మేలో టిడిపికి కష్టాలు రాబోతున్నాయా?…బాబు మాటల్లోని అర్థం ఏమిటి?

ధర్మపోరాట దీక్ష ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు ఒకటిన్నర గంట సేపు సుదీర్ఘంగా మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని విపులంగా వివరించారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఏవీ ఈ దీక్షలో పాల్గొనకపోయినప్పటికీ…టిడిపి కోణంలో చూసినపుడు ఈ దీక్ష విజయవంతం అయినట్లే భావించాలి. చిన్నచిన్న పార్టీలు కొన్ని, ఉద్యోగ, కుల సంఘాలు కొన్ని హాజరయ్యాయి. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించాయి. ఈ సభతో టిడిపి ఎంతోకొంత లాభపడిందనే చెప్పాలి.

దీక్ష ముగింపు సందర్భంగా చంద్రబాబు పదేపదే మాట్లాడినదాన్ని బట్టి…మే నెలలో కర్నాటక ఎన్నికల తరువాత కేంద్రం నుంచి ఇబ్బందులు ఎదురుకానున్నాయని ఆయన గట్టిగా అంచనా వేస్తున్నట్లున్నారు. అందుకే ఆయన ఆ విషయాన్ని పదేపదే చెప్పారు. ‘మేలో కర్నాటక ఎన్నికల తరువాత మన రాష్ట్రంపైన బిజెపి దృష్టి పెట్టవచ్చు. ప్రభుత్వానికి, వ్యక్తులకు ఇబ్బందులు కలిగించవచ్చు. ప్రభుత్వం మీదపడినా, వ్యక్తుల మీదపడినా…మనమంతా పోరాడాలి. మీరంతా ఇదే విధంగా పోరాటం చేయాలి’ అని ఒకటికి నాలుగుసార్లు సభలో చెప్పారు. అదేవిధంగా ‘నేను ఎవరికీ భయపడను’ అనే మాటను పదుల సార్లు అన్నారు.

ముఖ్యమంత్రి తాను ఎవరికీ భయపడనని గంభీరంగా చెబుతున్నారుగానీ…. ఏదో ఆందోళన మాత్రం ఆయన్ను వెంటాడుతోందన్న విషయం ఈ ఉపన్యాసంతో బయటపడింది. పోలవరం, అమరావతి భూసేకరణ, విశాఖ భూముల సమస్య తదితర అంశాలపై బిసిఐ విచారణ జరిపించాలని బిజెపి గత కొన్నిరోజులుగా డిమాండ్‌ చేస్తోంది. కక్ష సాధింపుతోనైనా అలాంటి చర్యలు కేంద్రం నుంచి ఎదురయితే ఎదుర్కోడానికి వీలుగా జనాన్ని ధర్మదీక్ష సభ ద్వారా సన్నద్ధం చేశారా? అనే భావన కలుగుతోంది. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉంటూ ఎన్‌టిఆర్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయడం, దానికి వ్యతిరేకంగా తెలుగు ప్రజలు ప్రజాఉద్యమంతో కేంద్రం మెడలు వంచిన అంశాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రాష్ట్రం విషయంలో అలాంటి ఉద్యమం అవసరం కావచ్చు…అనే సంకేతాలు ఇచ్చారు. మేలో ఏం జరగబోతోందని, చంద్రబాబు ఊహించినదే జరిగితే…ప్రజలు ఎంతమేరకు ఆయనకు అండగా నిలబడతారు…అనేది చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*