్థిక మంత్రి పదవి వదులుకుని వస్తానని చెప్పారు. తన భార్యకు ఇచ్చినా ఫర్వాలేదని చెప్పారు. అప్పుడే ముఖ్యమంత్రి మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడే ఇప్పుడు సప్నాకు టిటిడి బోర్డులో పదవి ఇచ్చారు’ అని వివరించారు.

బిజెపి రాష్ట్రానికి ఇచ్చిన మాట తప్పినా ఫర్వాలేదు. ఒకవైపు పోరాడుతున్నామని ప్రజలకు చెబుతారు. ప్రజలను బిజెపి నేతలపై రెచ్చగొడతారు. మరోవైపు మీకు నచ్చిన అదే బిజెపి నేతలకు పదవులు ఇస్తారా? అని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఏం చేద్దాం…ముఖ్యమంత్రి మాట తప్పరు…మడమ తిప్పరు!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*