ముక్కుసూటి తేజతో ‘ఎన్‌టిఆర్‌ బయోపిక్‌’ కష్టమే!

ఆంధ్రుల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్‌టిఆర్‌) జీవిత చరిత్ర ఆధారంగా తెరకిక్కించాలనుకున్న ‘ఎన్‌టిఆర్‌ బయోపిక్‌’ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు దర్శకుడు తేజ ప్రకటించారు. మార్చి 29న చిత్ర నిర్మాణం లాంఛణంగా ప్రారంభమైన తరువాత తేజ ఈ ప్రకటన చేయడం…ఆశ్చర్యం కలిగించింది. అంతటి నటుడి బయోపిక్‌కు తాను న్యాయం చేయలేనన్న భయంతోనే….దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తేజ ప్రకటించారు. ఈ సినిమాలో ఎన్‌టిఆర్‌ పాత్రను ఆయన తనయుడు బాలకృష్ణ పోషిస్తున్న సంగతి తెలసిందే.

తేజ బయటకు చెబుతున్నట్లు సినిమాకు న్యాయం చేయలేన్న కారణంగానే దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారా…? ఇది నిజం కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. బాలకృష్ణను డైరెక్ట్‌ చేయడంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే…ఇక్కడ తేజ మనస్తత్వాన్ని కాస్త పరిశీలించాలి. ఆయన ముక్కుసూటి మనిషి. ఏది అనుకుంటే అదే చెబుతారు. ఏది చెబితే అదే చేస్తారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి చెప్పరు. మొహమాటం అనేది తేజ నిఘంటువులో ఎక్కడా కనిపించదు. చిత్ర నిర్మాణంలోనైతే…మరీ కఠినంగా ఉంటారని అందరూ చెబుతుంటారు. ముక్కుసూటితనం వల్లే చాలా అవకాశాలూ కోల్పోయారని సినిమా పెద్దలు అంటుంటారు.

ఎన్‌టిఆర్‌ బయోపిక్‌ విషయానికొస్తే….మొదటి నుంచి ఈ సినిమాపై అనేక చర్చలు సాగుతున్నాయి. ఎన్‌టిర్‌ను కేవలం ఒక నటుడిగా మాత్రమే చూపించడానికి వీల్లేదు. అలా చూపిస్తే…అది పాక్షికం అవుతుంది. ఆయన సినీ జీవితానికి ఎంత ప్రాధాన్యత ఉందో….రాజకీయ జీవితానికీ అంత ప్రాధాన్యత ఉంది. రాజకీయాల్లో ఆయన ఒక సంచలనం. పార్టీ స్థాపించిన ఎనిమిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఉత్తానం ఎంత సంచలనమో….ఆయన పతనమూ అంతే సంచలనం. లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించడంగానీ, ఆయన్ను చంద్రబాబు నాయుడు గద్దె దింపడంగానీ, తీవ్ర మనోవేదనకు గురయిన ఆయన మరణంగానీ…అన్నీ రాష్ట్రాన్ని కుదిపేశాయి. ఈ అంశాల ప్రస్తావన లేకుండా….ఎన్‌టిఆర్‌ బయోపిక్‌ తీస్తే దానికి అర్థంవుండదు. సినిమా గురించి ప్రకటన వచ్చినపుడే….ఈ చర్చ జరిగింది. ‘సినిమా ఎక్కడ ప్రారంభించాలో…ఎక్కడ ముగించాలో మాకు బాగా తెలుసు’ అని అప్పట్లో బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ మాటకు దర్శకుడు బద్దుడైవుండాలని ఏమీలేదు. సినిమాలో ఏ అంశాన్ని ఎంతమేరకు చూపించాలనేది దర్శకుడి ఇష్టం. అందుకే…తేజను దర్శకుడిగా ప్రకటించినపుడే….కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. తేజ వంటి ముక్కుసూటి దర్శకుడు ఎన్‌టిఆర్‌ జీవితంలోని విషాద అధ్యాయాన్ని చూపించకుండా వదిలేస్తారా? అని సంశయం వ్యక్తమయింది. తీరా సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యాక….దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇప్పుడు ఎన్‌టిర్‌ బయోపిక్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది చర్చనీయాంశంగా ఉంది. పూరీజగన్నాథ్‌, రాఘవేంద్రరావు తదితర పేర్లు వినిపిస్తున్నాయి. రాఘవేంద్రరావు బాగానే చేయగలరు. ఎందుకంటే..ఎన్‌టిఆర్‌తో ఆయన అనేక సినిమాలు తీశారు. ఎన్‌టిఆర్‌ వ్యక్తిత్వం నుంచి హావభావాల దాకా అన్నీ ఆయనకు తెలుసు. అదీకాకుండా….టిడిపి పరివారంలో రాఘవేంద్రరావు ఒకరిగా ఉన్నారు. ఆ రీత్యా కూడా ఆయన మరింత మనసుపెట్టి సినిమా తీసే అవకాశాలున్నాయి. అయితే…ఎవరు దర్శకత్వం వహించినా, ఎంతోకొంత రాజీపడకపోతే, ఆత్మవంచన చేసుకోకుంటే….బాలకృష్ణ ఆశిస్తున్నట్లుగా ఎన్‌టిఆర్‌ బయోపిక్‌ తీయడం అసాధ్యం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*