మహానటిపై జెమినీ గ‌ణేష‌న్ కుమార్తె ఫైర్‌!

 

అలనాటి మేటి నటి సావిత్రి జీవితగాథ ఆధారంగా తెరకెక్కించిన ‘మహానటి’కి ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. ఆ చిత్రంపై, విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. జీవిత గాథ ఆధారంగా నిర్మించిన ఈ చిత్రంలో ఎలాంటి వివాదాలు తలెత్తుతాయో అనే ఆందోళన మొదట్లో ఉన్నా సినిమా విడులైన తరువాత…అలాంటి వివాదాలేవీ బయటకురాలేదు. అయితే….మహానటి సినిమా ఈనెల 11న నడిగర తిలకం పేరుతో తమిళంలో విడుదలయింది. ఆ సినిమా చూసిన జెమినీ గణేషన్‌ మొదటి భార్య కుమార్తె కమల….తీవ్రంగా మండిపడుతున్నారు. తమ తండ్రి జెమినీ గణేషన్‌ గురించి తప్పుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ తల్లి అంటే జెమినీ గణేషన్‌కు ప్రేమే లేదన్నట్లు చూపించారని, ఈవిధంగా ఎలా చెబుతారని ఆమె చిత్ర యూనిట్‌ను నిలదీస్తున్నారు. జెమినీ గణేషన్‌ అంటే సావిత్రికి ఇష్టం ఉండేది కాదని చెప్పారు. ఒకసారి తాము సావిత్రి ఇంటికి వెళితే పెంపుడు కుక్కలను తమపైకి వదిలారని ఆమె ఆరోపించారు. సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమినీ గణేషన్‌ అనేలా చూపించారని, అందులో అర్థంలేదన్నారు. సావిత్రి కష్టాల్లో ఉంటే ఎవరూ పట్టించుకోలేదనడం సరికాదన్నారు.

కమల ప్రముఖ గైనకాలజిస్టు. ఆమె జెమినీ గణేషన, అలిమేలు కుమార్తె. దక్షిణాదిన తొలి టెస్ట్‌ట్యూబ్‌ బీబీని సృష్టించిన వైద్యురాలిగా ఆమెకు గుర్తింపువుంది. ఆమె చేస్తున్న విమర్శలు మహానటిని తీవ్రంగానే తాకుతున్నాయి. ఈ సినిమాలో ఒకచోట జెమినీ గణేషన్‌ సావిత్రితో ఇలా అంటారు…’నేను ఆమెను (అలిమేలును) పెద్దల బలవంతం వల్ల పెళ్ళి చేసుకున్నాను. ఆమె నా భార్య కావచ్చు. కానీ నా ప్రేమంతా నీ మీద ఉంది’. అలిమేలును పెద్దల బలవంతాన పెళ్లి చేసుకున్నారని ఎలా చెప్పగలిగారనేది కమల అడుగుతున్న ప్రశ్నలోని సారాంశాం. సావిత్రికి జెమినీ అంటే ఇష్టం లేదనే ఆశ్చర్యకరమైన విషయాన్నీ కమల వెల్లడించారు. ఈ విమర్శలు ఇంకెతదూరం వెళతాయో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*