ముఖ్యమంత్రిగారూ…ఎందుకంత అసహనం?

తమ సమస్యలు పరిష్కరించమంటూ తనను కలిసిన క్షురకుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. వీధుల్లో రెండు గ్రూపులు గొడవపడేటప్పుడు ఎలాగైతే మాట్లాడుకుంటారో…అచ్చం అలాగే మాట్లాడారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి తన గోడును చెప్పుకోడానికి వచ్చిన క్షురకులను భద్రతా సిబ్బంది నియంత్రిస్తుండగా..’వాళ్లను వదలండి…ఏం చేస్తారో చూస్తాను’ అని వ్యాఖ్యానించారు. ‘కనీస వేతనాలు ఇవ్వం…మీ వల్లా అయింది చేసుకోండి’ అంటూ వేలు చూపిస్తూ క్షురకుల మీది మీదికీ వెళ్లారు. ఒక దశలో చెయ్యి చేసుకుంటారేమో అనేంతగా ఊగిపోయారు. గతంలో కర్నూలులో ఏదో సమస్యలపై అడిగితే…’నేను వేసిన రోడ్డుపై నడుస్తూ, నేను ఇచ్చే పింఛను తీసుకుంటూ…టిడిపికి ఓటు వేయరా…’ అంటూ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉదంతమూ ఇప్పుడు గుర్తుకొస్తోంది. ముఖ్యమంత్రిలో ఇంత అసహనం ఎందుకొస్తోంది..?

ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. చంద్రబాబు ప్రభుత్వం కూడా ‘ప్రజలే ముందు…’ అనే నినాదం కూడా ఇస్తోంది. ఆయితే ఆచరణలో ప్రజలను బానిసలుగా చూసే పరిస్థితి ఉంది. ‘ఎవరూ తనను ప్రశ్నించకూడదు. ఎవరూ విమర్శలు చేయకూడదు.’ ఇదీ ఇప్పుడు టిడిపి నేతల ధోరణి. నాయీ బ్రాహ్మణులు అడిగిన దాంట్లో తప్పేముంది? తమకు వేతనాలు పెంచమని కోరారు. తెలుగుదేశం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. ఆ మానిఫెస్టో ప్రకారం…తలనీలాల ద్వారా వచ్చే ఆదాయంలో క్షురకులకు వాటా ఇవ్వాలి. అలా ఇవ్వాల్సివస్తే చాలానే ఇవ్వాలి. అదికూడా అడగడం లేదు. తమను ఉద్యోగులుగా గుర్తించమని అడిగారు. కనీస వేతనాలు ఇవ్వమని అడిగారు. ఇందులో తప్పేముంది? అంతగా ఊగిపోవాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వ పెద్దలు జీతాలు తమ జేబులో నుంచి ఇస్తారా? అయినా….’కనీస వేతనం ఇవ్వం’ అని ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా ఎలా అనగలరు? మాటకైనా ‘పరిశీలిస్తాం’ అని ఎందుకు అనలేకపోయారు? కారణం ఒకటే…’ఒక బడుగు కులస్తులు (ఒక మంగలోడు) నన్ను ప్రశ్నించడమా? నన్ను నిలదీయడామా’ అనే భావజాలం ఎక్కడో అంతరంగాల్లో ఉండబట్టే క్షురకుల పట్ల అలా వ్యవహరించారని అనుకోవాలి.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బిసిలే అండ దండ. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా 9 ఏళ్లు ఉన్నారన్నా, ఇప్పుడు సిఎం అయ్యారన్నా బిసిలే కారణం. బిసిలు లేకుంటే టిడిపినే లేదు. క్షురకులపై విరుచుకుపడేటప్పుడు ఈ సంగతి చంద్రబాబుకు ఎందుకు గుర్తుకురాలేదు? గుర్తుకు వచ్చివుంటే….అలా ఎలా మాట్లాడగలిగారు? జడ్జిల నియామకం విషయంలోనూ బిసిలకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారని జస్టిస్‌ ఈశ్వరయ్య ఇటీవలే తీవ్రమైన విమర్శలు చేశారు. బిసిలు వెన్నుముకగా ఉన్న టిడిపిలో రానురానూ వారికి ప్రాధాన్యత లేకుండాపోతోందన్న ఆవేదన టిడిపి నేతల నుంచే వ్యక్తం అవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే ఆ పార్టీకి బిసిలు దూరమవడానికి ఎంతో సమయం పట్టదు.

అయినా ముఖ్యమంత్రిలో ఇంత అసహనం ఎందుకు వ్యక్తమవుతోంది? రాజకీయంగా, ప్రభుత్వపరంగా ఎదురువుతున్న వైఫల్యాలు ఆయన్ను కుంగదీస్తున్నట్లున్నాయి. బిజెపితో బంధాలు తెగిపోయిన తరువాత ఆందోళన మరీ ఎక్కువయింది. తనకు ఏదో కీడు జరగబోతోందని పదేపదే చెబుతున్నారు. ఏదైనా జరిగితే తనకు అండగా ఉండాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే….అసహనం వస్తోంది. ఆ కోపం తరచూ ప్రజలపై చూపుతున్నారు. తాను తప్పులు చేసినా ఒప్పులుగా చూపించే మీడియా ఉండొచ్చు. ఆ మీడియానే నమ్ముకుని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ప్రజలకు దూరవడం ఖాయం.

ఈ వెబ్‌సైట్‌లోని పాత క‌థ‌నాల కోసం క్లిక్ చేయండి….
www.dharmachakram.in

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*