మహాద్భుతంగా ‘మహానటి’

ఈరోజు (09.05.2018) విడుదలైన మహానటి సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించినట్లుగా ఉంది. అలనాటి మేటి నటి సావిత్ర జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం నేటి యువతరాన్నీ ఆకట్టుకునేలావుంది. దాదాపు 36 ఏళ్ల క్రితం కనుమరుగైన ఓ నటి జీవిత చరిత్రను సినిమాగా తీసి, ఈనాటి యువతరాన్ని ఎలా మెప్పిస్తారో అనే అనుమానాలన్నీ సినిమా చూశాక పటాపంచలయ్యాయి. ఈ సావిత్రి గురించి తెలిసిన వాళ్లు….సినిమా ఎలా తీశారో అనే ఉత్సుకతతో థియేటర్‌లోకి వెళితే….ఆమె గురించి తెలియని యువతరం సినిమాలోని పాత్రలు పోషించిన సమంత, నాగచైతన, దేవరకొండ తదితరులు ఎలా చేశారో చూడాలన్న కోరికతో వెళతారు. ఇద్దరులో ఎవరూ నిరుత్సాపడరు.

సావిత్రి నిజ జీవితమే సినిమాల ఉంటుంది. నిరుపేద కుటుంబంలో పుట్టి, ఆమెకు ఆరు నెలల వసయున్నప్పుడే తండ్రి చనిపోతే, పెద్దమ్మ ఇంటి పంచన చేరి, అక్కడి నుంచి పెదనాన్న ప్రోత్సాహంతో సినీరంగ ప్రవేశం చేసి, 300 తెలుగు, తమిళంలో 300 చిత్రాలకు పైగా నటించి, నటిగా ఉన్నత శిఖరాలను అందుకుని, వ్యక్తిగత జీవితంలో విఫలమై, ఆర్థికంగా చితికిపోయి, మద్యానికి బానిసై, అనారోగ్యంపాలై, కోమాలోకి వెళ్లి, 18 నెలల తరువాత తుదిశ్వాస విడిచిన సావిత్ర కథలో సినిమాకు సరిపడా అన్ని భావోద్వేగాలూ ఉన్నాయి. వాటన్నింటినీ తెరపైకి సజీవంగా పట్టుకొచ్చారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.

సావిత్రిగా నటించిన కీర్తి సురేష్‌ తన పాత్రకు జీవం పోశారు. ఎక్కడా కీర్తి సురేష్‌ అనే నటి నటుస్తున్నట్లు అనిపించదు. సావిత్రినే మన ముందున్క్నట్లు అనిపిస్తుంది. కీర్తి సురేష్‌ నట జీవితంలో ఇదో మైలురాయిగా మిగిలిపోతుంది. సావిత్ర జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి, ఆమె భర్త జెమినీ గణేషన్‌ పాత్రను పోషించిన యువ హీరో దుల్కర సల్మాన్‌ ఆ పాత్రలో ఒదిగిపోయారు. నిజంగా గణేషన్‌నే చూస్తున్న భావన కలిగించేలా నటించారు. ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది రాజేంద్ర ప్రసాద్‌ పాత్ర. సావిత్రికి పెదనాన్నగా రాజేంద్రప్రసాద్‌ నటించారు. ఆ పాత్ర స్వభావానికి తగిన హావభావాలను ఆయన సునాయాసంగా పలికించారు. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించే నాగ చైతన్య…దేవదాసులా కనిపిస్తారు. ఎన్‌టిఆర్‌ పాత్ర కూడా కనిపిస్తుంది. ఈ పాత్రను జూనియర్‌ ఎన్‌టిఆర్‌ను చేయమని అడిగారట. ఆయన అంగీకరించలేదు. ఒకవేళ ఒప్పుకుని చేసివుంటే సినిమాకు మరింత ప్రతిష్ట పెరిగేది. అలనాటి దర్శకులు కెవి రెడ్డి పాత్రలో నేటి దర్శకుడు క్రిష్‌ నటించారు. చక్రపాణి పాత్రలో ప్రకాష్‌ రాజ్‌ కనిపిస్తారు. మోహబాబు మాయాజబార్‌ సినిమాలో ఎస్‌వి రంగారావు పోషించి ఘటోత్కజుడు పాత్రలో అలరిస్తారు. సావిత్రి నటించిన వివిధ చిత్రాల షూటింగ్‌ విశేషాలు చెప్పడానికి అలనాటి హారోల పాత్రలను ఉపయోగించుకున్నారు. ఆ పాత్రలను నేటి యువతరం హీరోలతో వేయించడం మంచి ఆలోచన. జమినీ గణేషన్‌ పాత్రను దేవరకొండ విజయ్‌ను అడిగారట. ఆయన ఎప్పుకోలేదు. సమంత జర్నలిస్టుగా, దేవరకొండ విజయ్‌ ఫొటోగ్రఫర్‌గా సినిమాలో కనిపిస్తున్నారు.

మహానటి చిత్రీకరణ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. సంభాషణలు ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేశాయి. 1980, అంతకు ముందునాటి చెన్నై నగరాన్ని, అప్పటి సినిమా స్టూడియోలను బాగా చూపించారు. అప్పుడు వినియోగించే వాహనాలను చూపించడానికి ప్రత్యేకంగా తయారు చేయించినట్లున్నారు. మధ్యమధ్యలో తెలుపు-నలుపు దృశ్యాలు కనిపిస్తూ ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. సావిత్ర అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, హుటాహటిన ఆస్పత్రికి తరలించే సీన్‌తో సినిమా మొదలవుతుంది. ప్లాష్‌బాక్‌గా మిగతా కథంతా నడిపిస్తారు. కెమెరా పనితననమూ ప్రేక్షకులను మైమరిపించేలా ఉంది.

ఎక్కువ వివాదాల్లోకి వెళ్లకుండా, జెమినీ గణేషన్‌ను మరీ నెగటివ్‌గా చూపించకుండా దర్శకుడు జాగ్రత్త తీసుకున్నారు. జెమినీ గణేషన్‌ కుటుంబం కూడా అభ్మంతరం చెప్పలేని విధంగావుంది సినిమా. కోమాలో ఉన్న సావిత్రి కథను పత్రికలో రాయడానికి సమంత, దేవరకొండ విజయ్‌ వివరాలు సేకరిస్తున్న నేపథ్యంలో కథ మొత్తం సాగుతుంది. మహానటి సావిత్రి నట ప్రతిభ గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి నేటి తరం తెలుసుకోడానికి మహానటి కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇందులో నరేష్‌ పాత్రనే సరిగా ఎస్టాబ్లిస్‌ చేయలేదనిపిస్తుంది. సావిత్రికి, ఆయనకు ఉన్న సంబంధం ఏమిటనేది అస్పష్టంగా వదిలేశారు. ప్రస్తుతం 40 ఏళ్లకుపైనబడిన వారికి ఈ సినిమా మరింత కనెక్ట్‌ అవుతుంది. మహానటి దర్శకుడిని, నిర్మాతలను ధర్మచక్రం అభినందిస్తోంది. సినిమా మొత్తం ఇంగ్లీష్‌ సబ్‌ టైటిల్స్‌ వేయడం విశేషం. ఈ చిత్రాన్ని తమిళంలోనూ విడుదల చేస్తే మంచి ఆదరణ లభించవచ్చు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*