ముఖ్యమంత్రి ఆతురత, ఆరాటం దేనికి సంకేతం?

పోలింగ్ ముగిసింది. ప్రజల తీర్పు ఇవియంలలో నిక్షిప్తం అయివుంది. ఈ లోపు ఏ పార్టీ నేత అయినా సమీక్షా సమావేశాలు నిర్వహించినా ఏ బూతులో ఎన్ని ఓట్లు పడ్డాయో అంచనా వేసినా వాస్తవంలో ఈ హంగామా అంతా వృథా. ప్రజల తీర్పు జరిగి పోయింది. ప్రస్తుతం నిర్వహించే సమీక్షా సమావేశాలు వచ్చే ఎన్నికలకు తప్ప మరెందుకూ పనికి రావు. అప్పటికి రాజు ఎవరో.అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు ముగిసినప్పటి నుండి ఒక్క క్షణం స్థిమితంగా వుండ లేకున్నారు.
నిద్ర లేవగానే వీడియో కాన్ఫరెన్స్ మధ్యాహ్నం పార్టీ నేతలతో సమావేశం సాయంత్రం ప్రెస్ మీట్ క్షణం తీరిక లేకుండా గడుపు తున్నారు. గమనార్హ మైన అంశమేమంటే ఈ మూడు సమావేశాల్లో కూడా రెండు అంశాలు నొక్కి చెబుతున్నారు.1)టిడిపి నూటికి వెయ్యి శాతం గెలుపొందుతుందని ఢంకా బజాయించడం. 2)ఎన్నికల సంఘం పై చేతికి దొరికిన ప్రతి రాయి విసరడం.తోడుగా ప్రధాని మోదీనీ తెగ నాడటం.
పోలింగ్ పూర్తి అయినప్పటి నుండి ముఖ్యమంత్రి ప్రసంగాలు వింటుంటే టిడిపి శ్రేణులకు ఏమనిపిస్తుందో ఏమో గాని సామాన్య ప్రజలకు పలు సందేహాలు కలుగుతున్నాయి.నూటికి వెయ్యి శాతం గెలుపొందే నమ్మకం వున్నపుడు ఈ సమీక్షా సమావేశాలు ఎందుకు? ఏ బూతులో ఎన్ని ఓట్లు పడ్డాయనిఆరా తీయడ మెందుకు? పైగా ప్రతి క్షణం టిడిపి గెలుస్తుందని పదే పదే ఎందుకు చెప్ప వలసి వస్తోంది? గెలుపు మీద గట్టి నమ్మకం వున్నపుడు ఇంత హంగామా చేయడ మెందుకు? గెలుపొందుతామని పదే పదే చెబితే గెలుపు సులభ మౌతుందా? పైగా అప్పుడప్పుడు ముఖ్యమంత్రి ప్రసంగాలో కొన్ని ఆణిముత్యాలు దొర్లడమే కొసమెరుపు. రెండు రోజుల క్రితం మాట్లాడుతూ తాను చేసిన అభివృద్ధి అమలు జరిపిన సంక్షేమ పథకాలతో టిడిపికి ఓట్లు వేయక పోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదని తేల్చారు.ఈ వ్యాఖ్యానంలో రెండర్థాలున్నాయి. ఒకటి గెలుపు మీద ఎక్కడో ముఖ్యమంత్రికి సందేహం వుంది. మరో వేపు తనను గెలించక పోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరిక ఇమిడి వుంది. ఒక వేళ చంద్రబాబు నాయుడుకు జరగ రానిది జరిగితే ప్రజలను దోషులుగా బోనులో నిల బెడ తారేమో. పోలింగ్ జరిగి నప్పటి నుండి ముఖ్యమంత్రి దిన చర్యలు పరిశీలించితే కాలు గాలిన పిల్లి లాగా వుండ బట్ట లేకుండా అనుక్షణం ఆరాట పడటం తొట్రు పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. నూటికి వెయ్యి శాతం టిడిపి గెలుపు గురించి ప్రజలు మరచి పోతారేమో నని రోజుకు నాలుగైదు మార్లు అయినా చెప్పడంలోని ఆంతర్యం లో ఏదో నిగూఢం ఇమిడి వుందని భావించేందుకు ఆస్కారముంది. లేకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంత ఆరాటం ఎందుకు పడుతున్నారు? కానున్నది కాక మానదు అన్నట్లు ప్రజల తీర్పు నిక్షిప్తం అయిన నేపథ్యంలో నిమ్మళంగా వుండ లేకున్నా రంటే ఎక్కడో ఏదో భయం గుండెల్లో గుర్రపు డెక్క లాగా తన్ను తున్న దేమో. గతంలో చంద్రబాబు నాయుడుతన వ్యవహార శైలికి
భిన్నంగా ప్రస్తుతం ఎందుకు మాట్లాడుతున్నారని మేధావి వర్గంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చర్చ సాగుతోంది.మరోవైపు ఊహించని విధంగా ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి ఎన్నికల సంఘం పైన ఇవియం పనితీరు పైన పథకం ప్రకారం దూకుడు పెంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం చేపట్టినా ఒక ఉద్యమం లాగా సాగించడం ఆనవాయితీ. సరిగ్గా అదే విధంగా క్రమేణా రోజులు గడిచే కొద్ది ఈ దూకుడు మరింత పెంచారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆందోళన సాగించడమే కాకుండా సుప్రీంకోర్టు వరకు ఈ పోరాటం తీసుకెళ్లారు. కౌంటింగ్ తేదీ దగ్గర పడే కొద్ది ముఖ్యమంత్రి తీరు కూడా తీవ్ర రూపం దాల్చుతోంది.ఒక వేళ రేపు కౌంటింగ్ లో టిడిపి ఓడి పోతే ఎపిలో ఎన్నికల సంఘం నిర్వహించిన ఎన్నికలే చెల్లు బాటు కావని ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు కెక్కినా ఆశ్చర్య పోవలసి నది లేదు. ఇదే జరిగితే ముఖ్యమంత్రి సరి కొత్త రికార్డు సృష్టించినట్లవుతుంది ప్రజాక్షేత్రంలో కూడా పోరాటం చెస్తారేమో. ఎందుకంటే ఎన్నికల సంఘం పైన ఎన్నికలు జరిగిన తీరు పైన ముఖ్యమంత్రి ప్రతి క్షణం అంతెత్తున లేవడమే ఇందుకు నిదర్శనం.ఒక వేపు టిడిపి గెలుపు ఖాయమని చెబుతున్నారు. మరో వేపు ఎన్నికల తీరుపై నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఏ పార్టీ నేత అయినా తన పార్టీ గెలుపు ఖాయమైనపుడు ఇంకా ఎన్నికల తీరుపై ఇంత రాద్ధాంతం ఎందుకని ఎవరికైనా సందేహం ఎందుకు కలగదు? అధికారం కొద్ది రోజులలో తనను వరించే ఎవరైనా ఇలా వ్యవహరించుతారా? ఇవన్నీ శేష ప్రశ్నలే. – వి.శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*