ముక్కంటి అన్నప్రసాదం… భక్తులకు వరప్రసాదం…

  • రోజుకు 3 వేల నుంచి 6 వేల మందికి భోజనం
  • రోజూ రూ.40 వేలు – రూ.60 వేల విరాళాలు
  • బ్యాంకులో రూ.15 కోట్ల డిపాజిట్లు

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదం ఒక వరంలా ఉంటోంది. ప్రారంభంలో అతి కొద్దిమందికే అందించే అన్నప్రసాదం నేడు నిత్యం వేల మంది భుజిస్తున్నారు. అన్నప్రసాదంకు సంబంధించి సుమారు15 కోట్ల రూపాయలు వరకు నిధులు ఉండగా రోజూ వేల రూపాయలు విరాళాల రూపంలో వస్తున్నాయి. బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీతో నడుస్తున్న ఈ పథకం భక్తుల మన్ననలు పొందుతోంది.

ఒకప్పుడు అన్నదానంలో రోజుకు కేవలం మూడు వందల మంది భక్తులకు మాత్రమే భోజనం అందించేవారు. అది కూడా మధ్యాహ్నం పూట గంటో గంటున్నర సమయం మాత్రమే భోజనం పెట్టేవారు. వేల సంఖ్యలో వచ్చే భక్తులకు అన్నప్రసాదం దొరికేది కాదు. అప్పట్లో అన్నదానం నిర్వహించేందుకు సొంత భవనం కూడా ఉండేదికాదు.

రానురానూ భక్తుల సంఖ్య పెరగడం, ఆలయ ఆధునీకరణలో భాగంగా దక్షిణ గోపురం సమీపంలో నూతనంగా అన్నదాన మండపాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఒకేసారి రెండు, మూడు వందల మంది కూర్చొని భోంచేసే సదుపాయం ఉంది. గంట రెండు గంటల సమయమో కాకుండా ఉదయం11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరంతరంగా అన్నదాన కార్యక్రమం నడుస్తూనే ఉంటోంది. దీనికి తోడు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం రాత్రిపూట ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను అల్పాహారం అందిస్తున్నారు.

శని, ఆదివారాల్లో రెండు పూటల కలిసి ఐదారు వేల మంది భక్తులు భోంచేస్తుండగా, మిగతా రోజుల్లో మూడు నుంచి నాలుగు వేల మంది భక్తులు నిత్యం అన్నదాన మండపంలో భోంచేస్తున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ మూడవకాలం అభిషేకం అయిన తరువాత ముందుగా సాంబారు అన్నంతో దేవునికి నైవేద్యం పెట్టి తదుపరి భక్తులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. రోజూ ప్రసాదంగా నేతితో చేసిన బెల్లం, పొంగలి, రద్దీ రోజుల్లో నెయ్యితో చేసిన కేసరి, తాళింపు, సాంబారు, రసం, మజ్జిగతో కూడిన భోజనం వడ్డిస్తున్నారు. సామాన్య భక్తులేకాదు ఆలయానికి విచ్చేసే విఐపిలు సైతం అన్నప్రసాదం భుజించి వెళుతుంటారు. ఆలయాధికారులు సైతం ఈ పథకం పై ప్రత్యేక దృష్టి పెట్టి తరచూ తనిఖీలు చేపడుతుంటారు.

ముక్కంటి ఆలయం నిర్వహిస్తున్న అన్నదానపథకం ఆలయానికి వచ్చే భక్తులకే కాదు….శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే రోగులకు వరప్రసాదంగా ఉంటోంది. రోజూ మధ్యాహ్నం సమయంలో దేవస్థానం నుంచి ప్రభుత్వాసుపత్రికి భోజనం సరఫరా అవుతుంది. అక్కడ ఉండే రోగులందరికీ దేవస్థానం భోజనాన్ని అందిస్తున్నారు.

శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నదానం పథకానికి నిధుల కొరత లేదు. అన్నదాన మండపంలో భోంచేసే భక్తుల నుండి శని, ఆదివారాల్లో రోజుకు సుమారు రూ.60 వేలు నుంచి రూ.70 వేలు, సాధారణ రోజుల్లో రూ.30 వేల నుంచి రూ.40 వేలు దాకా విరాళాల రూపంలో వస్తోంది. దీనికి తోడు అన్నదానం ట్రస్టుకు సంబంధించి దాదాపు 15 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్లు ఉంది. ఈ డబ్బుల నుంచి వచ్చే వడ్డీ ద్వారానే అన్నదానం విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

ఒక భోజనానికి అన్ని ఖర్చులు కలిపి రూ.29 ఖర్చవుతోంది. సాధారణ రోజుల్లో రోజుకు 3 వేల మంది అనుకున్నా వారి భోజనానికి అయ్యే ఖర్చు రూ.87 వేలు. రద్దీ రోజుల్లో రోజుకు 5 వేల మంది భోంచేసినా లక్షా 45 వేల రూపాయలు భోజనానికి ఖర్చవుతోంది. అయినప్పటికీ నిధులకు మాత్రం ఏమాత్రం ఢోకా లేకుండా అన్నదాన పథకం విజయవంతంగా కొనసాగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*