ముఖ్యమంత్రిగారూ ఇదేమి ధర్మం..! ఆ భూమి భారం కూడా శ్రీవారిపైనేనా!!

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో రూ.150 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని టిటిడి ధర్మకర్తల మండలి ఇటీవల నిర్ణయించింది. టిటిడి నిర్ణయించింది అనేదానికంటే…ప్రభుత్వ అదేశానికి టిటిడి ఆమోద ముద్ర వేసిందని చెప్పడమే సరైనది. ఆలయం నిర్మించడాన్ని తప్పుబట్టలేదుగానీ…శ్రీవారి ఆలయం నిర్మించమని హుకుం జారీ చేసిన ప్రభుత్వం…అందుకు అవసరమైన భూమిని కూడా ఉచితంగా ఇవ్వకపోవడంపైనే భక్తులు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌, కురుక్షేత్ర, కన్యాకుమారి తదితర ప్రాంతాల్లోనూ శ్రీవారి ఆలయాలను టిటిడి నిర్మింస్తోంది. అయితే అక్కడ బడ్జెట్‌ రూ.12 కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్యలోనే ఉంది. అమరావతి ఆలయానికి మాత్రం రూ.150 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సొంత రాష్ట్రంలో ఎక్కువ నిధులతో ఆలయం నిర్మిస్తున్నారని సరిపెట్టుకున్నా…దీనికి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన సహకారం ఇవ్వలేదనే చెప్పాలి.

ఇతర రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రపు లీజుతో స్థలాలును టిటిడికి ఇచ్చాయి. కొన్నిచోట్ల దాతలు స్థలాన్ని సమకూర్చారు. అమరావతిలో మాత్రం టిటిడి ప్రభుత్వానికి రూ.12.50 కోట్లు చెల్లించి 25 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం సిఆర్‌డిఏ (క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ ఏరియా – రాజధాని ప్రాంతం) పరిధిలో 25 ఎకరాల భూమి ఉచితంగా సమకూర్చమని టిటిడి అధికారులు సిఆర్‌డిఏ అధికారులను కోరారు. ఈ విజ్ఞప్తిని పట్టించుకోని సిఆర్‌డిఏ రూ.12.50 కోట్లు చెల్లిస్తే భూమి ఇస్తామని చెప్పింది. దీంతో చేసేది లేక టిటిడి ఆ రూ.12.50 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది.

సిఆర్‌డిఏ పరిధిలో వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థకు స్థలాలు, భూములు కేటాయిస్తున్నారు. అదే పద్ధతిలో శ్రీవారి ఆలయానికి కూడా భూమి విక్రచించారు. అయినా…భూమి కొనుగోలు చేసి, అదీ రూ.150 కోట్లతో ఆలయం నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ప్రశ్న. ఆలయం నిర్మించమని కోరిన ప్రభుత్వం ఆ మాత్రం భూమిని ఉచితంగా సమకూర్చలేదా? అసలు ఈ సమస్య ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందా? వెళ్లినా…ఆయన ఆమోదంతోనే టిటిడికి భూమి విక్రయించారా? ఇటువంటి విషయాలు తేలాల్సివుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*