మీడియా కళ్లు మూసుకోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి : బాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా కళ్లు మూసుకోవడం వల్లే అన్ని ఆరాచకాలు జరుగుతున్నాయని అన్నారు. మీడియా ప్రశ్నించడం నేర్చుకోవాలని హితబోధ చేశారు. భయపడటం మానేయాలని చెప్పారు. ఇంతకీ బాబు మీడియా ప్రతినిధులకు ఈ క్లాసు ఎందుకు తీసుకున్నారో తెలుసా…

వైఎస్‌ జగన్‌పై విశాఖపట్నంలో జరిగిన దాడికి సంబంధించి వివరణ ఇవ్వడానికి గురువారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో….ఓ విలేకరి చంద్రబాబుకు ఓ ప్రశ్న వేశారు. ‘సార్‌…విమానాశ్రయంలో జరిగిన ఈ ఉదంతంపై న్యాయ విచారణ జరిపించాలని బిజెపి ఎంపి జివిఎల్‌ కోరుతున్నారు…మీరేమంటారు’ అని ఆ విలేకరి అడిగారు. దీంతో బాబుకు ఆగ్రహం వచ్చింది.

దాడి ఎక్కడ జరిగింది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విమానాశ్రయంలో కాదా…మరి రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించడం ఏమిటి? ఆయన అడిగితే…మీరూ దాన్ని సమర్ధిస్తూ నన్ను అడుగుతారా? విమానాశ్రయంలో జరిగిన దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపిస్తుందని ఆయన్నే కడిగేయాల్సింది. మీడియా కళ్లు మూసుకోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. మీరు ప్రశ్నించడానికి భయపడుతున్నారు….అంటూ రెండు నిమిషాల పాటు క్లాసు తీసుకున్నారు.

ప్రశ్నించాలని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు….సాధారణంగా ఆయన్ను ఎవరైనా ప్రశ్నిస్తే…అది తనకు నచ్చని ప్రశ్న అయితే…విలేకరిని ఎదురు ప్రశ్న వేసి నోరు మూయిస్తారు. లేదా నీది ఏ పేపరు, ఏ టివి అంటూ దబాయిస్తాయి. నీది సాక్షి మీడియా కాబట్టే అలా మాట్లాడుతున్నారు అంటారు. లేదంటే మీరు కమ్యూనిస్టులు…మీరు ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతారు…అంటూ ఎద్దేవా చేస్తారు. అటువంటి ముఖ్యమంత్రి మీడియా ప్రశ్నించడం నేర్చుకోవాలని చెప్పడం గమనార్హం.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*