మహానాడులో అతిశయోక్తి ప్రసంగాలు

తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా మహానాడు నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అధికారంలో ఉంటే అధికార దర్పంతోనూ, అధికారంలో లేనపుడు సాదాసీదాగానూ మహానాడు జరుగుతుంటుంది. కమ్యూనిస్టు పార్టీలు మూడేళ్లకోసారి మహాసభలు నిర్వహించు కుంటాయి. గడచి మూడేళ్ల కాలంలో తమ పనితీరును సమీక్షించుకుంటాయి. వచ్చే మూడేళ్ల కాలానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించుకుంటాయి. మహానాడు అలాంటిది కాదు. ఈ సభల్లో విధానాలపై చర్చించడం పెద్దగా ఏమీవుండదు. అయితే…పార్టీ శ్రేణులను, నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు ఉత్సాహపరచడానికి, క్రియాశీలంగా ఉంచడానికి మహానాడును ఉపయోగించుకుంటుంది పార్టీ. ఇందులో తప్పులేదు. తమ పార్టీ కార్యకర్తలను ఉత్సాహ పరచడానికి ప్రత్యర్థులను విమర్శించడం, తమ గురించి గొప్పగా చెప్పువడం మామూలే. అయితే…ఈసారి మహానాడులో అతిశయోక్తులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్‌ మాట్లాడుతూ….వైసిఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైసియులో ఉందని, దానికి బిజెపి ఆక్సిజన్‌ అందిస్తోందని అంటున్నారు. వైసిపి గురించి అటువంటి అంచనా అర్థం లేనిది. టిడిపి శ్రేణులే దాన్ని అంగీకరించకపోవచ్చు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 175 అసెంబ్లీ స్థానాలనూ టిడిపి గెలుచుకోవాలని, 25 పార్లమెంటు స్థానాలనూ తెలుగుదేశం పార్టీ గెలుచుకుని జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందని….అతిశయంతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్ర‌పంచంలో 100కుపైగా దేశాల్లో్ మ‌హానాడు జ‌రుపుకునే రోజు వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు. ఇదో అతిశ‌యం.

గత ఎన్నికల్లో టిడిపి, బిజెపి, పవన్‌ కల్యాణ్‌ కలిసి పోటీచేస్తేనే వైసిపి కంటే కేవలం ఆరు లక్షల ఓట్ల తేడాతో చంద్రబాబు బయటపడ్డారు. ఇప్పుడు మూడు పార్టీలదీ మూడు దారులయ్యాయి. అదేవిధంగా….సహజనంగానే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల గతంకంటే ఓట్ల శాతం తగ్గుతుంది. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా…వైసిపి ఐసియులో ఉందని, రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను టిడిపి గెలుస్తుందని మాట్లాడుకోవడమంటే….అతిశయోక్తులు మాట్లాడుకోవడమే అవుతుంది. మా ఊరి మిరియాలు గుంటూరు తాటికాయంత అన్నట్లు మాట్లాడుకుంటే….కార్యకర్తల్లో అతి విశ్వాసం పెరిగి మొదటికే మోసం తెచ్చే ప్రమాదంవుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*