మేజర్ చంద్రకాంత్ సినిమా ఉత్సవం… జర్నలిస్టులకు ఒక పాఠం..!

సీనియర్ పాత్రికేయులు నేతాజీ కుమారమంగళం చెప్పిన‌ తన అనుభవాలు..జ్ఞాపకాలు.

తిరుపతిలో నేను 1994 నుంచి పాత్రికేయ వృత్తిలో ఉన్నాను. ఈ రెండు దశాబ్దాాలలో తిరుపతిలో జరిగిన ఎన్నో ముఖ్యమైన ఉదంతాలకు, ఘటనలకు ప్రత్యక్ష సాక్షిని. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రమైనందున తిరుపతికి అంతర్జాతీయ ఖ్యాతి లభించినట్లే… తిరుపతి జర్నలిజానికీ ఆ స్థాయి ప్రాధాన్యత దక్కింది. టిటిడి ఆదాయ వ్యయాలపైన, స్వామికి భక్తులు సమర్పించే తనీలాలపైన అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బిబిసి కూడా ప్రత్యేక కథనాలు చేసిందంటే జర్నలిజం పరంగా తిరుపతికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. రాజకీయపరంగానూ తిరుపతికి ప్రత్యేక స్థానముంది. ఎన్నో సంచలన రాజకీయ ప్రకటనలకు కేంద్రమయింది తిరుపతి. ప్రధాన మంత్రులు, రాష్ట్రపతుల నుంచి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రులు, ఉన్నతాధికారులు, అనేక దేశాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు తిరుపతిని సందర్శిస్తుంటారు. అందుకే అరుదైన అనుభవాలు, జ్ఞాపకాలు ఇక్కడ పనిచేసే పాత్రికేయుల సొంతం.

తిరుపతి అభివృద్ధిలో మీడియా…
తిరుపతి జర్నలిజాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం లేకుండా ఊమించలేం. తిరుమలలో శ్రీవారి ఆలయం, తిరుపతిలో వివిధ ఆలయాలు టిటిడి పరిధిలో ఉండడంతో సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రముఖ ఉత్సవాలు ఏడాది పొడవునా ఆధ్మాత్మిక వార్తలకు, దేశ, అంతర్జాతీయ సంచలన వార్తలకు కేంద్రంగా తిరుపతి మారింది. తిరుమల ఆలయానికి విఐపిల రాకను వార్తలుగా మలచుకోవడం, వారితో మాట్లాడించే ధోరణి ఎక్ట్రానిక్‌ మీడియా వచ్చాక ఎక్కువయింది. అదే సమయంలో టిటిడిలో సంస్థాపరంగా ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, భక్తుల సౌకర్యాల కల్పన, ఉద్యోగుల వసతులు, బడ్జెట్‌, ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాతో టిటిడి ఇంజినిరింగ్‌ విభాగం చేపడుతున్న నిర్మాణాల గురించి…ఇలా అన్ని కోణాల్లో టిటిడి వార్తలు మలువడుతున్నాయి. టిటిడిపై తిరుపతి తొలితరం పాత్రికేయులు రాసిన వార్తల వల్ల తిరుపతి తాగునీటి వనరుగా ఉన్న కళ్యాణి డ్యాం నిర్మాణానికి, అంతకు ముందు 1955-56 సంవత్సరాల్లో రుయా ఆసుపత్రి, ఎస్‌వి మెడికల్‌ కాలేజీ, ఎస్‌వి యూనివర్సిటీ , రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఏర్పాటుకు టిటిడి ముందుకొచ్చింది. స్థలాలు, నిధులు సమకూర్చింది. రెండవతరం పాత్రికేయులు రాసిన కథనాల వల్ల టిటిడి ద్వారా తిరుపతి నగరానికి భూగర్భ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, స్విమ్స్‌ ఆస్పత్రి ఏర్పాటు, తెలుగుగంగ నీటి సరఫరా పథకం, వేదిక్‌ యూనివర్సిటీ వంటి పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. ముఖ్యమంత్రులు ఎన్‌టి రామారావు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు తదితరులపై తిరుపతి వార్తల ప్రభావం చాలా ఉంది. రుయాసుపత్రి నిర్వహణ చేపట్టడం, కొత్త ప్రసూతి ఆసుపత్రి నిర్మాణం, విద్యాసంస్థ స్థాపనలోనూ మీడియా కథనాలు చాలా ప్రభావం చూపాయి. టిటిడి దేశ విదేశాల నుంచి భక్తులు వీలైనంత ఎక్కువగా కోట్లలో విరాళాలు ఇచ్చేలా చేయడంలో తిరుపతి పాత్రికేయుల పాత్ర ప్రముఖంగా ఉంది.

వార్తలు పంపడానికి ఎన్ని కష్టాలో….
ఒకప్పుడు తిరుపతి నుంచి వార్తలు పంపడం అత్యంత క్లిష్టంగా ఉండేది. 2000 సంవత్సరంలో ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చే వరకు విలేకరులు వార్తలను కవర్‌ చేయడం ఒక ఎత్తయితే, ఆ వార్తను పంపడం మరో ఎత్తుగా ఉండేది. ప్రారంభంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఉదయం పత్రిికలు మాత్రమే తిరుపతిలో ముద్రితమయ్యేవి. ఈ మూడు పత్రికలవారు తిరుపతి నుంచి రేణిగుంటలోని ప్రెస్‌కు వార్తలు పంపాలంటే రేణిగుంట వైపు వెళ్లే బస్సులకు వార్తల కవర్లు ఇచ్చి పంపేవారు. ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా ఉన్న ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి వంటి దినపత్రికలకు 1994-95 వరకు బస్సుల్లో న్యూస్‌ కవర్లు పంపితే ఆ వార్త మూడు రోజుల తరువాత ప్రచురితమయ్యేది. ఆ తరువాత 1996-97 సంవత్సరం నుంచి తిరుపతి బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాయంలో టెలిప్రింటర్‌ ద్వారా వార్తలు పంపేవాళ్లం. ఆ తరువాత ఫ్యాక్స్‌ మిషన్లతో కుస్తీ పట్టేవాళ్లం. ఒక్కోసారి ఫ్యాక్స్‌ మిషను లైను ఎంగేజ్‌ వచ్చేది. వార్త సగం వెళ్లి సగంలో ఆగిపోతే మళ్లీ మొదటి నుంచి పంపాల్సివచ్చేది. దీంతో రోజూ వార్తలు పంపి సాయంత్రం 4 గంటకు, ఒక్కోసారి సాయంత్రం 5 గంటకు భోజనం చేయాల్సివచ్చేది. ఆ తరువాత స్థానిక కార్యాలయాల్లో కంప్యూటర్‌ ఏర్పాటు చేసుకుని, ల్యాండ్‌లైన్‌తో డయిలప్‌ మోడం ద్వారా వార్తలు పంపేవారు. ఆపైన లీస్డ్‌లైన్‌, ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాయి. దీంతో సెకన్లలో పెద్ద ఫైల్స్‌, ఫొటోలు ఘటనా స్థలం నుంచే పంపే వసతి అందుబాటులోకి వచ్చింది. వార్తలు పంపడంలో లాప్‌టాప్‌ వినియోగం, త్రీజీ కిటల్‌ వినియోగం పెరిగింది. వార్తలు పంపడం కొత్తకొత్తగా అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చు కోవటంలో తిరుపతి పాత్రికేయులు ముందున్నారు.

రోడ్డుపైన పుట్టిన సంచలన వార్త…
ప్రభుత్వాన్ని కుదిపేసే వార్తలు, రాష్ట్రలో సంచలనంగా మారినవి తిరుపతి రోడ్లపై నుంచి పుట్టుకొచ్చినవే. అలాంటి వాటిల్లో తిరుపతి నగరంలో సగం కాలనీలు, నివాస ప్రాంతాలు తమవేనని ఇళ్ల యజమానులకు టిటిడి లీగల్‌ నోటీసు పంపింది. ఈ మేరకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం టిటిడికి అనుకూలంగా జీవో నెంబరు 170 జారీ చేసింది. తిరుపతిలో టిటిడి ప్రాంతాలుగా గుర్తించిన నివాసాలు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ ఆపేశారు. ఈ వార్త యాధృచ్ఛికంగా దొడ్డాపురం వీధిలో ఒక టిఫిన్‌ అంగడి వద్ద ఉదయం టిఫిన్‌ చేస్తుండగా ఆ అంగడి మహిళ తిడుతున్న బూతు నుంచి పుట్టుకొచ్చింది. మాకే నోటీసు ఇస్తారా…అంటూ ఆగ్రహంగా అరుస్తున్న ఆమెతో మాట కలిపితే అసలు విషయం బయటికొచ్చింది. దీన్ని వార్తగా రాస్తే సంచలనమయింది. ఈ వార్త మొదట ప్రజాశక్తిలో, ఆ తరువాత ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయింది. కథనాలు వెలువడ్డాక అన్ని రాజకీయ పార్టీలూ అఖిపక్షంగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో మూడు నెలల పాటు మీడియా వరుస కథనాలు ప్రచురించడంతో అప్పడు సిఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ జీవోను ఉపసంహరించారు. టిఫిన్‌ పెట్టే మహిళ పెట్టిన శాపనార్దాలను పట్టించుకోకుండా నామటుకు నేను వచ్చేసివుంటే, నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన సంచలన వార్త దొరికేది కాదు.

వామ్మో…ఏమైవుండేదో
2003 అక్టోబర్‌ 1న చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళుతుండగా ఆయన్ను లక్ష్యంగా చేసుకుని నక్సల్స్‌ అలిపిరి వద్ద  క్లైమోర్‌ మైన్స్‌ పేల్చారు. అప్పుడు సిఎం కాన్వాయ్‌లో నేనూ ఉన్నాను. ఘటన నుంచి తేరుకుని వృత్తి బాధ్యతలను నిర్వర్తించడానికి కొంత సమయం పట్టినా…ఆ ఘటనకు సంబంధించిన కవరేజీ జర్నలిస్టులుగా మాకు ఎంతో నేర్పింది. పేలుడు సంభవించిన వెంటనే హైదరాబాద్‌లోని ఎడిటర్‌కు, ఇతర సీనియర్లకు విషయం తెలియజేసి సమాచార సేకరణకు పరుగులు తీశాం. పేలినవి కాకుండా పేలనివి మరో 17 క్లైమోర్‌మైన్స్‌ను రెండో రోజు బాంబు డిస్పోజబుల్‌ స్క్వాడ్‌ వెలికితీసి నిర్వీర్యం చేసింది. అయితే ముందు రోజు సంఘటన జరిగిన వెంటనే రాళ్లగుట్ట కింద పేలకుండా ఉన్న మైన్స్‌పైనే నడిచిన విషయం గుర్తుకు రావడంతో చెమటులు పట్టాయి. పోలీసులు వారిస్తున్నా రాళ్లగుట్టపైకి ఎక్కి అటూఇటూ తిరుగడం ఎంత ప్రమోదమో క్లైమోర్‌ మైన్స్‌ వెలికితీసినపుడుగానీ అర్థం కాలేదు. వామ్మో…అవికూడా పేలివుంటే..! ఘటన జరిగిన రోజు నుంచి మూడు నెలల పాటు సిట్‌ టీమ్‌ దర్యాప్తు వార్తల కోసం పరుగులు తీయాల్సివచ్చింది. డిటి నాయక్‌ నేతృత్వంలోని సిట్‌ దర్యాప్తు చేస్తున్నా ఏ విషయాన్ని అధికారికంగా చెప్పేవాళ్లు కాదు. దర్యాప్తుపై వార్తలు ఇవ్వమని హైదరాబాద్‌ నుంచి ఒత్తిడి చేసేవాళ్లు. దీంతో రోజూ దర్యాప్తు వార్తల కోసం టెన్షన్‌ పడ్డాం. మీడియాలో వచ్చిన కథనాలు, ఆపై సిట్‌ చెప్పె విషయాలు సరిపోయాయి. ఆతృత, ఒత్తిడిలో కొన్ని ఊహాజనిత కథనాలు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. విలేకరుల మధ్య పోటీతో ఒక పాత్రికేయుడు మరో ఇద్దరు పాత్రికేయులతో… సిట్‌ అధికారులు గాడిదను అదుపులోకి తీసుకున్నారని సరదాగా అంటే…అదే నిజమనుకుని ఆ విలేకరి వార్త ఇచ్చేశారు. అది ఒక ప్రముఖ దినపత్రికలో ప్రచురితమయింది కూడా. నక్సల్‌ ఆ ఇంట్లో ఉన్నారని ఒకరోజు, ఈ ఇంట్లో ఉన్నారని ఇంకోరోజు…ఇలా రోజుకో ఇంటిఫొటో వేసి వార్త ఇచ్చేవారు. దీంతో సిట్‌ అధికారులు ఆ ఇళ్ల వద్దకు పరుగు తీసేవారు. ఈ మూడు నెలలూ ఉదయం 9 గంట నుంచి రాత్రి 2 – 3 గంటల దాకా పని చేశారు. తిరుపతి జర్నలిస్టులకు ఇదొక మరచిపోలేని ఉదంతం.

సినిమా వేడుకేగదా అనుకునోళ్లకు ఉద్యోగాలు పోయాయి….
ఎన్‌టిఆర్‌ 1994లో మేజర్‌ చంద్రకాంత్‌ శతదినోత్సవ వేడుకలకు వచ్చి తిరుమకెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఏదో కీలక ప్రకటన చేస్తారని ప్రచారంలో ఉంది…అని కొందరు విలేకరులు తిరుమలోనే ఎన్‌టిఆర్‌ను అడిగారు. దానికి ఆయన ‘కొండపైన వద్దు బ్రదర్‌….చెప్పాల్సిందంతా తిరుపతిలోనే చెబుతాను రండి’ అంటూ సున్నితంగా తిరస్కరించారు. తిరుమలో ఇతర విషయాలు ఏమీ మాట్లాడకూడదన్న సంప్రదాయం ఎన్‌టిఆర్‌తోనే మొదయింది. అదే రోజు సాయంత్రం నెహ్రూ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో మేజర్‌ చంద్రకాంత్‌ ఉత్సవ వేడుక వేదికపైన, కార్యక్రమం చివర్లో ‘లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటున్నా’ అని ఎన్‌టిఆర్‌ సంచలన ప్రకటన చేశారు. ఈ వార్తను ప్రధాన దినపత్రికల్లో ఒకటి రెండు మాత్రమే కవర్‌ చేశాయి. మిగిలినవి ఇవ్వలేకపోయాయి.  సినిమా ఉత్సవమే కదా…అనుకుని, చివరిదాకా ఉండకుండా వెళ్లిపోయిన సీనియర్‌ పాత్రికేయులు కొందరు వార్తను మిస్పయి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. కొందరు మెమోలు అందుకున్నారు. కొందరు సస్పెండ్‌ అయ్యారు. ఒక ప్రధాన వార్త కరేజీకి వెళ్లినపుడు చివరిదాకా ఉండాల్సిందేనన్న ప్రాథమిక పాఠం మేజర్‌ చంద్రకాంత్‌ ఉత్సవం వార్తతో నేర్చుకున్నాను.

  • – కుమారమంగళం నేతాజీ

2 Comments

  1. నేతాజీ అన్న మీ అనుభవాలు జ్ఞాపకాలు చాలా బాగున్నాయి

  2. That’s written very well Netaji. Your memoirs in Journalism in Tirupati is a part of the history of the town and you have captured that part of the timeline extremely well. There are probably no such stories about Journalism in Tirupati that blend history, journalism and human experiences. Good job.

Leave a Reply

Your email address will not be published.


*