ముక్కంటి ఉత్సవాలకు శ్రీకాళహస్తి ముస్తాబు

  • ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంఎల్ఎ
  • శరవేగంగా పనులు… ప్రముఖులకు ఆహ్వానాలు

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

దక్షిణకాశి, వాయులింగకేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈ నెల16 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తి ముస్తాబవుతోంది. పాలకమండలి లేనప్పటికీ యువకులైన ఎంఎల్ఎ బియ్యపు మధుసూధన్ రెడ్డి , ఇఓ చంద్రశేఖర్ రెడ్డి శివరాత్రి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఆలయంలో నూతనంగా తీర్చిదిద్దిన రంగవల్లులు భక్తులను ఆకర్షిస్తున్నాయి. క్యూలైన్లు శుభ్రం చేయడంతో పాటు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంతో పాటు సన్నిధివీధిలో స్వర్ణముఖి నదికి ఆనుకుని ఏర్పాటు చేసిన గోడలను ప్రత్యేక రంగులతో అలంకరిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకుగాను ప్రత్యేక పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు.

పట్టణానికి ఉన్న ప్రధాన మార్గాల్లో విద్యుత్ దీపాలతో ఆర్చిలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు నదిలో స్నానాలు చేసేందుకు స్నానఘట్టాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వంతెనలతో పాటు పురవీధుల్లో కన్నలు మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సలహాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు. అవకాశం ఉన్న ప్రతి చోట దాతల సహాయ సహకారాలు తీసుకుని ఉత్సవాలు విజయవంతానికి కృషి చేస్తున్నారు.

 శ్రీకాళహస్తిలో జరిగే ఉత్సవాలకు రావాల్సిందిగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ తో పాటు , మంత్రులు, దేవాదాయ శాఖ అధికారులును, జిల్లాలో కలెక్టర్ సహా ఇతర ప్రముఖులను ఆహ్వానించారు. మొత్తంగా కనీవినీ ఎరుగని రీతిలో ముక్కంటి ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*