మహానటి స్థాయిని అందుకోని కథానాయకుడు..!

విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు – ఎన్‌టిఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాల్లో మొదటిదైన కథానాయకుడు విడుదలయింది. ఎన్‌టిఆర్‌ సినీ జీవిత విశేషాలకు అద్దంపట్టిన ఈ సినిమా బాగుందన్న హిట్‌ టాక్‌ వినిపిస్తోంది. సృజనాత్మక దర్శకుడి క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన కథానాయకుడు నందమూరి అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. కథానాయకుడు ఫస్ట్‌ హాఫ్‌ కంటే సెకెండ్‌ హాఫ్‌ బాగుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

సినిమాల్లో నటించాలన్న కోరికతో సబ్‌ రిజిస్ట్రార్‌ ఉద్యోగం వదిలేసి విజయవాడ నుంచి చెన్నై వెళ్లడం, అక్కడ చిన్నపాటి ఒడుదుడుకులు ఎదుర్కోవడం, సినీరంగ ప్రవేశం జరిగిన తరువాత తిరుగులేని నటుడిగా ఎదగడం…తదితర విశేషాలను ప్రేక్షకులను ఆట్టుకునేలాగా దర్శకుడు చూపించగలిగారు. ఫస్ట్‌ హాఫ్‌ కాస్త డాక్యుమెంటరీలాగా చప్పగా అనిపించినా… రెండో హాఫ్‌ వచ్చే సరికి ఆసక్తికరంగా చూపించగలిగారు.

ఎన్‌టిఆర్‌ తొలినాళ్లలో కంటే సినిమాల నుంచి రిటైర్‌ అయి, రాజకీయ రంగ ప్రవేశం చేసే సమయంలో ఉన్న రూపం…బాలకృష్ణకు బాగా సెట్‌ అయింది. కొన్ని సీన్లలో ఎన్‌టిఆర్‌ స్వయంగా స్క్రీన్‌పై ఉన్నారా అనిపించేంతగా ఎన్‌టిఆర్‌ పాత్రలో బాలకృష్ణ సెట్‌ అయ్యారు. అందుకే సెకెండ్‌ హాఫ్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాతో పోల్చితే…కథానాయకుడు ఆ స్థాయికి చేరుకోలేకపోయిందనే చెప్పాలి. మహానటి చూస్తున్నంత సేపు ప్రేక్షకులు…తాము సినిమా చూస్తున్నామన్న సంగతి మరచిపోతారు. తమ కళ్లముందే ఒక జీవితం సాగిపోతున్నట్లుగా ఫీలవుతారు. కానీ కథానాయకుడి చూస్తున్నప్పుడు అటువంటి ఫీలింగ్‌ కలగదు.

దీనికి కారణాలు లేకపోలేదు. సావిత్ర నట జీవితంలో ఎవరెస్టు శిఖరమూ ఉంది…అత:పాతాళమూ ఉంది. ఆమె జీవితంలోని నాటకీయత మహాటికి ప్రాణంపోసింది. కానీ ఎన్‌టిఆర్‌ సినీ జీవితంలో చిన్నపాటి ఒడుదుడుకులు తప్ప….పెద్దగా ఆటుపోట్లు లేవు. ఎన్‌టిఆర్‌ రాజకీయ జీవితంలో ఇటువంటి నాటకీయతకు కొదవలేదు. అందుకే అందరి దృష్టి రెండో సినిమా అయిన మహానాయకుడిపైనే ఉంది.

కాంగ్రెస్‌కు ఇబ్బంది లేకుండా….

సినిమాలకు స్వస్తిచెప్పి రాజకీయ పార్టీ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చి, తెలుగుదేశం పార్టీని స్థాపించడం వరకు కథానాయకుడులోనే చూపించారు. ఇక మొదటి ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు, నాదేండ్ల భాస్కర్‌రావు ఎపిసోడ్‌ వంటివన్నీ మహానాయకుడులో చూపించనున్నారు.

అయితే…మొదటి సినిమాలో స్పష్టంగా కనిపిస్తున్న లోపం ఏమిటంటే…. రాజకీయ పార్టీని స్థాపించడానికి ఎన్‌టిఆర్‌ను ప్రేరేపించిన అంశాలు ఏమిటి? ఆ నాటికి ఉన్న రాజకీయ పరిస్థితులేమిటి? అనేది లోతుగా చూపించలేదు. ఆనాటి కాంగ్రెస్‌ పార్టీ గురించి, ఇందిరాగాంధీ గురించి తగిలీతగలనట్లు చూపించారు తప్ప…లోతుల్లోకి వెళ్లలేదు. ఎమర్సెన్సీ పరిస్థితిని ఒక్కఫొటోలో చూపించి వదిలేశారు. ఇందిరాగాంధీ ఒక్క సీన్‌లో తప్ప మరెక్కడా కనిపించరు.

కాంగ్రెస్‌ పార్టీతో తెలుగుదేశం పొత్తులేకుంటే….ఎమర్జెన్సీ, నాటి కాంగ్రెస్‌ పాలన తీరు వంటి అంశాలను రెండో సినిమాలో (మహానాయకుడిలో) చూపించివుండేవారేమో. రెండో సినిమాలోనైతే కాస్త వివరించగా చూపించాల్సివస్తుంది. అంతుకే మొదటి సినిమాలోనే పైపైన చూపించి పార్టీ స్థాపించేదాకా వెళ్లిపోయారు. దీన్నిబట్టి రెండో పార్ట్‌లోనూ కాంగ్రెస్‌, ఇందిరాగాంధీ వ్యవహారాలేవీ పెద్దగా ఉండబోవని మొదటి సినిమాతోనే తేలిపోయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*