మళ్లీ తెరపైకి గాలి జనార్థన్‌ రెడ్డి! టిడిపి ఉక్కు ఉద్య‌మంపైకి బిజెపి అస్ర్తం|

గాలి జనార్ధన్‌ రెడ్డి ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలోనూ సుపరిచితం. గాలి పేరు చెప్పగానే బళ్లారి ఇనుప ఖనిజం కుంభకోణం గుర్తుకొస్తుంది. ఈ కేసులో జైలుపాలై విడుదలైన తరువాత గుట్టుచప్పుడు కాకుండా జీవిస్తున్న ఆయన ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. కడప జిల్లాలో 2007లో నిర్మాణం ప్రారంభించిన ఉక్కు పరిశ్రమనను తానే నిర్మిస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. ఇది కడప ఉక్కు పరిశ్రమ కోసం దీక్షలు చేస్తున్న తెలుగుదేశం పార్టీకి మింగుడుపడని విషయమే.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కడప జిల్లా జమ్మలమడుగు వద్ద బ్రాహ్మణి స్టీల్స్‌ పేరుతో ఉక్కు పరిశ్రమ నిర్మిణానికి 2007, జూన్‌ 10న శంకుస్థాపన జరిగింది. వేలాది కోట్ల పెట్టుబడి అవసరమైన ఈ పరిశ్రమను స్థాపించేందుకు గాలి జనార్థన్‌ రెడ్డి ముందుకొచ్చారు. వైఎస్‌ ప్రభుత్వం వందలాది ఎకరాలు ఈ పరిశ్రమ కోసం కేటాయిచింది. రూ. 1350 కోట్లు వెచ్చింది ఆ భూమి చుట్టూ గోడ నిర్మించారు. ఇంకా కొన్ని పనులు జరిగాయి. అప్పట్లో దీనిపైన పెద్ద దుమారం రేగింది. అన్ని వందల ఎకరాల భూములు ప్రైవేట్‌ వారికి ఎలా ఇస్తారంటూ వైఎస్‌ ప్రభుత్వాన్ని అప్పటి ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఈ భూముల్లో సెలయేరులు ప్రవహిస్తున్నాయని, జింకలు వంటి వన్యప్రాణులు జీవిస్తున్నాయని…ఇలా రకరకాల వాదనలు వచ్చాయి. దీంతో ఎంఎల్‌ఏలతో ఓ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఇంతలో వైఎస్‌ మరణించారు. దీంతో పరిశ్రమకు గ్రహణం పట్టింది. ఆ తరువాత బళ్లారి ఇనుప గనులపై విచారణ, గాలి జనార్థన్‌ రెడ్డి జైలుకెళ్లడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఆ తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బ్రాహ్మణి స్టీల్స్‌ గురించి పట్టించుకోలేదు.

రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా బ్రాహ్మణి స్టీల్స్‌ ఊసే లేకుండాపోయింది. బిజెపితో కలిసివున్న నాలుగేళ్లు టిడిపి కూడా దీన్ని గురించి అడగలేదు. బిజెపితో తెగదెంపులు చేసుకున్న తరువాత ఇప్పుడు కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని ఆందోళనలు చేస్తోంది. ఈ క్రమంలో గాలి జనార్థన్‌ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే తానే బ్రాహ్మణి స్టీల్స్‌ను పూర్తి చేస్తానని ముందుకొచ్చారు. రెండేళ్లలో పూర్తి చేయకుంటే ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చని, తాను ఖర్చు చేసిన నిధులు మాత్రం ఇస్తే సరిపోతుందని చెప్పారు. కడపలో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కేంద్రంగానీ, రాష్ట్రంగానీ ఇష్టంగా లేవు. ప్రైవేట్‌ వ్యక్తులతోనే పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నది రెండు ప్రభుత్వాల ఆలోచన. అందుకే బిజెపి జేబులో మనిషి అయిన గాలి జనార్థన్‌ రెడ్డితో ఈ ప్రకటన చేయించిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో టిడిపి ఇరుకున పడింది. ఉక్కు పరిశ్రమ కావాలంటున్న తెలుగుదేశం పార్టీ జనార్థన్‌ రెడ్డి ఏర్పాటు చేయకూడదని అనజాలదు. అంగీకరిస్తే…అది బిజెపి ఖాతాలోకి వెళుతుంది. తాము ఆశిస్తున్న వ్యక్తులకు పరిశ్రమ రాకపోతే టిడిపికి ఒరిగేదేమీ ఉండదు. గాలి ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఈ వెబ్‌సైట్‌లోని పాత క‌థ‌నాల కోసం క్లిక్ చేయండి….
www.dharmachakram.in

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*