మిస్టరీగానే శ్రీవారి పింక్‌ డైమండ్‌!

తిరుమల శ్రీవారి వజ్రాల హారంలోని గులాబి వర్ణ వజ్రం (పింక్‌ డైమండ్‌) మాయమయిందని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. శ్రీవారి ఆభరణాలకు భద్రత లేకుండా పోయిందని చెబుతూ దీన్ని ఉదహరిస్తున్నారు. 2001లో గరుడసేవ రోజున స్వామికి అలంకరించిన తరువాత హారంలో పింక్‌ డైమైండ్‌ కనిపించకుండాపోయింది. భక్తులు నాణేలు విసరడం వల్ల (గరుడోత్సవం రోజున స్వామిపైకి నాణేలు విసిరితే మంచి జరుగుతుందనేది భక్తుల విస్వాసం) ఆ వజ్రం పగిలిపోయినట్లు రికార్డుల్లో ఆ తరువాత రాశారని కూడా దీక్షితులు చెబుతున్నారు. ఆ మధ్య ఇదేరకమైన పింక్‌ డైమైండ్‌ను జెనీవాలో వేలం వేసినట్లు, వందల కోట్ల ధర పలికినట్లు పత్రికల్లో చదివానని రమణ దీక్షితులు అంటున్నారు. ఆ వజ్రం శ్రీవారిదే అయివుంటుందనేది రమణ దీక్షితులు అనుమానం.

రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలపై టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ఇందులో పింక్‌ డైమైండ్‌ గురించి కూడా వివరించారు. ఆలయ ప్రధాన అర్చకుడే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో భక్తులకు టిటిడిపై నమ్మకం సన్నగిల్లుతుందని, అందుకే వివరంగా చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని ఈవో అన్నారు. ఈ వజ్న్రాన్ని 1945లో అప్పటి మైసూరు మహారాజు శ్రీవారికి కానుకగా ఇచ్చారి, అప్పట్లో దాని విలువ రూ.50గా అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా శ్రీవారి ఆభరణాలపై గతంలో జస్టిస్‌ జగన్నాథరావు పరిశీలన చేసి ఇచ్చిన నివేదికలోనూ ఈ వజ్రం ప్రస్తావన ఉందని చెప్పారు. ఇది వజ్రం కాదని, కెంపు మాత్రమేనని, భక్తులు విసిరిన నాణేల వల్ల అది పగిలిపోయిందని, స్వావారి పీఠం వద్ద కొన్ని ముక్కలు కూడా లభ్యమయ్యాయని, ఆ ముక్కలు తనకు చూపించారని జగన్నాథరావు ఇచ్చిన నివేదికలో పేర్కొనట్లు ఈవో వివరించారు. ఇదే విషయాన్ని 2010లో అప్పటి ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు కూడా ప్రభుత్వానికి తెలియజేసినట్లు చెప్పారు. అప్పడు భద్రపరచిన కెంపు ముక్కలను కూడా ఈవో మీడియాకు చూపించారు. ఒక జస్టిస్‌ పరిశీలన జరిపి తేల్చేసిన విషయంలోనూ అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. దీక్షతులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సంఘాల్‌ చెప్పారు.

జస్టిస్‌ జగన్నాథరావు నివేదిక చదివినా, అధికారులు భద్రపరచిన కెంపు ముక్కలు చూసినా…నిజమేకదా…పగిలిన కెంపు ముక్కలు కూడా దొరికాయి కదా…ఇక వజ్రం పోయివడం ఏముంది? అని అనిపించవచ్చు. అయితే సునిశితంగా గమనించాల్సిన అంశాలు ఇక్కడే ఉన్నాయి. జస్టిస్‌ జగన్నాథరావు కూడా అధికారులు చూపించి ఈ కెంపు ముక్కలను చూసే…అది కెంపు అని, భక్తులు నాణేలు విసరడం వల్ల పగిలిపోయివుంటుందని నిర్దారణకు వచ్చివుండొచ్చు. ఆయన నివేదికను తప్పుపట్టేది ఏమీ ఉండదు. మైసూరు రాజావారు వజ్రం కాకుండా ఒక కెంపును బహూకరించడం ఏమిటి? అనేది మొదట తలెత్తే సందేహం. అదేవిధంగా…జగన్నాథరావు అయినా, ఇంకొకరైనా…అంతకంటే ముందు ఆ హారాన్ని చూసివుంటే అది వజ్రమో, కెంపునో తెలిసివుంటుంది. అలా చూడనపుడు అది వజ్రమని తెలిసే అవకాశం లేదు. అధికారులు చూపించిన కెంపు ముక్కలను చూసి కెంపు అనుకోవాల్సిందే. శ్రీవారికి అతి దగ్గరగా మెలుగుతూ, నిత్యం శ్రీవారి ఆభరణాలను చూస్తుండే అర్చకులకు మాత్రం అది వజ్రమో, కెంపో, సాధారణ రాయో ఇట్టే తెలిసిపోతుంది. వజ్రంలోఉండే మెరుపు కెంపులో కనిపించదు. రమణ దీక్షితులు దాన్ని విలువైన వజ్రమనే చెబుతూ వస్తున్నారు. ఎవరు ఎన్ని నివేదికలు ఇచ్చినా ఇప్పటికీ దాన్ని వజ్రమనే ఆయన గట్టిగా నమ్ముతున్నారు. వజ్రాన్ని కాజేసి, ఆస్థానంలో నకిలీ రూళ్లు పొందుపరచివుంటారన్న అనుమానాలూ ఉన్నాయి. పగిలింది నిజంగా కెంపు అయితే…అంతకు ముందే వజ్రాన్ని మాయం చేసివుంటారనేది ఆయన భావన.

ఈ నేపథ్యంలో జెనీవాలో ఉన్న రాజ్‌ పింక్‌ డైమెండ్‌ యజమాని ఎవరో తెలుసుకునేందుకు టిటిడి ప్రయత్నించాలి. అప్పుడు వేలం వేసినపుడు ఓనర్‌ పేరు చెప్పడానికి వేలం నిర్వాహకులు నిరాకరించినట్లు చెబుతున్నారు. ఆ వజ్రం యజమాని ఎవరో తెలుసుకోలేకుంటే….శ్రీవారి ఆభరణాలను మరోసారి పరిశీలించాలి. ఇది కేవలం బరువు, రాళ్ల సంఖ్య సరిచూడటం వరకే పరిమితం కాకూడదు. ఆ ఆభరణాల్లో ఉన్నవి అసలైన వజ్రాలు, వైఢూర్యాలేనా, లేక ఆ తరువాత వచ్చిన రంగురాళ్లతో వాటిని స్థానమార్పిడి ఏమైనా చేశారా అనే కోణంలో పరిశీలన జరిగాలి. ఇప్పటిదాకా ఆభరణాల పరిశీలన, తనిఖీ అంటే…బరువు, వాటి రాళ్లను లెక్కపెట్టడం వరకే పరిమితం అవుతున్నారు. దీనివల్ల అక్రమాలు ఏమైనా జరిగివుంటే బయటపడే అవకాశం లేదు. ఈవో చెబుతున్నట్లు రమణ దీక్షితులు ఆరోపణలతో శ్రీవారి భక్తుల్లో అనుమానాలు ముసురుకుంటున్నారు. టిటిడి పట్ల విశ్వాసాన్ని పాదుగొల్పాలంటే ఆభరణాలను ఈ తరహాలో పరీక్షించి, నిర్ధారింపింపజేయమే పరిష్కారం. ఆగమ శాస్త్రం అనుమతిస్తే శ్రీవారి ఆభరణాలను భక్తుల సందర్శనకు ఉంచుతామని, డిజిటలైజేషన్‌ ద్వారా రికార్డు చేస్తామని ఈవో చెప్పారు. ఇది మంచి ఆలోచనేగానీ…ముందుగా పైన చెప్పిన పద్ధతిలో ఆభరణాల పరిశీలన జరిపించడం అత్యంత అవశ్యం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*