మైండ్‌ గేమ్‌ మొదలుపెట్టిన బాబు!

తాను తీసుకున్న నిర్ణయం ఎంత అసంబద్ధంగా ఉన్నా ప్రజలను ఒప్పించడానికి, మెప్పించడానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పావులు కదుపుతారు. బిజెపితో కలవడమైనా, బిజెపిని వదిలేయడమైనా, కాంగ్రెస్‌తో దగ్గరవడమైనా…అది ఏ నిర్ణయమైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసమే అన్నట్లు ప్రజలను నమ్మించగల సమర్థులు చంద్రబాబు నాయుడు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలవడానికి సిద్ధమైన టిడిపి…మెల్లగా తమ పార్టీ కేడర్‌ను, ప్రజలను అందుకు సిద్ధం చేసేపనిని చంద్రబాబు ప్రారంభించినట్లు అనిపిస్తోంది.

తెలుగదేశం పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జరిగింది. గత ఎన్నికల దాకా టిడిపికి కాంగ్రెస్‌ పార్టీనే ప్రథమ శత్రువు. అటువంటిది ఇప్పుడు కాంగ్రెస్‌తోనే పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనలో టిడిపి నేతలున్నారు. అయితే…దీన్ని ప్రజలు ఆమోదిస్తారా లేదా అనే చిన్న సందేహం మాత్రం ఆ నేతల్లో ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని యోచిస్తున్నట్లు చెబుతూ, దానికి జనామోదం లభించేలా ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇటీవల ఏఐసిసి అధ్యక్షులు రాహుల్‌ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన ఓ సమావేశానికి చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణితో పాటు పలువురు టిడిపి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు హాజరవడం చర్చనీయాంశమయింది. తెలంగాణలో టిడిపి స్వతంత్య్రంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో తాము కాంగ్రెస్‌కు అండగా ఉంటాం….అనే సంకేతాలను తెలుగుదేశం పార్టీ ఇచ్చింది.

దానికి కొనసాగింపుగానే….మంగళవారం (21.08.2018న) అమరావతిలో కొందరు తెలుగుదేశం నాయకులతో సమావేశం నిర్వహించి రాజకీయాలపై చర్చించారు చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమే మేలని నేతలంతా చంద్రబాబుకు చెప్పినట్లు వార్తలొచ్చాయి. మళ్లీ బిజెపి గెలిస్తే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇస్తున్నందున ఆ పార్టీతో పొత్తుపెట్టుకోవడం పెద్ద సమస్యగా ఉండబోదని కూడా నాయకులు చెప్పినట్లు ఆ వార్తల సమాచారం. కాంగ్రెస్‌ పట్ల వ్యతిరేకత తగ్గుతోందని, బిజెపి ఆదరణ కోల్పోతోందని అంచనాలూ వేశారు.

రాజకీయాల్లో పొత్తులు, అవగాహనలు తప్పుకాదు. ఆ మాటకొస్తే అవి లేకుండా ఇప్పుడు రాజకీయాలే లేవు. ఏక పార్టీ పాలనకు జాతీయ స్థాయిలో ఎప్పుడో గండిపడింది. ఇప్పుడు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి తలెత్తుతోంది. రాజకీయాల్లో పొత్తులైనా, అవగాహనలైనా మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండకూడదు. అయితే…తెలుగుదేశం చేస్తున్న ఆలోచన తన మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది. తన బద్ధశత్రువైన కాంగ్రెస్‌తోనే జత కట్టడానికి సిద్ధమవుతోంది.

తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలతో ఒప్పించగలనన్న నమ్మకం చంద్రబాబుది. ఒకప్పుడు మతతత్వ బిజెపితో ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసేది లేదని చెప్పిన చంద్రబాబు…ఆ తరువాత ఆ మాటలే గుర్తులేవన్నట్లు గత ఎన్నికల్లో ఆ పార్టీతో జతకట్టడమేకాదు…. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంలో చేరారు. రాష్ట్రంలోని తమ ప్రభుత్వంలో బిజెపికి భాగస్వామ్యం కల్పించారు. నాలుగేళ్లు బిజెపిపై ఈగ వాలనివ్వలేదు. ఆ నాలుగేళ్లు కూడా ప్రత్యక హోదా విషయం చర్చకొస్తే…కాంగ్రెస్‌ను ఆడిపోసుకున్నారు. కాంగ్రెస్‌ చేసిన అసంబద్ధ విభజన వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్సే పెద్ద ద్రోహి అని చెబుతూ వచ్చారు.

ఇప్పుడు ఏవో రాజకీయ కారణాలతో బిజెపి నుంచి బయటకొచ్చిన తరువాత….రివర్స్‌లో మాట్లాడుతున్నారు. బిజెపినే ప్రథమ శత్రువుని చెబుతున్నారు. బిజెపిని ఓడించడమే కర్తవ్యమంటున్నారు. కాంగ్రెస్‌తో పొత్తుకు సై అంటున్నారు. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే….చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపించడం ఖాయమని, ఆ భయంతోనే చంద్రబాబు కాంగ్రెస్‌కు చేరువవుతున్నారని వైసిపి విమర్శిస్తోంది.

ఏమైనా చంద్రబాబు నాయుడు మరోసారి తన చతురత ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా అది తన కోసం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని జనాన్ని నమ్మించడానికి సన్నద్ధమవుతున్నారు. ఎంతటి అసంబద్ధ నిర్ణయాన్ని అయినా…సమర్థించగల మీడియా ఉన్నంత కాలం బాబుకు తిరుగేమి ఉంటుంది?!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*