భయపెడుతున్న కరోనా…శ్రీవారి దర్శనానికి దూరమవుతున్న భక్తులు..!

కరోనా విపత్తు వేళ టిటిడి అధికారులు సాహసం చేసి, తిరుమల శ్రీనివాసుని‌ దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. అయితే భక్తులు మాత్రం కరోనాకు భయపడి , స్వామివారి దర్శనానికి దూరం అవుతున్నారు. దర్శనం కోసం టికెట్లు ముందుగా బుక్ చేసుకున్న వారు కూడా, తమ యాత్రను రద్దు చేసుకుంటున్నారు.

కరోనా లాక్ డౌన్ అనంతరం‌ నెల రోజుల కిందట దర్శనాలు పున: ప్రారంభించారు. మొదట్లో రోజుకు ఆరు వేల నుంచి ఏడు‌వేల మందిని దర్శనానికి‌ అనుమతించారు. ఆ తరువాత ఈ సంఖ్యను 12 వేలకు పెంచారు. ఆన్ లైన్ లో ఇచ్చే రూ.300 టికెట్లు తీసుకునే వారు, ఒక రోజు ముందుగా తిరుపతిలో ఇచ్చే ఉచిత దర్శనం టికెట్లు పొందినవారు మాత్రమే తిరుమలకు వచ్చేలా నిబంధనలు విధించారు.

ఇదిలావుండగా… మొదట్లో టికెట్లు తీసుకున్న భక్తులంతా దర్శనాలకు వచ్చారు. అయితే కొంతకాలంగా…. ముందుగా‌ టికెట్లు పొందిన భక్తుల్లో చాలామంది దర్శనాలకు రావడం లేదు. రోజుకు‌12 వేల మంది రావాల్సి ఉంది. ఓ పత్రిక కథనం మేరకు…మొన్న శుక్రవారం నాడు 8,115 మంది మాత్రమే వచ్చారు. అంటే 4000 మంది దర్శనం వద్దనుకున్నారు. అదేవిధంగా గురువారం 9,582 మంది, బుధవారం 10,109 మంది దర్శించుకున్నారు. ఆ రెండు రోజుల్లోనూ 2000 మందికిపైగా దర్శనానికి రాలేదు. మొదట్లో తిరుపతిలో ఇచ్చే ఉచిత దర్శనం టికెట్లు కొన్ని గంటల్లో ‌అయిపోయేవి. ఇప్పుడు మిగిలిపోతున్నాయని చెబుతున్నారు.

టిక్కెట్లు పొందినా దర్శనానికి రాకపోవడానికి ప్రధాన కారణం కరోనా భయమే అని తెలుస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులెవరికీ కరోనా సోకలేదని టిటిడి అధికారులు పదే పదే ప్రకటిస్తున్నా భక్తుల్లో మాత్రం భయం పోలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇటీవల కాలంలో టీటీడీ ఉద్యోగులు 90 మంది దాకా కరోనా బారిన పడినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో భక్తుల్లో ఆందోళన తీవ్రమయినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశవ్యాపితంగా కరోనా పెరగడం వల్ల కూడా జనం ప్రయాణాలకు జంకుతున్నారు. అందుకే టికెట్లు ఉన్నా తిరుమల యాత్ర రద్దు చేసుకుంటున్నారు. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*