మీడియా టికెట్లకూ కోత..! ధర్మారెడ్డి కసరత్తు..!!

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత, టిటిడికి కొత్త ఛైర్మన్‌ వచ్చిన తరువాత, పాత అధికారి వెళ్లిపోయిన తరువాత…తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన కోసం కసరత్తు మొదలయింది. ఇంకా బోర్డు ఏర్పాటు కానప్పటికీ….బోర్డు కోసం ఎదురుచూడకుండా ఛైర్మన్‌ వైసి సుబ్బారెడ్డి తనదైన శైలిలో టిటిడిలో మార్పులకు శ్రీకారం చుట్టారు.

టిటిడి ఛైర్మన్‌ ముందుగా విఐపి దర్శనాలపై దృష్టిసారించారు. తిరుమల ప్రత్యేకాధికారి (జెఈవో) ధర్మారెడ్డి సహకారంతో విఐపి దర్శనాలను నియంత్రించడం మొదలుపెట్టారు. ఎల్‌ 1, ఎల్‌ 2, ఎల్‌ 3 పేరుతో సాగుతున్న దర్శనాల దందాకు చెక్‌పెట్టేందుకు….ఆ విధానంలో మార్పులు చేపట్టారు. ప్రోటోకాల్‌, నాన్‌ ప్రోటోకాల్‌ అనే రెండు కేటగిరీలుగా మాత్రమే దర్శనాలు చేయిస్తున్నారు.

ప్రోటోకాల్‌లో అత్యంత పరిమితంగా వస్తున్న వారికి మాత్రమే హారతితో కూడిన దర్శనం చేయిస్తున్నారు. మిగిలిన అందరూ హారతి లేకుండా….దర్శనం చేసుకుని బయటకు వచ్చేసేలా ఏర్పాటు చేశారు. దీనివల్ల విఐపి దర్శనాల సమయంలో గంట సమయం దాకా ఆదా అవుతోంది.

ఈ కసరత్తులో భాగంగా….మీడియాకు ఇస్తున్న బ్రేక్‌ దర్శనాలపైనా దృష్టిపెట్టారని సమాచారం. దేశ రాజధాని ఢిల్లీ, రాష్ట్ర రాజధాని అమరావతి వంటి ప్రాంతాల్లోనూ లేనంత పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు తిరుమలలో కనిపిస్తారు. మీడియా ప్రతినిధులకు…సిఫార్సు లేఖల ద్వారా విఐపి బ్రేక్‌ దర్శనం టికెట్లు, సేవా టికెట్లు ఇస్తున్న కారణంగానే తిరుమలలో ఇంత పెద్ద సంఖ్యలో విలేకరులు ఉన్నారన్న భావన అధికారుల్లో ఉంది.

గతంలో ఉన్న కొందరు అధికారులు…తమ తప్పులు బయటకు రాకుండా ఉండటం కోసం, మీడియా ప్రతినిధులను మచ్చిక చేసుకోవడం కోసం వారికి పెద్ద సంఖ్యలో టికెట్లు కేటాయిస్తూ వచ్చారన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.

దర్శనాలను క్రమబద్దీకరిస్తున్న నేపథ్యంలో…మీడియాకు ఇస్తున్న టికెట్లనూ కంట్రోల్‌ చేయాలని భావిస్తున్నారు. టిటిడి ఉద్యోగులకు ఆరు నెలలకు 10 టికెట్ల వంతున ఏడాదికి 20 టికెట్లు (రూ.300) ఇవ్వడానికి నిర్ణయించారు. ఇదే రీతిలో మీడియా ప్రతినిధులకు ఇచ్చే టికెట్లలోనూ పరిమితులు విధించాలన్న ఆలోచనతో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

మీడియా సంస్థలకు చెందిన ఛైర్మన్‌, ఎండి, ఎడిటర్‌ వంటి వారు స్వయంగా వచ్చినపుడు…ఎలాంటి ఇబ్బందీ లేకుండా టికెట్లు ఇవ్వాలని, అదే మీడియా సంస్థల సిఫార్సులపై ఇచ్చే టికెట్లను పరిమితం చేయాలని ఆలోచిస్తున్నారు. అవసరమైతే…. కొత్తగా ప్రవేశపెట్టాలనుకుంటున్న ఏఏడి దర్శనంతో సరిపెట్టాలన్న యోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు….గడచిన మూడేళ్లలో మీడియా పేరుతో ఇచ్చిన టికెట్ల వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. ఏ మీడియాకు ఎన్ని టికెట్లు ఇచ్చారు, అత్యంత డిమాండ్‌ ఉన్న వస్త్రం వంటి టికెట్ల ఎమైనా ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనే వివరాలన్నీ బయటకు తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ డేటా ఆధారంగా…అన్ని టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా, మీడియా తీసుకున్న టికెట్ల సంఖ్య హేతుబద్దంగానే ఉందా, మరీ ఎక్కువగా తీసుకున్నారా, అసలు ఊరూపేరూ లేని మీడియా పేర్లతో ఎవరైనా టికెట్లు పొందారా….అనే వివరాలూ సేకరిస్తున్నట్లు టిటిడి ఉన్నత వర్గాల సమాచారం.

గత కొన్ని రోజులుగా ధర్మారెడ్డి స్యయంగా అన్ని లేఖలు చూస్తూ టికెట్లు మంజూరు చేస్తున్నారు. కింది స్థాయి సిబ్బందికీ అవకాశం ఇవ్వడం లేదు. గతంలో…జెఈవో కార్యాలయ సిబ్బంది లేఖలపై కరసత్తు చేసి….ఫలానా వాళ్లకు ఇవ్వవచ్చు, ఫలానా ఇవ్వాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెబితే….జెఈవో తుది నిర్ణయం తీసుకునేవారు. ధర్మారెడ్డి మాత్రం ప్రతిలేఖనూ తానే చేస్తున్నారు.

విఐపి దర్శనాల సమయాన్ని సాధ్యమైనంత తగ్గించాలన్న యోచనతో…విఐపిలకూ లఘు దర్శనం పెట్టాలని భావిస్తున్న ధర్మారెడ్డి….మీడియా టికెట్ల విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి అభిమతం కూడా ఇదేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మీడియా టికెట్ల వ్యవహారంలో ఎటువంటి నిర్ణయాలు వెలువడుతాయో త్వరలోనే తేలనుంది.

ఆదిమూలం శేఖర్‌, ఎడిటర్‌, ధర్మచక్రం వారపత్రిక

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*