మళ్లీ ఈనాడు శ్రీధర్‌పై భగభగ!

ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్‌ ఇటీవల కాలంలో కాస్త బ్యాలెన్స్‌ తప్పుతున్నట్లున్నారు. అందుకే ఆయన కార్టూన్లు తరచూ వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవల జరిగిన త్రిపుర ఎన్నికల్లో సిపిఎం ఓటమిపాలైతే….దాదాపు 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటూ, అవినీతికి, బంధుప్రీతికి, ఆశ్రితపక్షపాతానికి తావులేకుండా మచ్చలేని ముఖ్యమంత్రిగా దేశ ప్రజల మన్ననలు అందుకున్న మాణిక్‌ సర్కార్‌పైన వేసిన కార్టూన్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. నిజాయితీగా ఉండటమే తప్పున్నట్లు ఆయన కార్టూన్‌ చిత్రీకరించారు. తాజాగా మార్క్స్‌ 200వ జయంతిని పురస్కరించుకుని ఆయన వేసిన పాకెట్‌ కార్టూన్‌పైనా నెటిజన్లు భగ్గుమంటున్నారు. పైనుంచి మార్క్క్‌, లెనిన్‌ తదితర అమరులైన కమ్యూనిస్ట నాయకులు…బైనాక్లోర్‌లో కిందికి చూస్తూ…’కాంగ్రెస్‌ ఎవరూ లేరు…అంతా వచ్చేశారు’ అని మాట్లాడుకుంటున్నట్లు ఉంది ఆ కార్టూన్‌. ఆయన ఉద్దేశంలో మార్క్సిస్టులు ఎవరూ లేరని అర్థం.

ఈ దేశంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ కమ్యూనిస్టు పార్టీలు పోరాడుతున్నాయి. ప్రజలను చైతన్యవంతులను చేసి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు మార్క్సిజాన్ని ఆధారంగా చేసుకుని ప్రయత్నిస్తున్నాయి. మార్క్సిజం అనే సిద్ధాంతంతో పని లేకుండా రాజకీయాలు చేసివుంటే….కమ్యూనిస్టులు కూడా ఎప్పుడో అధికారంలోకి వచ్చేవాళ్లు. దేశ రాజకీయాలను పరిశీలించేవాళ్లు….’కమ్యూనిస్టులు కష్టపడుతున్నారుగానీ…అధికారంలోకి రాలేకపోతున్నారు’ అని కాస్త సానుభూతితో కూడిన మాటలు చెబుతుంటారు. అంతేగానీ….కమ్యూనిస్టులు నిబద్ధతను, సమాజం పట్ల వారికున్న అంకితభావాన్ని తప్పుపట్టేవారు ఉండరు. శ్రీధర్‌ గీత గీసేటప్పుడు అన్ని కోణాల్లో నుంచి ఆలోచిస్తారో ఆలోచించరోగానీ…ఒక్కోసారి ఆయన కార్టూన్‌లు మిస్‌ ఫైర్‌ అవుతున్నాయి. ఇప్పటికీ మార్క్సిజంపైన ఇంతటి చర్చ జరుగుతోందంటే…ఆ సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తున్నవారు ఉండబట్టే. శ్రీధర్‌ ఎవర్ని మార్క్సిస్టులుగా గుర్తిస్తారో ఏమోగానీ…కిందిస్థాయి కార్యకర్తల్లోనూ ఆ నిబద్ధత కనిపిస్తుంది. శ్రీధర్‌ చూడాలనుకున్నట్లు లేదు. ఇప్పటికైనా శ్రీధర్‌ తన కుంచెను సక్రమంగా తిప్పాలి. చెయ్యి తిరిగిన చిత్రకారుడిని కదా అని ఎలాగంటే అలా తిప్పితే అవి వక్రగీతల్లా మిగిలిపోతాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*