మందుబాబులకు అడ్డాగా పిఆర్ అతిథిగృహం..!

  • ఎటు చూసినా మద్యం బాటిళ్లు, గ్లాసులు
  • పట్టించుకోని అధికారులు

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

అది ప్రభుత్వ కార్యాలయం. చుట్టుపక్కల ఎటు చూసినా ఖాళీ మద్యం సీసాలు, వాటర్ బాటిల్స్, గ్లాసులే కనబడతాయి. మరుగులో ఉన్న ఖాళీ ప్రదేశం, పైగా ఎవ్వరూ అడగరూ…. పట్టింకోరు… ఇంకేముంది మందుబాబులు తమ అడ్డాగా మార్చేసుకున్నారు. నిత్యం అక్కడే తాగి తూగుతూ కనిపిస్తుంటారు. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో కాదు…శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది సమీపంలో..

శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి బస్టాండ్ ఎదురుగా వంతెనకు సమీపంలో ఉన్న పంచాయతీ రాజ్ అతిథిగృహం మందుబాబులకు అడ్డాగా మారుతోంది. ప్రభుత్వం మద్యం షాపుల సమీపంలో మద్యం తాగరాదని నిబంధనలు పెట్టడంతో అతిథిగృహం వారికి అడ్డాగా మారింది. సమీపంలో నే మద్యం దుకాణం ఉండటంతో అక్కడ మద్యం కొనుగోలు చేస్తున్న మందుబాబులు పంచాయతీ రాజ్ అతిథిగృహం ఆవరణంలోనే రాత్రి పగలనక తాగుతున్నారు. చుట్టూ ప్రహరీ, చల్లని నీడనిచ్చే చెట్లు, కూర్చోడానికి సిమెంటు బండలు ఉండటంతో మద్యం ప్రియులు ఎంచక్కా ఇక్కడే కూర్చుని మద్యం‌ సేవిస్తూ ఆస్వాదిస్తున్నారు. కార్యాలయానికి మాత్రం తాళం వేసున్నా పరిసర ప్రాంతాల్లో నిత్యం ఇదేతంతు.

ఎప్పుడో సమీక్షలు, సమావేశాలకు మాత్రమే ఇక్కడకు విచ్చేస్తున్న అధికారులు మిగిలిన సమయంలో దీని గురించి పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ కార్యాలయం పక్కనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉండటంతో ఎప్పుడు ఏంజరుతుందో అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పేరుకు ఇక్కడ సెక్యూరిటీ ఉన్నా పట్టించుకోని పరిస్థితి. సంబంధిత అధికారులు ఇకనైనా స్పంధించి ప్రభుత్వ అతిథిగృహం లో మందు సేవించడాన్ని అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*