మీడియాకు మేడే ఎప్పుడో!

ప్రపంచ కార్మికవర్గం తహక్కుల కోసం శాతాబ్దాల క్రితమే నినదించింది. వీధుల్లోకి వచ్చి పోరాడింది. ఎనిమిది గంటల పని విధానంతో పాటు అనేక హక్కుల కోసం 1886 మే 1వ తేదీన అమెరికాలోని చికాగోలో లక్షలాది మంది కార్మికులు వీధుల్లోకి వచ్చారు. వారిపైకి పాలకులు తూటాలు పేల్చాలి. ఈ దమనకాండలో అనేక మంది కార్మికులు మరణించారు. రక్తం మడుగులై పారింది. ఆ రక్తంలో తడిచిన గుడ్డనే ఎగురవేసి అదే కష్టజీవుల జెండాగా ప్రకటించారు. మే 1న జరిగిన ఈ వీరోచిత పోరాటం ఫలితంగానే కార్మికులకు 8 గంటల పని విధానంతో పాటు అనేక హక్కులు సంక్రమించాయి. ఇప్పటికీ కార్మివర్గం అనుభవిస్తున్నది ఆ పోరాట ఫలితాలే. ఆ తరువాత కూడా కార్మికవర్గం హక్కుల కోసం పోరాడుతూనే ఉంది. పాలకులు కొత్తకొత్త రూపాల్లో దోపిడి అమలు చేస్తున్నారు. టెక్నాలజీని ఆధారంగా చేసుకుని కార్మికుల చెమటను దోచుకుంటున్నారు. వ్యవసాయ పొలం నుంచి సాఫ్ట్‌వేర్‌ కంపెనీల దాకా ఈ దోపిడీ సాగుతూనేవుంది. దీన్ని కార్మికులు ప్రతిఘటిస్తున్నారు. కొన్ని సార్లు విజయం సాధిస్తున్నారు. కొన్నిసార్లు ఓడిపోతున్నారు.

దాదాపు 135 ఏళ్ల క్రితం నాడు సాధించుకున్న 8 గంటల పని విధానం ఇప్పటికీ అమల్లోకి రానిది మీడియాలోనే. ఎవరికి కష్టం వచ్చినా మేమున్నామంటూ వెళ్లి, బాధితుల పక్షాన నిలబడే పాత్రికేయులు మాత్రం ఎవరి కోసమే ఎదరుచూస్తూ నిలబడ్డారు. అది పత్రికకానీ, టివి ఛానల్‌ కానీ జర్నలిస్టులు తీవ్రమైన శ్రమ దోపిడికి గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 40 వేల మంది జర్నలిస్టులుంటే అందులో నెలనెలా జీతం అందుకుంటున్నవారు ఐదారు వేల మందికి మించి ఉండరు. మిగిలిన వారంతా యాజమాన్యాలకు ఊడిగం చేస్తున్నారు. సమాజంలో పలుకుబడి కోసం తమ శ్రమను మీడియా యాజమాన్యాలకు దారబోస్తున్నారు. తిరుపతిలో ఒక మాజీ ఎంపి తరచూ అంటుంటారు…’మీ జర్నలిస్టుల కంటే ఉపాధి హామీ కూలీలే నయం కదయ్యా’ అని. ఆయన మాటల్లో వాస్తవముంది. ఉపాధి కూలీకి వెళితే రోజుకు రూ.150 వస్తుంది. కానీ 24 గంటలూ పనిచేసే విలేకరికి రూపాయి కూడా జీతం రాదు. ఇంకా యాడ్స్‌ పేరుతో ఎదురు ఇవ్వాల్సిన దుస్థితి. యాడ్స్‌ వచ్చినా రాకున్నా నెలకు ఇంతని వసూలు చేసుకుంటున్న పత్రికా నిర్వాహకులు, ఛానళ్ల నిర్వాహకులు ఉన్నారు. ఇక ఇఎస్‌ఐ, పిఎఫ్‌ అంటే ఏమిటో కూడా జర్నలిస్టులకు తెలియదు. ఇంకా విషాదం ఏమంటే…ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు (అక్రిడిటేషన్‌) కూడా ఊరికే ఇవ్వరు. రూ.10 వేలు, రూ.20 వేలు వసూలు చేసుకుని ఇస్తున్నారు. టివి చానళ్లకు విలేకరులుగా పని చేసేవారి గురించి చెప్పాల్సిన పనిలేదు. జీతం ఇవ్వరుగానీ…24 గంటలూ పనిలో ఉండాలి. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేదు. ఏ క్షణంలో ఫోన్‌ చేసినా తీయాలి. ఒకవేళ గాఢ నిద్రలో ఉండి ఫోన్‌ తీయకుండే…పై నుంచి బూతులు తిడతారు. గ్రామీణ విలేకరుల పరిస్థితి మాత్రమే కాదు…పట్టణాలు, నగరాల్లో పనిచేసే జర్నలిస్టులదీ ఇదే దీనావస్థ.

ఇక డెస్క్‌ జర్నలిస్టులంటారా…వారితో విషాద గాథ. డెస్క్‌ జర్నలిస్టుల రక్తమాంసాలను ఆరగిస్తున్నాయి యాజమాన్యాలు. మధ్యాహ్నం 3 గంటలకు ఆఫీసులో అడుగుపెడితే…తెల్లవారిజామున 3 గంటలకు బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఏ పత్రికలోనూ (ప్రజాశక్తి వంటి కమ్యూనిస్టు పత్రికలు మినహా) 8 గంటల పని విధానం లేదు. ఇద్దరు చేయాల్సిన పనిని ఒకరితో చేయిస్తారు. నరాలు తెగే టెన్షన్‌లో పని చేయాలి. రాత్రివేళ డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తూ ప్రమాదాలకు గురయిన డెస్క్‌ జర్నలిస్టులు ఎందరో. కనీసం రవాణా సదుపాయం కూడా ఉండదు. వేతనాలు ఇస్తారుగానీ…ప్రభుత్వ చట్టాలకు, ఇక్కడ ఇచ్చే వేతనాలకు పోలీకే లేదు. ఒక సబ్‌ ఎడిటర్‌కు కనీసం రూ.25 వేలు ఇవ్వాల్సివుంటే…రూ.7 వేలు, రూ.8 వేలు ఇస్తున్న యాజమాన్యాలూ ఉన్నాయి. ఇక ఇఎస్‌, పిఎఫ్‌ వంటి సదుపాయం ప్రముఖ పత్రికల్లో మినహా మిగిలిన వాటిల్లో లేదు. టివి ఛానళ్లలోనైతే డెస్క్‌ జర్నలిస్టులు 12 గంటల పాటు పని చేస్తున్న పరిస్థితి. ఇదేగాదు మీడియా సంస్థల్లో ఉద్యోగ భద్రత సున్నా. ఎవరు ఏ స్థాయిలో పని చేస్తున్నా, అంతకంటే పైవారికి కోపం వస్తే, ఆ కింద వున్న జర్నలిస్టు నిమిషాల్లో ఉద్యోగం కోల్పోయి వీధినపడాల్సిందే.

ఎప్పుడో 130 ఏళ్ల క్రితమే కార్మిక వర్గం సాధించుకున్న 8 గంటల పని విధానం అమలు చేయమని అడిగే ధైర్యం పాత్రికేయులకు లేదు. ఎవరైనా నోరు తెరిస్తే మరుక్షణం గేటు బయట ఉంటారు. అసలు జర్నలిస్టు సంఘాల్లో చేరనీకుండా అడ్డుకున్న యాజమాన్యాలూ ఉన్నాయి. ఇప్పటికీ వెట్టిచాకిరి అమల్లో ఉన్న రంగం మీడియా రంగమే అంటే అతిశయోక్తికాదు. హక్కులు సాధించుకున్న మే-1 నాడు కార్మిక వర్గం మేడే ఆనందంగా జరుపుకుంటోంది. ఆ హక్కులను నేటికీ సాధించుకోలేని మీడియా ప్రతినిధులకు మేడే ఎప్పుడొస్తుందో!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*