ముక్కంటి క్షేత్రం .. దళారుల రాజ్యం

  • సామాన్య భక్తులకు అవస్థలు
  • విఐపిల సేవలో అధికారులు
  • చర్యలు చేపట్టామంటున్న ఇఓ

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

దక్షిణ కాశీ, వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల బాధలు వర్ణణాతీతంగా ఉంటున్నాయి. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం వస్తున్న సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. విఐపిల తోపాటు అధికారులు, సిబ్బంది ఆశీస్సులు ఉన్నవారు మాత్రం నిమిషాలు వ్యవధిలోనే దర్శనం చేసుకుంటున్నారు. ఫలితంగా సామాన్య భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దర్శనం కోసం భక్తుల పడిగాపులు

   శ్రీకాళహస్తీశ్వరాలయానికి సాధారణ రోజుల్లో ఇరవై వేలు, శని, ఆది, సోమవారం వంటి రోజుల్లో 30 వేల నుంచి 40 వేల వరకు భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం విచ్చేస్తుంటారు. సాధారణ రోజుల్లో పెద్దగా ఇబ్బందులు లేకున్నా రద్దీ రోజుల్లో, ముఖ్యమైన రోజుల్లో సాధారణ భక్తుల సమస్యలు వర్ణణాతీతంగా ఉంటున్నాయి. ఆలయానికి వచ్చే భక్తుల కోసం  సాధారణ క్యూలైన్, రూ.50 క్యూలైన్, రూ.200 ప్రత్యేక క్యూలైన్లు ఆలయాధికారులు ఏర్పాటు చేశారు. సాధారణ,రూ.50 క్యూలైన్లు బిక్షాల గాలిగోపురం మార్గంలోని మొదటి గోపురం నుంచి ప్రారంభ మవుతాయి. రూ.200 లైను ఆలయ ప్రధాన ద్వారం నుంచి ప్రారంభమవుతోంది. అయితే విఐపిలు ,అధికారులు, సిబ్బంది ఆశీస్సులు ఉన్నవారు మాత్రం ప్రత్యేక ప్రవేశ మార్గం ద్వారా నేరుగా వెళ్లి దర్శనం చేసుకుని నిమిషాలు వ్యవధిలోనే బయటకు వస్తున్నారు. సాధారణ దర్శనం, రూ.50 టికెట్ భక్తులు మాత్రం గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో సోమవారం స్వామి, అమ్మవార్ల దర్శనానికి విచ్చేశారు. సాధారణ భక్తులు దర్శనం కోసం రెండు గంటలు పైగానే క్యూలైన్ లలో నిలబడగా, రూ.50 టికెట్ భక్తులు ఒకటిన్నర గంటకు పైగా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వృద్ధులు, చిన్న పిల్లలు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు గంటలకొద్దీ క్యూలో నిలబడలేక నానా అవస్థలు పడాల్సి వచ్చింది. రూ.200, రూ.50, సాధారణ క్యూలైన్ మూడు లైన్లను ఆలయ ముఖద్వారం ముందే ఒకేచోట కలిపేస్తుండటంతో భక్తుల రద్దీ అధికమై దర్శనం కోసం అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు విఐలు వచ్చి నప్పుడు క్యూలైన్లు బ్రేక్ చేస్తుండటం భక్తులకు మరింత ఇబ్బందిగా ఉంటోంది. 

విఐపిల పేరుతో అడ్డుగోల దర్శనాలు

   దర్శనం కోసం సామాన్య భక్తులు నానా అవస్థలు పడుతున్నా పట్టించుకోని దేవస్థానం అధికారులు, సిబ్బంది.... విఐపిలు, వారి బంధువులు, అనుచరుల పేరుతో అడ్డుగోలు దర్శనాలు అధికంగా చేయిస్తున్నారనే విమర్శలున్నాయి. సోమవారం ఆలయంలో రద్దీ అధికంగా ఉండి గంటల తరబడి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. ధ్వజస్తంభం ముందు గేట్లు వేసి ఉన్నప్పటికీ కొందరు ఆలయ అధికారులు, సిబ్బంది దూరప్రాంత విఐపిల పేరుతో పదుల సంఖ్యలో భక్తులను నేరుగా దర్శనానికి పంపించడం విమర్శలకు తావిచ్చుంది. మరోవైపు దళారులు సైతం విచ్చలవిడిగా దర్శనాలు చేయించి భక్తులను దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయా పరిధిలో ఉన్న సిబ్బందికి మామూళ్లు ఇస్తుండటం వలనే దళారులు గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

గతంలో మెండుగా ఆదాయం

   గతంలో ఇక్కడ ఆలయంలో ఇఓగా పనిచేసిన భ్రమరాంభ హయాంలో ఆలయంలో దళారీ వ్యవస్థను దాదాపు నివారించేందుకు కృషి చేసి విజయవంతం అయ్యారు. నేరుగా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరూ రూ.200 టికెట్ కొనేలా చర్యలు చేపట్టారు. ఫలితంగా స్పెషల్ దర్శనం టికెట్లు ద్వారానే రోజుకు ఆలయానికి లక్ష రూపాయలు ఆదాయం వచ్చేది. సదరు ఇఓ బదిలీ కావడంతో పరిస్థితి మళ్లీ పూర్వ స్థితికి చేరుకుంది. ఫలితంగా అడ్డుగోలు దర్శనాలు అధికమయ్యాయి.  దేవస్థానం అధికారులు ఇప్పటికైనా స్పందించి సామాన్య భక్తులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.

అడ్డుగోలు దర్శనాలకు అడ్డుకట్ట : ఇఓ
శ్రీకాళహస్తీశ్వరాలయంలో అడ్డుగోలు దర్శనాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆదివారం నుంచి చర్యలు ప్రారంభించినట్లు ఆలయ ఇఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ధర్మచక్రం తో ఆయన మాట్లాడుతూ నేరుగా దర్శనానికి వెళ్లాలనుకునే ప్రతిఒక్కరూ తప్పని సరిగా రూ.200 టికెట్ కొనాల్సిదేనని చెప్పారు. తన బంధువులు నలుగురు నిన్న దర్శనానికి వస్తే రూ.800 టికెట్లు కొని దర్శనానికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఒకవేళ అధికారులు, సిబ్బంది ఎవరైనా నేరుగా దర్శనానికి పంపితే ఎవరు పంపారు… ఎంతమంది అనేది రిజిస్టర్ లో నమోదు చేయిస్తున్నట్లు చెప్పారు. నిన్న ఒక్క రోజే ప్రత్యేక ప్రవేశ టికెట్లు ద్వారా రూ.40 వేల ఆదాయం వచ్చిందన్నారు. అడ్డుగోలు దర్శనాలను పూర్తిగా నివారిస్తామని తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*