మూడో ప్రపంచ యుద్ధం..!

రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ప్రపంచమంతా రెండుగా విడిపోయాయింది. ఒక దేశాన్ని ఇంకో దేశం నాశనం చేయాలనుకున్నాయి. తుపాకులతో కాల్చుకున్నాయి. బాంబులు వేసుకున్నాయి. ఎంతో వినాశనం. ఎన్ని లక్షల ప్రాణాలు పోయాయే తెలియదు. శవాలగుట్డపై నిలబడి చూస్తే…కొందరు గెలిచారు. కొందరు ఓడారు.

మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో‌ అనే భయం వెంటాడుతూనే ఉంది. అణుబాంబుల కాలంలో, మరమనుషుల తరుణంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తే…గెలిచే వాళ్లు ఉండరు. ఓడేవాళ్లు ఉండరు. ప్రపంచమే ఒక‌‌‌ శ్మశానం ‌అవుతుందన్న ఆందోళన ఉంది. మనిషనేవాడు మిగులుతాడా అనే భయం ఉంది.

మూడో ప్రపంచ యుద్ధం రానే వచ్చింది.‌ ఆశ్చర్యం ఇప్పుడు ప్రపంచం రెండుగా విడిపోలేదు. ఒకటిగా ఉన్నాయి. పరస్పరం సహకరించుకుంటున్నాయి. సరిహద్దులను మరచిపోయాయి. పంతాలు పట్టింపులు వదిలేశాయి. తుపాకులు లేవు. బాంబులు లేవు. యుద్ధం చేస్తున్నాయి. మరి శత్రువు‌ ఎవరు..! తుపాకులు, బాంబులు లేని యుద్ధం ఏమిటి..!

కంటికి కనిపించని ఆ శత్రువు విలయ గర్జన చేస్తోంది. మానవాళిని మింగేయడానికి‌ నోరు తెరచి ప్రపంచ దేశాల మీద పడింది. విమానాల్లో వస్తోంది. రైళ్లలో వస్తోంది. గాలిలో వస్తోంది. నీళ్లలో వస్తోంది. మన పక్క మనిషి రూపంలో వస్తోంది. మన బంధువు రూపంలో దరి చేరుతోంది. దారిలో వెళుతున్న బాటసారి రూపంలో వస్తోంది. ఏ రూపంలోనైనా వస్తుంది. ఏ మార్గంలోనైనా వస్తోంది.

మతం లేదు. కులం లేదు. వర్ణం లేదు. ప్రాంతం లేదు. పేద లేదు. ధనిక లేదు. ఎవర్నీ వదలడం లేదు. అందర్నీ ఆరగిస్తున్నా ఆకలి తీరడం లేదు. ఆవురావురుమంటూ ఇంకా ఇంకా పరిగెడుతూనేవుంది.

ఆ కనిపించని శత్రువుపైన ప్రపంచమంతా ఏకమై మహా యుద్ధం ప్రకటించింది. నీ‌‌ అంతు చూస్తామంటూ ఆ శత్రువుకు ఎదురు నిలబడింది. విజయం తమదే అనే విశ్వాసంతో ప్రపంచం పోరాడుతోంది. ఈ మూడో ప్రపంచ యుద్ధంలో గెలిచేది అన్ని‌ దేశాలు. ఓడేది మాత్రం కనిపించని‌ ఆ శత్రువు. అదే కరోనా మహమ్మారి..!

….ఆదిమూలం శేఖర్

1 Comment

  1. ఆ శత్రువు చైనా. ప్రపంచం మొత్తం ఏకమై చైనా ను ఏకాకిని చేయాలి

Leave a Reply

Your email address will not be published.


*