మేకకు మేక తొక…తోకమేక మేకతోక…టిడిపి నిర్ణయాన్ని సమర్థించేందుకు ఓ పత్రిక ప్రయాస!

New Delhi: Rajya Sabha Chairperson M Venkaiah Naidu greets newly-elected RS Deputy Chairperson Harivansh Narayan Singh during the Monsoon session of Parliament, in New Delhi on Thursday, Aug 9, 2018. (RSTV GRAB via PTI) (PTI8_9_2018_000086A)

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ తన చిరకాల శత్రువైన కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య స్నేహం కుదరనుందని వస్తున్న వార్తలకు…డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక బలం చేకూర్చుతోంది. కర్నాకటలో కాంగ్రెస్‌-జెడిఎస్‌ సంకీర్ణ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హాజరవడం, అక్కడ తాను సహజంగా చూపించే విజయ చిహ్నం బదులు ‘హస్తం’ చూపించడం; రాహుల్‌ గాంధీ భుజంపై చెయ్యి వెయ్యడం ఇవన్నీ అప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పడు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక విషయంలోనూ అదే ఆసక్తి నెలకొంది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి మూలమే కాంగ్రెస్‌. టిడిపి ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్‌పైనే అది పోరాడుతోంది. ఒక విధంగా చెప్పాలంటే….టిడిపికి కాంగ్రెస్‌ చిరకాల శత్రువు. ఈ రెండు పార్టీలూ ఒకటవుతాయని ఇరు పార్టీల కార్యకర్తలు, నేతలు ఊహించివుండరు. తమ మధ్య ఎటువంటి అవగాహన లేదని చంద్రబాబు నాయుడు చెబుతున్నప్పటికీ….కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా ఆయన చెప్పినవన్నీ అసత్యాలని తేలిపోయింది. ఇది కచ్చితంగా తెలుగు ప్రజలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన వార్తే. పతాక శీర్షికలో ప్రచురించాల్సిన వార్తే.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికను ఓ ప్రధాన పత్రిక కవర్‌ చేసిన తీరు చూస్తే…. ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వార్తను మొదటి పేజీలో వేసినప్పటికీ….తెలుగుదేశం పార్టీ తన చిరకాల శత్రువైన కాంగ్రెస అభ్యర్థికి ఓటు వేసిందనే విషయం ఉప శీర్షికల్లోగానీ, లీడ్‌లోగానీ కనపించదు. ప్రధాన వార్త కాకుండా మరో వార్తలో, అదీ అష్టవంకరులు తిరిగిన వాక్యంలో, డొంకతిరుగుడుగా ఈ అంశాన్ని రాశారు.

కాంగ్రెస్‌ కంటే బాజపానే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న టిడిపి….గతనెలలో తమ అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో చర్చకు వచ్చేలా చేసి, భాజపా వైఖరిని దేశవ్యాప్తంగా ఎండగట్టేందుకు సరైన వేదిక కల్పించిన మిత్రపక్షాల ఐక్యతకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌తో ఉన్న దీర్ఘకాల వైరాన్ని పక్కనపెట్టి ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది…..ఇదీ ఆ పత్రిక డొంకతిరుగుడు దీర్ఘ వాక్యం. మేకకు మేక తొక…తోకమేక మేకతోక….వంటి తెనాలి రామకృష్ణుడి కవితలాగా ఉన్న ఈ వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది. టిడిపి నిర్ణయాన్ని సమర్థించడానికి ఇంతగా ప్రయాస పడాల్సిన అవసరం ఓ పత్రికకు ఏముంది?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*