మళ్లీ తెరపైకి శ్రీవారి ఆభరణాల వివాదం!

– కేంద్ర సమాచార కమిషన్‌ కోర్టులో మూడు ముఖ్యమైన వివాదాలు
– ఆభరణాలు, సంరక్షిత కట్టడంగా శ్రీవారి ఆలయం, టిటిడిలో ఆర్‌టిఐ చట్టం
– నిర్ధిష్ట పరిష్కారాలు లభించేనా?

ఇటీవల కొన్ని నెలల పాటు పెద్ద దుమారమే రేపిన తిరుమల శ్రీవారి ఆభరణాల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులే స్వయంగా శ్రీవారి ఆభరణాలు గల్లంతయ్యాయని ఆరోపణలు చేసిన నేపథ్యంలో దానిపై దేశ వ్యాపితంగా చర్చ సాగింది. ఆభరణాల వివాదాన్ని తేల్చడానికి న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుతం హైకోర్టుకు లేఖ రాసింది. మరోవైపు ఈ అంశంపై ఎంపి సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో కేసు వేశారు. రాష్ట్ర హైకోర్లులోనూ కేసు నడుస్తోంది. క్రమంగా ఈ వివాదం సద్దుమణిగింది.

ఇప్పుడు తాజాగా కేంద్ర సమాచార కమీషనరే జోక్యం చేసుకోవడంతో మళ్లీ చర్చనీయాంశమయింది. కృష్ణదేవరాయలంలో శ్రీవారికి సమర్పించిన ఆభరణాల వివరాలను శాసనాల్లోనూ కనిపిస్తున్నా….టిటిడి వద్ద లేవు. ఈ విషయాన్ని టిటిడి అధికారులే అంగీకరిస్తున్నారు. 1952లో నగలు నమోదు రికార్డులు (తిరువాభరణ రిజిస్టర్‌) ప్రారంభించినప్పటి నుంచి ఆభరణాలకు లెక్కలున్నాయి తప్ప…అంతకు మునుపువి ఏమయ్యాయో తెలియదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే గుంటూరుకు చెందిన బికెఎస్‌ఆర్‌ అయ్యంగార్‌ అనే వ్యక్తి…సమాచార హక్కు చట్టం ద్వారా ఆభరణాల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. టిటిడితో మొదలుపెట్టి కేంద్ర ప్రభుత్వం దాకా ఎవరిని అడిగినా సరైన సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆయన కేంద్ర సమాచార కమిషన్‌కు వెళ్లారు. దీనిపై స్పందించిన కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌…టిటిడితో పాటు ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా, కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చారు.

ఆభరణాల గురించి రమణ దీక్షితులు ప్రశ్నించినపుడు….సరైన సమాధానం ఇవ్వకుండా ఎదురుదాడికి దిగిన టిటిడి…కొంత కాలయాపన చేసి, వివాదం సద్దుమణిగేసరికి మౌనం దాల్చింది. అయితే….సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. రెండేళ్లకోసారి శ్రీవారి ఆభరణాలను లెక్కిస్తామని ప్రకటించిన ప్రభుత్వం కూడా ఇప్పటి దాకా దాని గురించి ఆలోచించలేదు. గతంలో ఎన్నిసార్లు శ్రీవారి ఆభరణాలు లెక్కించివున్నా….ప్రస్తుతం తీవ్రస్థాయిలో వివాదం తలెత్తిన నేపథ్యంలో మళ్లీ ఇంకోసారి ఆభరణాల లెక్కింపు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇది చేయగలిగితేనే…కోర్టుల్లో ఉన్న వివాదాలకూ టిటిడి సమాధానం చెప్పగలదు. అయితే…ఇదేదో ఆషామాషీ వ్యవహారంలో వదిలేశారు.

కేంద్ర సమాచార కమిషన్‌ టిటిడికి సంబంధించి ఇంకో కీలక అంశాన్నీ ప్రస్తావించింది. తిరుమలలోని పురాతన కట్టడాలను పరిరక్షించడానికి తీసుకున్న చర్యల గురించి పురావస్తు శాఖను ప్రశ్నించింది. తిరుమల శ్రీవారికి ఆలయానికి వెయ్యేళ్లకుపైబడిన చరిత్ర వుంది. ఇటువంటి కట్టడాన్ని సంరక్షిత కట్టడాల జాబితాలోకి ఎందుకు చేర్చలేదని కమిషనర్‌ ప్రశ్నిస్తున్నారు. ఆ విధంగా చేర్చివుంటే వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చేసేవారా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్లో వాస్తవముంది. సంరక్షిత కట్టడాల జాబితాలో తిరుమల కట్టడాలు ఉండివుంటే…వాటికి ముప్పువుండేది కాదు. అభివృద్ధి పేరుతో ఆలయంలో ఇష్టారాజ్యంగా మార్పులు చేస్తున్నారన్నది వాస్తవం. పురావస్తు శాఖ అధికారులు కూడా చూస్తూవుండటం తప్ప ఏమీ చేయలేకున్నారు. ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలోకి వెళితే….పూజలకు కూడా ఇబ్బంది అవుతుందని వాదిస్తున్నవారు ఉన్నారు. అందుకే దీనికి పరిష్కారంగా…ఆలయ నిర్మాణం వరకే పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉండేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని మాజీ ఈవో, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు సూచించారు.

ఇక ఇప్పుడు చర్చనీయాశమైన మరో అంశం…సమచారా హక్కు చట్టం టిటిడికి వర్తిస్తుందా…వర్తించదా? టిటిడి అధికారులేమో ఆ చట్టం తమకు వర్తించదని అంటున్నారు. టిటిడి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కనుక సమాచార హక్కు చట్టం వర్తించబోదంటూ….చాలాకాలంగా ఆర్‌టిఐ దరఖాస్తులను తిరస్కరిస్తోంది. టిటిడి పాలక మండలి నియామకం ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ చట్టం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తున్నందున….టిడిడికీ ఆర్‌టిఐ వర్తిస్తుందనేది సమాచార కమిషన్‌ అభిప్రాయంగా ఉంది. ఎందుకో తెలియదుగానీ….సమాచార హక్కు చట్టమంటే టిటిడి వెనకడుగు వేస్తోంది. ఆలయ సంప్రదాయాలు, పూజాది కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను మినహాయించి, పరిపాలనా వ్యవహారాలు, ఆర్థిక విషయాలకు సంబంధించిన వివరాలనైనా ఆర్‌టిఐ కింద ఇవ్వాలని కోరుతున్నా అధికారులు నిరాకరిస్తున్నారు. కేంద్ర సమాచార కమిషన్‌ జోక్యం చేసుకుని టిటిడికి ఆర్‌టిఐ వర్తిస్తుందా వర్తించదా అనే దానిపైన నిర్ణయాన్ని వెలువరించాల్సిన అవసరం ఉంది.

కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ న్యాయకోవిధుడు. భారతీయ చట్టాలపైన, రాజ్యాంగంపైన సమగ్రమైన అవగాహన కలిగిన నిపుణుడు. శ్రీవారి ఆభరణాలు, తిరుమల ఆలయ కట్టడాల పరిరక్షణ, టిటిడిలో సమాచార హక్కు చట్టం అమలు ఈ మూడు అంశాలూ ఆయన ముందుకు వెళ్లాయిగనుక….ఈ మూడు వివాదాలకు నిర్ధిమైన పరిష్కారం లభిస్తుందన్న ఆశ శ్రీవారి భక్తుల్లో కలుగుతోంది. ఏం జరుగుతుందో చూద్దాం!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*