మోడీతో బాబు కరచాలనాన్ని సమర్థించేవాళ్లు కచ్చితంగా చదవండి!

ఢిల్లీలో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో నవ్వుతూ కరచాలనం చేసిన ఫొటోపై పెద్ద చర్చ జరుగుతోంది. తెలుగుదేశం నాయకులు సహజంగానే ‘ఇందులో తప్పేముంది’ అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఏది చేసినా కరెక్టే అని పత్రికలు, టివి ఛానళ్లు తమ పాత్రికేయ ప్రతిభ అంతా ప్రదర్శించాయి. కొన్ని పత్రికలు ప్రాధాన్యతే లేదన్నట్లు ఈ ఫొటోను పూర్తిగా ప్రచురించలేదు. ప్రధాని కుమారస్వామితో మాట్లాడే ఫొటోలు పెట్టారు. టివి ఛానళ్లు అయితే….ఇంకా తెలివిగా చూపించాయి. సమావేశంలో మోడీ ఇటు తిరిగి కూర్చునివుండగా…ఆయన వెనుక వైపు నుంచి వెళుతున్న దృశ్యాలను పదేపదే చూపించారు. అంటే చంద్రబాబు ప్రధానమంత్రిని ఖాతరు చేయలేదు అని చెప్పేందుకు తమతహలాడారు. అదేవిధంగా నలుగురు ముఖ్యమంత్రులు (బాబు, కుమారస్వామి, మమతా బెనర్జీ, పినరయ్‌ విజయన్‌) కలిసివుండగా….ప్రధాన మంత్రే వాళ్ల వద్దకు వచ్చి పలకరించి, మాటలు కలిపారని కూడా కొందరు రాశారు.

మోడీతో బాబు కరచాలనాన్ని సమర్థించేవాళ్లు చెబుతున్నదేమంటే…ప్రధాన మంత్రే దగ్గరకు వచ్చి పలకరిస్తే చేయి కలపడంలో తప్పేముందని అని వాదిస్తున్నారు. అదేవిధంగా కొందరు…పార్టీలు వేరైనంత మాత్రాన కరచాలనం చేసుకోవడం తప్పు అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. మామూలుగానైతే ఇటువంటి కరచాలనాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు. ఎదుటి వ్యక్తి పలకరించినపుడు సరిగా స్పందించకపోవడం సంస్కారం అనిపించుకోదు కూడా. అయితే…ఇది ప్రత్యేకమైన సందర్భం. గత కొన్ని నెలలుగా చంద్రబాబు నాయుడు వివిధ సభల్లో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు కురిపించారు. ఆయన్ను పెద్ద నియంతగా అభివర్ణించారు. రాజకీయాల్లో మోడీ తనకంటే జూనియర్‌ అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ముందు తగ్గి, ఎంతో మర్యాదగా, గౌరవంగా మసలుకున్నానని చెప్పారు. ఇంకో విధంగా చెప్పాలంటే తన ఇగోను కూడా పక్కన పెట్టానని చెప్పారు. అయినా మోడీ తనను మోసం చేశారని అన్నారు. ఆయన కుసంస్కారి అనే విధంగా టిడిపి నేతలు మాట్లాడారు. దీనికి ఉదాహరణగా బిజెపి సీనియర్‌ నేత అద్వానీతో మోడీ వ్యవహరించిన తీరును గుర్తు చేశారు. ఇక ఢిల్లీ సమావేశానికి వెళ్లే ముందు…మోడీతో అమీతుమీ తేల్చుకుంటారని, తాను చెప్పాల్సింది చెప్పేసి నీతి ఆయోగ్‌ సమావేశం నుంచి వాకౌట్‌ చేస్తారని, చంద్రబాబు మోడీపై యుద్దం ప్రకటించారని…ఇలా ఏవేవో కథనాలు తెదేపాను సమర్థించే మీడియాలో చూపించారు. ఆదివారం ఏమి జరగబోతోందో అని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూశారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముఖం నిండా నవ్వులు నింపుకుని, ముందుకు ఒంగి ప్రధాన మోడీతో కరచాలనం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫొటో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో పనిచేసే సీనియర్‌ పాత్రికేయులు వ్యగ్య వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్లో ఔచిత్యం ఉంది. ఎందుకంటే….మోడీపై బాబు చూపిస్తూ వచ్చిన ఆగ్రహం నిజమే అయితే….మోడీనే స్వయంగా తన వద్దకు వచ్చి కరచాలనం చేసినా…అంతగా పరవశిస్తూ చెయ్యి కలపాల్సిన పనిలేదు. హలో అంటే హలో అనే రీతిగా అది జరిగిపోయివుండాల్సిది. కరచాలనం గురించి వదిలేద్దాం….రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంగతి ఏమిటో తేల్చుకోడానికి నీతి ఆయోగ్‌ సమావేశం అద్భుతమైన వేదిక. అక్కడే నిరసనకు దిగివుండొచ్చు. కేజ్రీవాల్‌ బిజెపిపై పోరాటంలో భాగంగా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో నాలుగు రోజులుగా దీక్షకు కూర్చున్నారు. అలాంటి తీవ్రమైన చర్యకే బాబు దిగివుండొచ్చు. అప్పుడే ఏదో ఒక సమాధానం చెప్పాల్సిన అనివార్యత ప్రధానికి ఏర్పడేది. చంద్రబాబు మాత్రం తాను తీసుకెళ్లిన 12 పేజీల ఉపన్యాసం చదవి వచ్చేశారు. దీనివల్ల ఉపయోగం ఏమిటి? కనీసం ప్రధాని నుంచి సమాధానం అడిగారా? ఏమీలేదు. మోడీ కూడా బాబు డిమాండ్లపై స్పందించలేదు. ఇక ఈ సమావేశం వల్ల ప్రయోజనం ఏమిటి? బాబు కేంద్రాన్ని గట్టిగా నిలదీశారని ఎలా నమ్మాలి? అదీకాకుండా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయడానికి ఒక కమిటీని నియమిస్తూ అందులో బాబు సభ్యునిగా చేరారు. ఈ దశలో రాష్ట్రాన్ని మోసం చేస్తున్న కేంద్రంలో ఎలా భాగస్వాములవుతారు? ‘ఈ కమిటీలో పని చేయడానికి ఆసక్తివున్నా….మీరు మా రాష్ట్రానికి చేస్తున్న ద్రోహానికి నిరసనగా నేను అందులో ఉండటం లేదు’ అని కనీసం ఆ కమిటీనైనా ఎందుకు బహిష్కరించలేకపోయారు? ఇక పోరాడటం అంటే ఏమిటి? ఢిల్లీలో నిరసననకు ఇంత గొప్ప అవకాశాలను వదిలేసి కేంద్రం అన్యాయం చేస్తోందంటూ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని దీక్షలు చేసి ఏమి ప్రయోజనం?

మళ్లీ కరచాలనం విషయానికొస్తే….బాబు ఆ విధంగా కరచాలనం చేయడం సరైనదే అని నమ్ముతుంటే…టిడిపి అనుకూల మీడియా ఆ ఫొటోను ఎందుకు ప్రాధాన్యతనిచ్చి ప్రచురించలేదు? ప్రచురించినా…ఆ ఫొటో వివాదాస్పదమైనదనిగానీ, జాతీయస్థాయి జర్నలిస్టులు కామెంట్‌ చేశారనిగానీ ఎందుకు వేయలేదు? టివి ఛానళ్లలో ఎందుకు చూపించడం లేదు? వైసిపి నేత బుగ్గున, బిజెపి నేత సత్యనారాయణ ఢిల్లీలో ఎక్కడో కలిశారని ఆ దృశ్యాలను వందసార్లు చూపించిన మీడియా…ఈ ఫోటోను ఎన్నిసార్లు చూపించాయి? వైసిపి నేతల భేటీపై గంటలు గంటలు చర్చలు జరిపిన ఛానళ్లు బాబు-మోడీ ఫొటోపై అసలు 10 నిమిషాలైనా చర్చకు పెట్టాయా? అంటే…ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ప్రధానితో ఆ విధంగా నవ్వుతూ కరచాలనం చేయడం తప్పేనని మీడియా కూడా భావిస్తున్నట్లే అనుకోవాలి. ఈ ఫొటో చూపిస్తే టిడిపికి రాజకీయంగా నష్టం కలుగుతుంది కనుకనే దాచి పెట్టాయని భావించాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*