మతిలేని చేష్టలు…అంబేద్కర్‌కు మూడు నామాలు!

మతం వ్యక్తిగతమైనది. ఎవరికి నచ్చిన మతాన్ని వారు అనుసరించవచ్చు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఎదుటి వాళ్ల మత విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుంది. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్న కొందరు ఎలాంటి అనైతిక చర్యలకైనా వెనుకాడటం లేదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ దళితవర్గంలో జన్మించిన మేధావి. దళితులను హిందూమతంలో భాగంగా చెబుతున్నా….ఆచరణలో దళితులను రెండుశ్రేణి పౌరులుగా చూస్తున్నారు. కులం పేరుతో అంటరానివాళ్లుగా చూస్తున్నారు. అంబేద్కర్‌ జీవించివున్నప్పటి ఈ దరావస్థ చాలా తీవ్రంగా ఉంది. హిందూ మతాన్ని వదిలేస్తే వివక్ష అంతమవుతుందని భావించారు. అంబేద్కర్‌ ఆలోచన తెలిసిన క్రైస్తవ మతస్తులు, ఇస్లాం మతస్తులు ఆయన్ను కలిసి తమ మతంలోకి రమ్మని ఆహ్వానించారు. ‘మా మతంలోకి వస్తే గౌరవంగా జీవింవచ్చు’ అని చెప్పారు. అంబేద్కర్‌ అంత తొందరగా నిర్ణయం తీసుకోలేదు. అన్ని విధాలా ఆలోచించిన తరువాత….అద్భుతమైన జీవన విధానంతో మిలితమైన బౌద్ధాన్ని మతంగా స్వీకరించారు. లక్షల మంది ఆయన్ను అనుసరించారు. మతం మారినందుకు హిందువులు ఆయన్ను ద్వేషించలేరు. తమ మతంలోకి రానందుకు క్రైస్తవులు, ఇస్లాం మతస్తులు ఆయన్ను నిందించలేరు. ఎందుకంటే….ఆయనకు నచ్చిన మతాన్ని ఆయన స్వీకరించారు. అంబేద్కర్‌ ఇప్పుడు మన మధ్యన లేరు. అయినా ఆయన్ను కోట్లాది మంది భారతీయులు గౌరవిస్తారు. ఆరాధిస్తారు. మతోన్మాదులు ఆయన విగ్రహానికి కాషాయ రంగు పులిమితే…కొన్నిచోట్ల విగ్రహాలను పగలగొట్టారు. ఎవడో ఓ మహానుభావుడు అంబేద్కర్‌ నుదుట మూడు నామాలు దిద్దాడు. ఇంతకంటే మతిలేని చేష్టలు ఇంకేమైనా ఉంటాయి?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*