మహాకూటమి ఓటమి : చంద్రబాబు ఊసెత్తని మీడియా..!

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జరిగినన్ని రోజులు చంద్రబాబును వీరుడు శూరుడు అంటూ ఆకాశానికికెత్తిన మీడియా….మహాకూటమి ఓటమి పాలైన సందర్భంగా బాబు ఊసేలేకుండా వార్తలు ప్రచురించాయి. ప్రసారం చేస్తున్నాయి. తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్‌కు పెద్ద ఊపు వచ్చిందని, హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఉన్న ఫాలోయింగ్‌ చూసి రాహుల్‌ గాంధీ కూడా ఆశ్చర్యపోయారని, కూటమి కింగ్‌ చంద్రబాబే అని రకరకాలుగా కథనాలు ప్రచురించి, ప్రసారం చేసిన మీడియా ఇప్పుడు ఆ కోణంలో విశ్లేషణలు చేయడానికి ఇష్టపడటం లేదు. అసలు కాంగ్రెస్‌ – టిడిపి కూటమిని జనం ఆమోదించారా లేదా అనే అంశంపైన కూడా చర్చ చేయడం లేదు.

కూటమి గెలిచివుంటే….ఈపాటికి ప్రచారం హోరెత్తేది. బాబు చాణక్యం వల్లే కాంగ్రెస్‌ కూటమి గెలిచిందని ఊదరగొట్టేది. ఘనతంతా టిడిపిదేనని, కాంగ్రెస్‌ది ఏమీ లేదని విశ్లేషణలు చేయించేది. గెలిచివుంటే…ఆ విధంగా చేయడంలో తప్పులేదుగానీ…ఓడిపోయినప్పుడు చంద్రబాబు పాత్ర గురించి విశ్లేషించాల్సిన అవసరం లేదా..? అనేది ప్రశ్న.

మహాకూటమి ఓటమిలో చంద్రబాబు నాయుడి పాత్ర మాత్రమే కాదు… విధానపరమైన అంశమూ ఉంది. అదే తెలుగుదేశం పార్టీ – కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం. పొత్తు పెట్టుకున్నప్పుడు అది అసంబద్ధమైనదనిగానీ, ఇది అనైతికమైనదనిగానీ బాబు అనుకూల మీడియాలో ఒక్క ముక్కకూడా విశ్లేషణ జరగలేదు. కనీసం ఆ పొత్తు ఫలితం ఏమిటో తేలిన తరువాతనైనా మీడియాగా విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదా..? ఇంకా చెప్పాలంటే జాతీయ మీడియా ఈ తరహా విశ్లేషణలు చేసింది.

కాంగ్రెస్‌-టిడిపి పొత్తును రెండు పార్టీల కార్యకర్తలు, ఓటర్లు జీర్ణించుకోలేదు. అందుకే ఓట్ల బదిలీ జరగలేదు. కొందరు ఇతర పార్టీలకు ఓట్లు వేశారు. ఇటువంటి కీలకమైన అంశంపైనా తెలుగు మీడియా విశ్లేషణ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఎన్నికల ఫలితాలపై ఇచ్చిన కథనాల్లో ప్రచురించిన కార్టూన్లలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని, రాహుల్‌గాంధీని పెద్దగా వేసి…చంద్రబాబు నాయుడిని కనిపించీ కనిపించకుండా వేశారు. మొత్తంగా మహాకూటమి ఓటమిలో బాబుకు ఏ సంబంధమూ లేదన్నట్లు చూపించే ప్రయత్నం చేశారు. ప్రధాన ప్రసంతి మీడియా ఎలావున్నా…సోషల్‌ మీడియా వదిలిపెట్టదుగా…ఏకిపారేస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*