మన్నవరానికి మంచిరోజులు వచ్చేనా…! పదేళ్లు నిండినా పునాదుల్లోనే…!!

  • వలిపి శ్రీరాములు, ధర్మచక్రం ప్రతినిధి, శ్రీకాళహస్తి

నవ్యాధ్రలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటంతో మన్నవరం విద్యుత్‌ ఉపకరణాల తయారీ ప్రాజెక్టుకు మంచి రోజులు వస్తాయని తూర్పు మండలాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీ నాటికి ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేసి సరిగ్గా పదేళ్లు అవుతోంది. అయితే….గత పాలకుల సవతిప్రేమ కారణంగా మన్నవరం ప్రాజెక్టు మూతపడే స్థితికి చేరుకుంది. ఇది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కలల ప్రాజెక్టు. తండ్ర కల నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉంది.

శ్రీకాళహస్తి మండలంలోని మన్నవరం గ్రామ పరిధిలో ఎన్‌టిపిసి – బిహెచ్‌ఈఎల్‌ ఉమ్మడిగా ఎన్‌బిపిపిఎల్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రావడానికి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఎంతో కృషి చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మన్నవరం సమీపంలో మొదటి విడతగా 750 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేయకుండానే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చిత్తూరులో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమానికి వస్తూ…మార్గమధ్యంలో హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందారు.

ఆ తరువాత 2010 సెప్టెంబర్‌ 1వ తేదీన మన్నవరం ప్రాజెక్టుకు అప్పటి భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేతుల మీదుగా భూమిపూజ చేశారు. అప్పట్లో ఈ ప్రాజెక్టు అంచా వ్యయాన్ని రూ.6,500 కోట్లుగా నిర్ధారించారు. ప్రత్యేకంగా….పరోక్షంగా సుమారు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూడా ప్రకటించారు. 2014 సంవత్సరం చివరి నాటికి ఈప్రాజెక్టు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తుందని కూడా అప్పట్లో హామీ ఇచ్చారు. ప్రధానమంత్రే స్వయంగా ఈ హామీ ఇవ్వడంతో ఈ ప్రాంతంలో అభివృద్ధితుంది అందరూ ఆశపడ్డారు.

పాలకుల నిర్లక్ష్యంతో… : దక్షిణ భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే మన్నవరం విద్యుత్‌ ఉపకరణాల తయారీ ప్రాజెక్టుకు పాలకుల నిర్లక్ష్యం శాపంగా మారింది. భూమిపూజ ఎంతో ఘనంగా చేసినా….నిర్మాణ విషయంలో పాలకులు నిర్లక్ష్యం చేశారు. అప్పట్లో అటు కేంద్రంలోనూ….ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఎన్‌బిపిపిఎల్‌ ప్రాజెక్టు పట్ల తగిన శ్రద్ధ చూపలేదు. అ నిర్లక్ష్యమే ప్రాజెక్టు ముందుకు సాగకపోడానికి కారణమయింది. ఇక ఆ తరువాత అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం…తెలుగుదేశం ప్రభుత్వం మన్నవరం ప్రాజెక్టు గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మూతపడే స్థితికి చేరుకుంది.

అంతర్గత పోరుతో… : మన్నవరం విద్యుత్‌ ఉపకరణాల తయారీ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఎన్‌టిపిసి, బిహెచ్‌ఈఎల్‌ సంస్థలు స్వీకరించాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని చెరోసగం భరించాలని కూడా ఒప్పందం ఉదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా మొదట్లో రెండు సంస్థలు చెరో రూ.100 కోట్లు వంతున కేటాయించాయి. ఈ నిధులతో ప్రహరీ, పరిపాలన భవనం, ఉత్పత్తి భవనం నిర్మించారు. ఉత్పత్తికి అవసరమైన యంత్రాలను కూడా కొంతమేర కొనుగోలు చేశారు. ఆ తరువాత ఎన్‌బిపిపిఎల్‌ ఛైర్మన్‌ నియామకం విషయంలో విభేదాలు పొడచూపాయి. ఈ కారణంగా అంతర్గత పోరు ప్రారంభమయింది. ఈ విభేదాలు అందరూ ఢిల్లీలోనే ఉంటూ..ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంటారు. ప్రాజెక్టు అభివృద్ధికి అవసరమైన నిధులు కూడా విడుదల చేయకుండా ఉండిపోయారు.

నామమాత్రపు ఉత్పత్తి : మన్నవరం విద్యుత్‌ ఉపకరాల తయారీ ప్రాజెక్టులో కొంతకాలం పాటు నామమాత్రపు ఉత్పత్తి జరిగింది. బయట నుంచి ఆర్డర్లు వచ్చేటప్పటికి అంతుకు అనుగుణంగా ఇక్కడ ఉత్పత్తి చేయలేదు. అయితే అధికారుల వాదన మరో విధంగా ఉంది. దేశవ్యాపితంగా సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఎక్కువయినందు వల్ల…ఇక్కడ తయారుచేసే విద్యుత్‌ ఉపకరణాలకు డిమాండ్‌ తగ్గిందని చెబుతున్నారు. ఈ కారణంగానే ప్రాజెక్టు నష్టపోతోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్పత్తి దాదాపుగా ఆగిపోయింది.

మౌలిక వసతుల లేమి : మన్నవరం ప్రాజెక్టుకు మౌలిక వసతులు లేవు. ఈ ప్రాజెక్టుకు వెళ్లాలన్నా సరైన మార్గం లేదు. భారీ వాహనాలు వెళ్లాలంటే చాలా కష్టం. ఎన్నో ఏళ్ల కిందట వాంపల్లె నుంచి మన్నవరం వరకు నాలుగులేన్ల రోడ్డు మంజూరు చేసినప్పటికీ ఆచరణలో పూర్తికాలేదు. ఇక ఈ ప్రాజెక్టులో నీటి సమస్యను తీర్చడానికి సోమశిల-సర్ణముఖి అనుసంధాన కాలువను వినియోగించుకోవాలని ప్రతిపాదించారు. అది కూడా ఆచరణకు నోచుకోలేదు. ఇక అధికారులు, సిబ్బంది ఉండటానికి సరైన వసతులు లేవు.

‘రియల్‌’ ఢమాల్‌ : మన్నవరం ప్రాజెక్టు రాకతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అంతకు మునుపు ఎకరా రూ.2 లక్షల లోపు ఉండేది. ప్రాజెక్టు రావడంతో ఎకరా రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలు పలికింది. తిరుపతి, శ్రీకాళహస్తి, నెల్లూరు, చెన్నై, వెంకటగిరి, హైదరాబాద్‌ ్పఆంతాలకు చెందిన రియల్‌ వ్యాపారులు పోటీపడి భూములు కొనుగోలు చేశారు. ఉద్యోగులు కూడా ఈ ప్రాంతంలో ప్లాట్లు కొన్నారు. మన్నవరం మూతపడేస్థితికి చేరుకోవడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ఇక్కడ ప్లాట్లు, భూమి అడిగేవారు కరువయ్యారు. వ్యాపారులు వందల కోట్ల రూపాయలు నష్టపోయారు.

పాదయాత్రలో జగన్‌ హామీ : వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మన్నవరం ప్రాజెక్కుటను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. నాన్న (వైఎస్‌) కలను నెరవేరుస్తానని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడిచేసి ప్రాజెక్టును పూర్తిచేయిస్తే….ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి చొరవ చూపాల్సిన అవసరం కనిపిస్తోంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్‌ రెడ్డి మన్నవరంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*