మహానటిలో సావిత్రికి అన్యాయం!

మహానటి సినిమాపై మెలమెల్లగా లోతైన సమీక్షలు వెలువడుతున్నాయి. సావిత్రి జీవిత గాథను సరిగా అధ్యయనం చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. అలాంటి సమీక్ష ఒకటి ఆలపాటి సురేష్ అనే ఫేస్ బుక్ మిత్రుని వాల్ మీద కనిపించింది. ఆసక్తికరంగా ఉంది.  మీరూ చదవండి .

************************************

సావిత్రి గారూ…సారీ!

సావిత్రి అంటే నాకు బోలెడు ప్రేమ, అభిమానం, ఆప్యాయత. వీటన్నిటినీ మించి ఇంకేదో చెప్పడం కుదరని భావన. సర్వోత్కృష్టమైన ఒక కళాకారిణి మిగిల్చి వెళ్లిన అజరామరమైన కళాసౌరభాలు మనల్ని ఆవరించుకున్నప్పుడు ఆ స్రష్టతో, ఆ దివ్యమూర్తితో ఒక దగ్గరితనం అనుభవిస్తాం చూడండి, ఆ భావన గురించి నేను చెప్పేది. మహానటి సినిమాకు నిర్మాతలు వాడిన స్లోగన్ Come, be a part of history. సినిమా చూసిన తర్వాత నాకు అది చరిత్రో , కల్పనో అర్థం కాలేదు. మహానటిలో ప్రధానమైన అసంబద్ధత మధురవాణి, డేవిడ్ పాత్రలు. సావిత్రి జీవిత కథని ఎక్కడంటే అక్కడ అందుకోవడానికి ఆలంబనగా దర్శకుడు ఆ పాత్రలను సృష్టించాడు. అంటే సూత్రధారులన్నమాట.
కథ చెప్పే సూత్రధారులకు జీవితం ఉండదు. కథాక్రమాన్ని అందుకోవడం ఒక్కటే పని. మహానటి సినిమా కథాంశం ఒకరి జీవితచరిత్ర. అందులో సూత్రధారుల జీవితం కలిసిపోవడం ఏమిటి? కల్పనకు చరిత్రకు జోడించడం ఏమిటి?
అసలు ఆ అవసరమే లేదని చెబుతున్న పాత్రల గురించి మళ్లీ విమర్శ ఎందుకని ఎవరూ అనకపోతే ఒకమాట. ఆ పాత్రల నేపథ్యం కూడా అస్వాభావికంగా ఉంది. అది జర్నలిజం కాదు. జర్నలిజంలో కథలు రాయరు, చెప్పరు.

ఇక సావిత్రి జీవిత చిత్రణ చూస్తే, మొదటి నుంచీ చివరివరకూ, ఆమె జీవిత ఘట్టాలకు విపరీతమైన నాటకీయత జోడించారు. ఎక్కడా సున్నితత్వం, subtlety కనబడదు. ఆమె జీవితాన్ని జీవితంగా చిత్రీకరించలేకపోయారు. జనం గుండెల్లో ఏ నాటికీ చెరగని చోటు సంపాదించుకున్న సావిత్రిలాంటి మహానటి జీవితాన్ని చలనచిత్రంగా రూపొందించడం కత్తి మీద సాము లాంటిది. వెండితెరపై వెలిగిపోయిన ఆ రారాణి వ్యక్తిగత జీవితంలో కొన్ని చేదు కోణాలు ఉండవచ్చు. చూసేవారి మనోభావాలు దెబ్బతినకుండా ఆ కోణాలను సున్నితంగా, నర్మగర్భంగా చెప్పడంలోనే దర్శకుడి ప్రతిభ కనబడుతుంది. ఆ కోణాలను స్పృశించకపోతే చరిత్రకు అన్యాయం చేసినవారవుతారు. మహానటి దర్శకుడు ఎందుకైనా మంచిదని ఆ ప్రయత్నం జోలికే వెళ్లలేదు. సావిత్రి జీవితగాథ గ్రంథస్థం చేసినవారిలో పదిమంది మెప్పు పొందిన ఓ రచయిత్రి మహానటి చిత్రంలో ఆమె వాస్తవ జీవితాన్ని వక్రీకరించారని స్పష్టం చేసిన సంగతి గుర్తుంచుకోవాలి. మహానటిలో జెమినీ గణేశన్ ను నిజాయితీపరుడైన ప్రేమికుడిగా చూపించే ప్రయత్నం జరిగింది. అతను స్త్రీలోలుడు. సావిత్రి లాంటి అమాయకులను బుట్టలో వేసుకునేందుకు ఎడతెగకుండా ప్రయత్నించిన జెమినీ గణేశన్ లో చాలా కపటం ఉంది.
ఆ కోణాన్ని చూపకుండా జెమినీ గణేశన్ ను hopeless romanticగా చిత్రించే ప్రయత్నం జరిగింది. నిజానికి ఇక్కడ సావిత్రి అసలైన hopeless romantic. అలాంటిది ఆమెను మొండి మనిషిగా చూపించారు. అతని జీవితంలో అసలైన ప్రేమ ఒక్క సావిత్రితోనే అన్నట్లు జెమినీ గణేశన్ పాత్రను చిత్రించారు. ఇది జెమినీ గణేశన్ కు కాదు, సావిత్రికి అన్యాయం.

నిన్న మొన్నటి వరకూ మన ముందున్న వ్యక్తుల జీవితగాథను తెరకెక్కిస్తున్నప్పుడు చారిత్రక సన్నివేశాలేవో, కాల్పనిక సన్నివేశాలేవో ప్రేక్షకులకు తెలియపరచడం దర్శకుడి బాధ్యత. భార్యాభర్తల మధ్య ఇంట్లో ఒక సన్నివేశాన్ని తీస్తే అది కల్పన. ఆ ఇద్దరూ పదిమందిలో ఉన్న సన్నివేశం తీస్తే అది చరిత్ర. ఈ విషయంలో మహానటి దర్శకుడు నియమాలు పాటించలేదు. హైదరాబాద్ లో సావిత్రికి జరిగిన సన్మానం చరిత్రలో నమోదయిన ఘటన. అక్కడ జెమినీ గణేశన్ కు అవమానం జరిగినట్లు చూపించడం చరిత్ర వక్రీకరణ. ఇక్కడ నాటకీయతకు చరిత్ర బలయింది.

మహానటి కోసం బోలెడు రీసెర్చి చేసినట్లు దర్శక నిర్మాతలు చెప్పుకున్నారు. (వారు సహనటి జమునతో మాట్లాడలేదు. సినిమాలో జమున పాత్ర చూపించదలచుకోకపోవడం కారణమేమో! కారణం ఏమైనా, సావిత్రి జీవితకథపై -అదృష్టవశాత్తు ఇంకా జీవించి ఉన్న-జమునతో మాట్లాడని రీసెర్చిని రీసెర్చి అందామా!) అంత రీసెర్చి చేసినవారు ఏం తెలుసుకున్నారో, ఆ తెలుసుకున్నది సినిమాలో ఎక్కడ చూపించారో అర్థం కాలేదు. రీసెర్చి ఫలితాలు కనీసం కథాకాలం నాటి పరిస్థితులను, వాతావరణాన్ని కళ్లకు కట్టడానికి కూడా ఉపయోగపడినట్లు లేదు. సావిత్రి బాల్యంనాటి బెజవాడను చూపించడానికి కాలువలు, కొబ్బరి తోటలు వాడుకున్నారు. సావిత్రి ఇల్లు ఇటుక గోడలతో క్లోజప్ లో కనబడుతుంది. ఊరూవాడా లేని ఇల్లు అది. బెజవాడను అసలు చూపించని దర్శకుడు మద్రాసును చూపించాడు గానీ, అక్కడ కూడా చారిత్రక నేపథ్యంతో ఒక్కటంటే ఒక్క సన్నివేశం చిత్రించలేదు. చూపించిన స్టూడియో సన్నివేశాలను గుర్తుంచుకోవడం కూడా అనవసరం. సెంట్రల్ స్టేషన్ లాంటి ఒకటి రెండు గుర్తులు చూపించినా అవి ఫ్రేమ్ లో ఇమిడిపోయి కనబడలేదు. సినిమా కోసం పాత కార్లు తెచ్చారు గానీ, సినిమాలో vintage feeling మాత్రం తీసుకురాలేకపోయారు.
ఇక సావిత్రి పాత్రధారి గురించి చెప్పాలంటే, ఇప్పుడున్న నటుల్లో కీర్తీ సురేష్ కు మించి ఆ మహానటి పాత్రకు సరిపోయేవారు లేరనే అనుకోవాలేమో! అయితే ఆమె కూడా సావిత్రి పాత్రకు న్యాయం చేయలేకపోయిందని చెప్పక తప్పదు. కీర్తీ సురేష్ శక్తి మేర నటించింది. అయితే అది సరిపోదు. ఆ మాటకొస్తే కీర్తీ సురేష్ కాక ఇంకెవరైనా గానీ అంతే. అభినవ సావిత్రి అంటే మాటలా? సావిత్రి కళ్లు మాట్లాడతాయి, అద్భుతంగా నవ్వుతాయి కూడా. నోరు తెరవకుండానే పెదవులు కూడా మాట్లాడతాయి. క్లోజప్ లో సావిత్రి చూపించే ఈ అభినయం అనితర సాధ్యం. అందుకే కాబోలు, దర్శకుడు తెలివిగా కీర్తీ సురేష్ కు ఆ తరహా క్లోజప్ ఒక్కటి కూడా పెట్టలేదు.
సావిత్రి లాంటి స్టార్ అప్పటికీ ఇప్పటికీ సావిత్రి ఒక్కరే. అలాంటి మహానటి జీవితాన్ని మూడు గంటల చలనచిత్రంలో బంధించాలంటే కథాంశాల ఎంపిక కథనానికి ప్రాణంగా మారుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. జాగ్రత్తగా ఏర్చి కూర్చిన సన్నివేశాలతో కథను రేసుగుర్రంలా పరుగులు తీయించాలి. ఈ విషయంలో దర్శకుడు చాలా తేలికైన పద్ధతి ఎంచుకున్నాడు. ఫలితంగా సావిత్రి బయోపిక్ లో సావిత్రికే అన్యాయం జరిగింది. సహృదయతకూ, మంచితనానికీ, దయాగుణానికీ, కలుపుగోలుతనానికీ మారుపేరైన సావిత్రి కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు సినీరంగం, అందులోని ప్రముఖులు ఆమె పట్ల ప్రవర్తించిన తీరు మానవత్వానికే మచ్చ. ఆ సంగతిని కనీసం స్పృశించని మహానటి చిత్రం సావిత్రి జీవితగాథ ఎలా అవుతుంది?

సావిత్రి పోషించిన పాత్రల్లో చాలా గొప్పవి చాలా ఉన్నాయి. అన్నిటినీ పరిచయం చేయడం సాధ్యం కాదు గానీ, కొన్నిటినన్నా పరిచయం చేయకపోవడం మహానటిలో పెద్ద లోటు. ఎన్టీఆర్ తో కలిసి సావిత్రి ఎన్ని మరపురాని చిత్రాలు చేసింది? సహనటి జమున వ్యక్తిగతంగా కూడా సావిత్రికి ఎంత దగ్గర? మహానటిలో ఈ కోణాలు ఎక్కడ?
పైన ప్రస్తావించిన ఇద్దరు సహనటులనే తీసుకుంటే ‘మిస్సమ్మ’ సినిమాలో ఆ ఇద్దరితో కలిసి సావిత్రి నటించిన ఒక మంచి సన్నివేశం ఒక నిముషం కలిపితే ఎంత అర్థవంతంగా ఉండేది? ‘మహానటి’ చిత్రంలో మరో పెద్ద లోపం ఏమంటే, రెండు మూడు మినహా సినిమా షూటింగ్ సన్నివేశాలు కనబడకపోవడం. ‘అహ నా పెళ్లియంట’ అనే పాటను పాటగా చూపిస్తే ఎలా? ఆ పాట షూటింగ్ సన్నివేశాన్ని కదూ చూపించాల్సింది! ఇలా కొన్ని షూటింగ్ సన్నివేశాలను ఎంచుకున్నట్లయితే సహనటీనటులతో సావిత్రి సంబంధాలతో పాటు ఆమె పోషించిన గొప్ప పాత్రల పరిచయం కూడా సాధ్యపడేది. మరి సినిమా నిడివి ఎంత పెరిగేదో అని భయపడుతున్నారా? ముందే చెప్పానుగా, సూత్రధారుల కల్పిత జీవితాలను చారిత్రక కథనానికి జోడించడం అపచారమని! ఆ ఇద్దరి ప్రేమకథ తీసేస్తే సావిత్రి జీవితగాథ కాన్వాస్ ఎంత పెద్దది అవుతుందో ఊహించుకోండి.

ఎప్పుడో 1930 దశకంలో పుట్టి, 1980 దశకంలో గతించిపోయిన సినీనటి జీవితగాథ ఆధారంగా సినిమా తీస్తే 2018లో ఆ సినిమా చూసేందుకు జనం ఎగబడుతున్నారంటే అందుకు కారణం ఏమిటో తెలుసా? అది జనం గుండెల్లో సావిత్రి వేసిపోయిన గురుతు ప్రభావం. అంత గాఢంగా గురుతు వేయగలిగిన విదుషీమణి కాబట్టే ప్రప్రథమంగా ఓ సినీనటి జీవితం సినిమా కథావస్తువుగా మారింది. అయితే ఆ కథావస్తువుకు న్యాయం చేయడంలో మహానటి చిత్రం విజయం సాధించలేకపోయింది. సినిమాగా మాత్రం విజయం సాధించింది. “చిత్రం” ఏమంటే అందుకు కూడా ఆ మహానటే కారణం. ఈ ‘మహానటి’ కాదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*