బాబు చేసిన ‘కుట్ర’నే…జగన్‌ చేస్తున్నారా..?!

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘కుట్ర’ అనే పదాన్ని తరచూ వాడుతున్నారు. వైసిపి, బిజెపి, జనసేన చేసే ప్రతి చర్యనూ కుట్రగా చెబుతున్నారు. ఈ మూడు పార్టీలూ రాష్ట్రంలో టిడిపికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయని అంటున్నారు. ఆ పార్టీలు నిజంగానే కుట్రలు చేస్తున్నాయా? లేక వ్యూహాత్మకంగానే చంద్రబాబు నాయుడు కుట్ర అనే మాటను ఆ పార్టీలపైకి ప్రయోగిస్తున్నారా? ఇంతకీ కుట్ర అంటే అర్థం ఏమిటి? ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలు కుట్రగా కనిపిస్తున్నాయా?

ఎన్‌డిఏలోకి రావాలంటూ కేంద్ర సహాయ మంత్రి రాందాస్‌ అథవాలే వైసిపిని ఆహ్వానించారు. ఆ పార్టీ అధినేత జగన్‌ ముఖ్యమంత్రి కావడానికి సహకరిస్తామని కూడా ఆయన అన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…’భాజపా, వైసిపి కుట్రలు తేటతెల్లం అయ్యాయి’ అని వ్యాఖ్యానించారు.

ఎన్‌డిఏ అనేది కొన్ని రాజకీయ పార్టీలతో కూడిన ఒక కూటమి. బిజెపి నేతృత్వం వహిస్తోంది. మొన్నటి దాకా టిడిపి కూడా అందులో భాగస్వామిగా ఉంది. కొన్ని నెలల క్రితమే బయటకు వచ్చింది. కూటమిని బలోపేతం చేసుకోవాలని బిజెపి భావిస్తోంది. ఇందులో భాగంగా కూటమిలోకి రావాలని వైసిపిని ఆహ్వానించింది. ఒకవేళ వైసిపి ఎన్‌డిఏలో చేరితే….అది కుట్ర అవుతుందా? ఎన్‌డిఏలో చేరడమే కుట్ర అయితే….తెలుగుదేశం కూడా అదే కుట్రకు పాల్పడిందని అనుకోవాలా? టిడిపి…ఎన్‌డిఏలో ఉంటే రాష్ట్రం కోసం ఉన్నట్లు….అదే వైసిపి చేరితో రాష్ట్రానికి ద్రోహం చేసినట్లు! కుట్రలు చేసినట్లు!! ఇదే చంద్రబాబు నాయుడు చెబుతున్నది.

గత ఎన్నికల్లో బిజెపి, టిడిపి, జనసేన కలిసి పోటీ చేశాయి. అప్పుడు వైసిపికి వ్యతిరేకంగా ఈ మూడు పార్టీలూ కలిసి కుట్రలు చేశాయని అనాలా? ఉమ్మడి రాష్ట్రంలో 2004 ఎన్నికల్లో టిడిపిని ఓడించడానికి మహాకూటమి ఏర్పాటు చేశారు. ఆ కూటమి విజయం సాధించింది కూడా. అంటే అప్పుడు టిడిపికి వ్యతిరేకంగా కుట్రలు చేసినట్లా? 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అన్ని పార్టీలూ కలిసి పోటాచేశాయి. అది కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జరిగిన కుట్ర అవుతుందా? పార్టీల మూల సిద్ధాంతాలు, విధానాలకు వ్యతిరేకంగా ఏ పార్టీలు కలిసినా విమర్శ చేయవచ్చు. అందులో తప్పులేదు. అయితే…దాన్ని కుట్రగా పేర్కొనడం మాత్రం అభ్యంతరమే.

తన ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రతి చర్యనూ కుట్రగా చెప్పడం ద్వారా ఆ పార్టీపై జనంలో వ్యతిరేకత తీసుకురావాలని వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. పోలవరంలో అవినీతి జరిగిందని ఎవరైనా అంటే….దాన్ని కుట్ర అన్నారు. బిజెపితో కలిసివున్నప్పుడు ప్రత్యేక హోదా కోసం బంద్‌ నిర్వహిస్తే… రాష్ట్రంలో అశాంతి రేపేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అంతెందుకు….రాష్ట్రలో క్రూరమైన పార్థివ్‌ దొంగల ముఠా తిరుగుతోందని జనం భయపడుతూ….అనుమానాలతో ఒకరిద్దరిపై దాడులు చేశారు. దీన్ని కూడా కుట్రగానే అభివర్ణించారు ముఖ్యమంత్రి.

వ్యూహ ప్రతివ్యూహాలు తప్ప…ఒకపార్టీపైన ఇంకోపార్టీ ఎప్పటికీ కుట్రలు చేయజాలదు. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీకే ద్రోహం తలపెట్టడాన్ని కుట్రగా చెప్పడానికి అవకాశం ఉంది తప్ప….ఈ పార్టీని ఆ పార్టీ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే అది కుట్రకాదు. ఎన్‌టిఆర్‌ను చంద్రబాబాబు పదవీచ్యుతిడిని చేసినపుడు…ఎన్‌టిఆర్‌ సహా కొందరు కుట్ర అంటే…ఇంకొందరు తిరుగుబాటు అని చెప్పారు. అందుకే రాజకీయాల్లో దేన్నీ కుట్ర అని అనలేం. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇవన్నీ తెలియవని అనుకోలేం. అయితే… వైసిపి, బిజెపి వేస్తున్న రాజకీయ ఎత్తుగడలను ‘కుట్ర’ వ్యూహం ద్వారా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నట్లున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*