మన యూనివర్సిటీలకు యూత్‌ ఫెస్టివల్‌ పట్టదా..!

తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో సౌత్‌జోన్‌ యూనివర్సిటీల యువజనోత్సవాలు జరుగుతున్నాయి. దక్షిణ భారత దేశంలోని 36 యూనివర్సిటీల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పద్మోత్సవ్‌ పేరిట నిర్వహిస్తున్న యూత్‌ ఫెస్టివల్‌కు 1200 మందికిపైగా విద్యార్థులు తరలివచ్చారు. ఇదంతా బాగానేవుందిగానీ….ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలకు ఏమయిందోగానీ… ఎవరూ పెద్దగా పాల్గొనడం లేదు. ఐదంటే ఐదు యూనివర్సిటీలు మాత్రమే ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకొక యూనివర్సిటీ ఏర్పడింది. చిత్తూరు జిల్లాలోనైతే ఏకంగా ఏడు యూనివర్సిటీలున్నాయి. అయితే….ఆతిథ్యం ఇస్తున్న మహిళా వర్సిటీతో పాటు ఎస్‌వియూ, ఆచార్య నాగార్జున వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆదికవి నన్నయ యూనవర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీల విద్యార్థులు మాత్రమే ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. కనీసం తిరుపతి కేంద్రంగా ఉన్న వెటర్నరీ వర్సటీ, వేదిక్‌ వర్సిటీ, స్విమ్స్‌ యూనివర్సిటీ, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం కూడా ఈ పోటీల్లో భాగస్వామి కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ద్రవిడ వర్సిటీ అయితే…ద్రవిడ భషలతో పాటు ద్రవిడ సంస్కృతి సంప్రదాయాలపై పరిశోధనలు, అధ్యయనం చేయడానికే ఏర్పడిన సంస్థ. ఇటువంటి సంస్థ నుంచి కూడా యువజన సాంస్కృతిక ఉత్సవాల్లో భాగవస్వామ్యం లేకపోవడం బాధ్యతారాహిత్యమే అవుతుంది.

ఎక్కడో కేరళ నుంచి ఐదారు యూనివర్సిటీలు వచ్చాయి. కర్నాటక, తమిళనాడు నుంచి ఎక్కువ యూనివర్సిటీలు తరలివచ్చాయి. సొంత బస్సులు పెట్టుకుని వందల కిలోమీటర్ల అవతల నుంచి విద్యార్థులు వచ్చారు. ఇందుకోసం ఒక్కో యూనివర్సిటీ విద్యార్థులకు లక్షల్లో ఖర్చుపెడుతున్నాయి. తిరుపతిలోని యూనివర్సిటీలు పార్టిసిపెంట్‌ ఫీజు ఒకొక్కరికి రూ.1000 కడితే సరిపోయేది. ప్రయాణ ఖర్చులు ఏమీవుండవు. పది మందిని పంపితే రూ.10 వేలతో అయిపోతుంది. అయినా యూనివర్సిటీ విసిలు ఎందుకు పట్టించుకోలేదు?

ఇటువంటి ఉత్సవాల్లో విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతాయి. మన సంస్కృతిని, కళలను ఇతర ప్రాంతాలకు పరిచయం చేస్తాయి. అన్నింటికన్నా ఇతర ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోడానికి దోహదపడతాయి. ఎక్కడో దూర ప్రాంతల్లో జరిగే ఉత్సవాలకు వెళ్లలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఒకటి రెండు యూవర్సిటీలు పాల్గొనలేదంటే ఏవో ఇబ్బందులుంటాయని భావించవచ్చు. మెజారిటీ వర్సిటీలు అసలు ఈ ఉత్సవాల గురించి పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని సంబంధిత యూనివర్సిటీల విసిలను వివరణ అడగాల్సిన అవసరం ఉంది. కళలను, క్రీడలను ప్రోత్సహిస్తున్నామని చెప్పుకోవడం కాదు. ఇటువంటి అవకాశాలు జారవిడుచుకోకుండా చూడటమూ అవసరమే. ఇందులో తేల్చాల్సింది ఏమంటే…విద్యార్థులు ఆసక్తిచూపలేదా లేక వర్సిటీలే పట్టించుకోలా…? అనేది ప్రభుత్వం నిగ్గుతేల్చాలి. వచ్చే ఏడాది నుండైనా ఇటువంటి ప్రతిష్టాత్మక ఉత్సవాలకు అన్ని వర్సిటీల నుంచి ప్రాతినిథ్యం ఉండేలా చూసుకోవాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*