ముందస్తు ఎన్నికలొస్తే…ఎన్‌టిఆర్‌, వైఎస్‌ఆర్‌ ఎప్పుడొస్తారు?

2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అటు తెలుగుదేశం, ఇటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు రెండు సినిమాలు నిర్మిస్తున్నాయి. తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్‌టిఆర్‌; వైఎస్‌ఆర్‌ జీవితం కథా నేపథ్యంతో ‘యాత్ర’ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఎన్‌టిఆర్‌ చిత్రంలో రోల్‌ పాత్రను ఆయన తనయుడు బాలకృష్ణ పోషిస్తుండగా, క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక యాత్రలో వైఎస్‌ఆర్‌ పాత్రను మలయాళ నటుడు మమ్మటి పోషిస్తుంటే….దర్శకత్వ బాధ్యతలను ఆనందోబ్రహ్మ ప్రేం మహి రాఘవ చూస్తున్నారు. ఇప్ప‌టికే ఎన్‌టిఆర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌యింది. ఇటు యాత్ర టీజ‌ర్‌నూ విడుద‌ల చేశారు. ఈ రెండూ ఆస‌క్తి క‌లిగిస్తున్నాయి.

ఇంతకీ ఈ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులకు ముందుకు రానున్నాయనేది ఆసక్తికలిగించే అంశం. ఎన్‌టిఆర్‌ బయోపిక్‌ను జనవరిలో సంక్రాంతికి విడుదల చేస్తారని చెబుతున్నారు. యాత్ర కూడా అదే సమయంలో రావచ్చునని అంటున్నారు. అయితే…లోక్‌సభ ఎన్నికలు డిసెంబర్‌లోనే వస్తాయన్న వార్తలు వస్తున్నాయి. లోక్‌సభకు మందస్తు ఎన్నికలు వచ్చినా, అసెంబ్లీకి షెడ్యూల్‌ ప్రకారమే మార్చి-ఏప్రిల్‌లో జరిగినా….ఎన్నికల ఫీవర్‌ మాత్రం ఇప్పటికే మొదలయిపోయింది. లోక్‌సభకు, అసెంబ్లీకి షెడ్యూల్‌ ప్రకారం మార్చి-ఏప్రిల్‌లో జరిగితే…సినిమాలు సంక్రాంతికి విడుదల చేయడమే సరైనదవుతుంది. ఎన్నికల్లో విజయానికి ఇవి ఎంతోకొంత దోహదపడతాయి. మరి లోక్‌సభ ఎన్నికలు డిసెంబర్‌లో జరిగిపోతే… జనవరిలో సినిమాలు విడుదల చేయడం వల్ల ఆశించిన ప్రయోజనం దక్కదు. అందుకే చిత్రాల షూటింగ్‌ త్వరత్వరగా ముగించి విడుదల చేయాల్సిన అనివార్య పరిస్థితి దర్శకుల ముందుకు వస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*