ముఖ్యమంత్రి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు : రమణ దీక్షితులు

మహాసంప్రోక్షణం సందర్భంగా భక్తులను దర్శనానికి అనుమతించకపోవడాన్ని తప్పుబడుతూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమణ దీక్షితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేశారు. తాను గతలో చేసిన ఆరోపణలపై (పోటులో తవ్వకాలు, ఆభరణాల గల్లంతు తదితరాలు) తాను సిబిఐ విచారణ అడుగుతుండగా…జ్యుడిషియల్‌ విచారణ జరిపించాలంటూ ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసిన విషయాన్ని దీక్షితులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది ప్రజల దృష్టిని మళ్లించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. సిబిఐ విచారణతో మాత్రమే తన ఆరోపనలకు సమాధానాలు లభిస్తాయన్నారు. సిబిఐ విచారణ సరిగా జరగకుంటే అప్పుడు జ్యుడిషియల్‌ విచారణ అవసరమవుతుందని రమణ దీక్షితులు చెప్పారు.

టిటిడిలో జరుగుతున్న వ్యవహారాలపై ఎవరెవరినో కలుస్తున్నారు…ముఖ్యమంత్రిని ఎందుకు కలవడం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ….సిఎంను కలవడానికి చాలాసార్లు ప్రయత్నించానని, ఒకసారి అపాయింట్‌మెంట్‌ ఇచ్చికూడా కలిసే అవకాశం ఇవ్వలేదని చెప్పారు. ముఖ్యమంత్రి ఇప్పుడు పిలిచినా వెళ్లి మాట్లాడతానని చెప్పారు.

దర్శనానికి రావొద్దంటున్న టిటిడిపై ఒత్తిడి చేసేందుకు….భక్తులంతా తిరుమలకు తరలిరావాలని దీక్షితులు పిపునిచ్చారు. దీంతో మీరూ తిరుమలకు వెళుతున్నారా? అని విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆయన తన సమస్య పరిష్కారమైన తరువాత తప్పక వెళతానని వ్యాఖ్యానించారు. తిరుపతిలో కాకుండా చెన్నైలో, హైదరాబాద్‌లో, డిల్లీలో విలేకరుల సమావేశాలు నిర్వహించడాన్నీ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి ఆయన ‘నాకు తిరుమలలో మాట్లాడటం ఇష్టం లేదు. కొన్ని కారణాలున్నాయి’ అని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు.

మహాసంప్రోక్షణం సందర్భంగా భక్తులను ఆలయ ప్రవేశం చేయనీకుండా ఆపేయడం, సిసి కెమెరాలను పని చేయకుండా ఆఫ్‌ చేయాలనుకోవడంపై ఆయన స్పందిస్తూ… గతంలో తాను చేసిన ఆరోపణలకు ఇవి బలం చేకూర్చుతున్నాయని అన్నారు. సిబిఐ విచారణ జరిపించాలని సుబ్రమణ్యస్వామి సుప్రీంలో కేసు వేస్తున్న సందర్భంలో… ఆలయంలో చేసిన తప్పులను దిద్దుకోవడ కోసంగానీ, కొత్త తప్పులు చేయడం కోసంగానీ ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు తనకు కలుగుతున్నాయని చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*