మాజీల మాట‌ల‌ను శ్రీ‌వారు మెచ్చుతారా?

శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు సరిగా జరగడం లేదని, పోటును తవ్వేశారని, శ్రీవారి హారంలోని ఓ వజ్రం కనిపించకుండాపోయిందని ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై….టిటిడిలో ఈవోలుగానూ, జెఈవోలుగానూ, సివిఎస్‌వోలుగానూ, న్యాయ సలహాదారులుగానూ పనిచేసిన అధికారులు వరుసగా దాడి చేస్తున్నారు. రమణ దీక్షితులు అవినీతిపరుడని ఒకరంటే, ఆయన చెప్పేవన్నీ అసత్యాలని ఇంకొకరు అంటున్నారు. టిటిడిలో అక్రమాలకు అవకాశాలే లేవని మరో అధికారి సర్టిఫికేట్‌ ఇస్తున్నారు. ఒకప్పుడు ఈవోగా పని చేసిన ఎల్‌వి సుబ్రమణ్యం, జెఈవోగా పని చేసిన ధర్మారెడ్డి, మాజీ సివిఎస్‌వో రమణకుమార్‌, నాగేంద్రకుమార్‌, న్యాయసలహాదారుగా పని చేసిన ఇంకో అధికారి మాట్లాడారు. ఎవరైనా ప్రస్తుత పరిస్థితిలో స్పందించవచ్చు. తమ అభిప్రాయాలను చెప్పవచ్చు. తప్పులేదు. అయితే…రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలకు వివరణలో, సమాధానాలో కాకుండా ఆయనపైన ఎదురుదాడికి దిగుతున్నారు. రమణ దీక్షితుల్లోని తప్పులనూ ఎత్తిచూపవచ్చు. వాటి మాటను ఆయన చేస్తున్న విమర్శలను పక్కన పెట్టాలని ప్రయత్నించడమే అభ్యంతరకరం.

ఇరవై నిమిషాల పాటు నిర్వహించాల్సిన తోమాల సేవను 10 నిమిషాల్లో ముగించమని ఆలయంలోని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని, విఐపిల దర్శనాల కోసం ఇదంతా చేస్తున్నారన్నది రమణ దీక్షితులు ఆరోపణ. ఇది తప్పని ఆయనపై విమర్శలు చేస్తున్న మాజీ అధికారులు ఎవరైనా నిరూపించగలరా? పోటుకు మరమ్మతులు చేసేటప్పుడు ప్రధాన అర్చకునిగా రమణ దీక్షితులు అమోదాన్ని తీసుకోలేదు. పైగా వెయ్యి సంవత్సరాల పురాతన కట్టడాన్ని ఇష్టానుసారం తవ్వేశారనేది ఆయన మరో విమర్శ. ఇది ఏ అధికారి దృష్టిలోనైనా ఎలా తప్పు అవుతుందో తెలియదు. ఇక శ్రీవారి ఆభరణాల భద్రతకు ఎలాంటి మప్పు లేదని 2015-16లో సివిఎస్‌వోగా పని చేసిన నాగేంద్రకుమార్‌ చెబితే….2009లో సివిఎస్‌వోగా ఉన్న రమణ కుమార్‌ శ్రీవారి ఆభరణాలపై తన నివేదికలోనే అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. మరి ఎవరు కరెక్టని చెప్పాలి? ఇక పింక్‌ డైమండ్‌ లేదని ఒక నివేదిక చెబితే…ఉందని ఇంకో నివేదిక చెబుతోంది. ఏది నిజమని నమ్మాలి? అయినా విచారణను మాజీ అధికారులు ఎందుకు వ్యతిరేకించాలి? ‘విచారణ అంటే మాజీ ఈవోలో, జెఈవోలు భుజాలు తడుముకుంటున్నారు ఎందుకు?’ అని రాయలసీమ పోరాట సమితి నాయకులు నవీన్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలు వేరు…ఆయనపై మాజీ అధికారులు మాట్లాడుతున్న విషయాలు వేరు. ఎంతమంది మాజీలు రమణ దీక్షితులుపై దాడికి దిగినా….ఆయన చేస్తున్న తీవ్రమైన ఆరోపణలపై విచారణ చేయకుండా భక్తుల్లో నమ్మకం కలిగించ లేరు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*