మాయలు పకీరు ప్రాణాలు చిలుకలో….తిరుమల అవినీతి భూతం ప్రాణాలు ఎక్కడ..! తెలుసా…సుబ్బారెడ్డి గారూ…!

మాయలు పకీరు ప్రాణాలు…ఏడేడు జీవగడ్డల అవతల, మర్రిచెట్టు తొర్రలోని రామచిలక కంఠంలో ఉంటుందని….జానపద కథల్లో చెబుతుంటారు. మాయలు పకీరును అంతమొందించడం కోసం….కథనాయకుడు గుర్రం ఎక్కి, రోజులు తరబడి ప్రయాణించి, మార్గమధ్యంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని, ఆఖరికి చిలకను జేజిక్కించుకుని, ఒక్కసారిగా దాని గొంతు నులిమేస్తాడు. అంతే ఇక్కడ మాయలు పకీరు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచేస్తాడు.

ఇప్పుడు ఈ కథ చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే….టిటిడి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ…టిటిడిని ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం బ్రేక్‌ దర్శనం పేరుతో అమలవుతున్న ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 విధానాన్ని రద్దు చేయబోతున్నట్లు కూడా ఆయన మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా చెబుతున్నారు.

టిటిడిలో అవినీతికి మూలం ఎక్కడుందో ఛైర్మన్‌ సరిగ్గానే పట్టుకున్నారు. అవినీతి, అక్రమాలకు ఈ బ్రేక్‌ దర్శనం టికెట్లే కేంద్రంగా ఉన్నాయన్న వాస్తవాన్ని త్వరగానే గుర్తించారు. రోగాన్ని గుర్తిస్తే సరిపోదు…దానికి సరైన మందు వేస్తేనే నయం అవుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇప్పుడు సుబ్బారెడ్డి కనిపెట్టాల్సిందే….తిరుమలలో వేళ్లూనుకున్న అవినీతిని రూపుమాపడానికి ఎటువంటి మందు వేయాలన్నదే.

శ్రీవారి బ్రేక్‌ దర్శనాలు, సేవా టికెట్ల చుట్టూ కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందన్నది బహిరంగ రహస్యం. ఎల్‌-1 టికెట్టు రూ.20,000 ధర పలుకుతోంది. ఇక వస్త్రం వంటి అరుదైన టికెట్ల ధర లక్షల్లో ఉంటుంది. తిలాపాపం తలా పడికెడు అన్నట్లు….ఈ అవినీతి సొమ్ములో అధికారులు, రాజకీయ నాయకులు, దళారులు…అందరికీ భాగం ఉంది. మాయలు పకీరు ప్రాణం చిలుకలో ఉంటే….తిరుమల అవినీతి భూతం ప్రాణాలు బ్రేక్‌ దర్శనం టికెట్లలో ఉన్నాయి. సేవా టికెట్లలో ఉన్నాయి.

పెద్దపెద్ద హోదాల్లో, పదవుల్లో ఉన్నవారు….అంటే ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, గవర్నర్లు, న్యాయమూర్తులు వంటివాళ్లు గంటలు, రోజుల కొద్దీ వేచివుండి శ్రీవారి దర్శనం చేసుకోవడం సాధ్యంకాదు కనుక…ప్రత్యేక దర్శనం (బ్రేక్‌ దర్శనం) విధానం తీసుకొచ్చారు.

ఒకప్పుడు ఈవో, తిరుపతి, తిరుమల జెఈవోలు, తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోల సిఫార్సు మేరకు టికెట్లు ఇచ్చేవారు. బాలసుబ్రమణ్యం తిరుమల జెఈవో ఉన్న సమయంలో టికెట్ల కేటాయింపును కేంద్రీకృతం చేశారు. టికెట్ల కేటాయింపు అధికారాన్ని తిరుమల జెఈవో చేతుల్లో పెట్టారు. ఈవోకు టికెట్టు కావాలన్నా జెఈవో అనుమతితో తీసుకోవాల్సిన విచిత్ర పరిస్థితిని సృష్టించారు. ఈ టికెట్లతో తిరుమల జెఈవో తిరుగులేని శక్తిగా మారిపోయారు.

శ్రీవారి దర్శనం టికెట్ల కోసం తిరుమల జెఈవోకు అన్ని రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, న్యాయమూర్తులు నేరుగా ఫోన్‌చేసి మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినో….నేరుగా మాట్లాడలేని వ్యక్తులతో కూడా తిరుమల జెఈవో మాట్లాడగలరంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వ పెద్దలకు అవసరమైన కొన్ని పనులనూ ఈ పోస్టుల్లోని అధికారులు చక్కబెడతారన్న ప్రచారమూ ఉంది.

అందుకే….తిరుమల జెఈవో పోస్టులోకి రావడానికి అంతగా తహతహలాడిపోతారు. అంతగా పోటీపడతారు. ఒక్కసారి వచ్చిన వాళ్లు…ఇక్కడి నుంచి వెళ్లడానికి ఇష్టపడరు. మళ్లీ మళ్లీ రావడానికి ప్రయత్నిస్తుంటారు. గతంలో బాలసుబ్రమణ్యం 9 ఏళ్ళకుపైగా తిరుమల జెఈవోగా కొనసాగారు. ప్రస్తుతం బదిలీ అవుతున్న శ్రీనివాసరాజు ఎనిమిదేళ్ల రెండు నెలలు అదే పోస్టులో ఉన్నారు. ఇప్పుడు కొత్త జెఈవోగా రాబోతారని చెబుతున్న ధర్మారెడ్డి….గతంలో రెండు పర్యాయాలలో ఐదేళ్లకుపైగా పని చేశారు.

అసలు విషయానికొస్తే….చక్కెర చల్లేసి చీమలు వస్తున్నాయని చింతించడం వల్ల ప్రయోజనం లేదు. చీమలు రాకుండా ఉండాలంటే చక్కెర లేకుండా చేయాలి. తిరుమల టికెట్ల సమస్యకూ పరిష్కారం అదే. ప్రోటాకాల్‌, టిటిడికి డోనర్స్‌ (దాతలు)గా ఉన్న వారికి మినహా…మిగతావారికి బ్రేక్‌ దర్శనాలు, సేవా టికెట్లు రద్దు చేయగలిగితే చాలావరకు అక్రమాలకు బ్రేక్‌ వేయడానికి వీలవుతుంది.

అదేవిధంగా….అధికారులు తమ విచక్షణ కోటా కింద ఎవరెవరికి టికెట్లు కేటాయిస్తున్నారో రోజూ టిటిడిలో వెట్‌సైట్‌లో పెట్టాలి. దీనివల్ల పారదర్శకత పెరిగి అక్రమాలకు కళ్లెం పడుతుంది. అవసరమైతే….టికెట్లు జారీ ప్రక్రియలో ఈవోను కూడా భాగస్వామిని చేయాలి. జెఈవో చూసిన తరువాత ఈవో ఖరారు చేసే పద్ధతి కూడా తీసుకురావచ్చు. ఈ టికెట్లను ఎంత వరకు తగ్గించగలిగితే….అవినీతిని అంత మేరకు అరికట్టడానికి అవకాశం ఉంటుంది.

మరి….అవినీతి రహిత పాలన అందిస్తామని చెబుతున్న నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, టిటిడిలోనూ ఆ తరహా పరిపాలన అందించడానికి అవసరమైన చర్యలు చేపడతారా? టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి….తిరుమలలో జడలు విప్పిన అవినీతి భూతం పీచం అణచగలరా? ఏమో చూద్దాం..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*