బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలంటే మనసు రాదా…!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ముగిసిన తరువాత టిటిడి ఉద్యోగ కార్మికులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వడం దాదాపు రెండు దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. అయినా….బహుమానం అందివ్వడంలో ప్రతిఏటా జాప్యం జరుగుతూనే ఉంది. ఉత్సవాలు ముగిసిన మూడు నెలలకో ఆరు నెలలకో తప్ప వెంటనే ఇవ్వడం లేదు. దీనిపై ఉద్యోగ కార్మికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ ఏడాది కూడా అదే జరుగుతోంది.

ఈసారి రెండు బ్రహ్మోత్సవాలు…సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఉద్యోగ కార్మికులు ఎంతగానో శ్రమించి రెండు ఉత్సవాలను విజయవంతం చేశారు. ఉత్సవాలు ముగిసినప్పటి నుంచి బ్రహ్మోత్సవ బహుమానం ఇస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. సాధారణంగా బహుమానం మంజూరుకు సంబంధించి టిటిడి బోర్డు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతుంది. ప్రభుత్వ ఆమోద ముద్ర పడిన తరువాత చెల్లిస్తుంది. ఈసాడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌లో బ్రహ్మోత్సవాలు ముగిస్తే….నవంబర్‌లో బోర్డు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. అయితే…ఇప్పటిదాకా ప్రభుత్వం జీవో విడుదల చేయలేదు.

ఇటువంటి జాప్యం జరుగుతుందని తెలిసే….టిటిడి అధికారులు బ్రహ్మోత్సవాలకు మునుపు జరిగిన బోర్డు సమావేశంలోనే బహుమానానికి సంబంధించిన తీర్మానాన్ని సిద్ధం చేసి అజెండాలో చేర్చారు. ప్రతిఏటా కానుక ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని, ఆ జాప్యాన్ని నివారించడానికే ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేశామని కూడా అందులో పేర్కొన్నారు. అయితే….ఆ సమావేశంలో బోర్డు ఆ తీర్మానాన్ని తిరస్కరించింది. దీంతో విధిలేకుండా నవంబర్‌ నెలలో జరిగిన సమావేశంలో మళ్లీ అజెండాలో చేర్చారు. ఎటూ ఇవ్వాలి కాబట్టి బ్రహ్మోత్సవాలకు ముందు జరిగిన బోర్డు సమావేశంలోనే ఆమోదించి ప్రభుత్వానికి పంపివుంటే….ఈపాటికి బహ్మ్రాత్సవ బహుమానం ఉద్యోగ కార్మికుల అకౌంట్లకు చేరివుండేది.

ఇదిలావుండగా ఈ ఏడాది రెగ్యులర్‌ ఉద్యోగులకు రూ.13,500; కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6,600 బ్రహ్మోత్సవ బహుమానంగా ఇవ్వాలని నిర్ణయించారు. గత ఏడాదితో పోల్చితే ఈ పెరుగుదల బహు స్వల్పం. గత ఏడాది రెగ్యులర్‌ ఉద్యోగులకు 13,125 ఇచ్చారు. అంటే ఈసారి పెరిగింది రూ.375 మాత్రమే. కాంట్రాక్టు ఉద్యోగులకు గత ఏడాది రూ.6,562 ఇచ్చారు. ఈసారి రూ.38 పెంచారన్నమాట. ప్రతిఏటా 10 పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. రెగ్యులర్‌, కాంట్రాక్టు అనే తేడా లేకుండా అందరికీ సమానంగా ఇవ్వాలన్న డిమాండ్‌ ఉంది. ఇవేవీ పట్టకుండా నామమాత్రపు పెంపుదలతో ముగించారు. అదీ సకాలంలో అందివ్వకుండా జాప్యం చేస్తున్నారన్న పెదవి విరుపు మాటలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి.

వీడియో చూడాలంటే కింది లింకుపై క్లిక్ చేయండి….

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*