మోత్కుపల్లి గారూ…నారావారి వారసులు ఏమైపోవాలి?

ఒకవైపు విజయవాడలో తెలుగుదేశం పార్టీ మహానాడును ఉత్సాహంగా జరుపుకుంటుండగా మరోవైపు ఆ పార్టీ తెలంగాణ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబుపై తీవ్ర విమర్శిలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ బాగుపడాలంటే పార్టీ పగ్గాలను నందమూరి వంశానికి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టగల సత్తా జూనియర్‌ ఎన్‌టిఆర్‌కు ఉందని అన్నారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్‌టిఆర్‌ వల్లే తనలాంటి సామాన్యులు కూడా పార్టీలోకి రాగలిగారని అన్నారు. చంద్రబాబును నమ్ముకుని మోసపోయానంటూ ఆయన ఫ్లెక్సీ ప్రదర్శించారు.

తెలుగుదేశం పార్టీని స్థాపించింది నందమూరి తారక రామారావు అనిప్పటికీ…. ఆయన వారసులెవరూ టిడిపిలో ప్రస్తుతం క్రియాశీలంగా లేరు. లక్ష్మీపార్వతిని బూచిగా చూపెట్టి, ఎన్‌టిఆర్‌ను పదవీచ్యుతిడిని చేసి, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న చంద్రబాబు నాయుడుకి మొదట్లో నందమూరి కుటుంబం మొత్తం సహకరించింది. పార్టీని లక్ష్మీపార్వతి ఆక్రమిస్తుందన్న భయంతో హరికృష్ణ సహా కుటుంబమంతా చంద్రబాబు పక్షాన నిలబడింది. ఆ తరువాత వచ్చిన తేడాలతో హరిక్రిష్ణ ప్రత్యేక పార్టీ స్థాపించినా రాణించలేకపోయారు. ఆపై మెల్లగా తెలుగుదేశంతోనే కలిసి పని చేశారు. 2004 ఎన్నికల్లో జూనియర్‌ ఎన్‌టిఆర్‌, హరిక్రిష్ణ, బాలకృష్ణ అందరూ టిడిపి గెలుపు కోసం ప్రచారం చేశారు. అప్పుడు పార్టీ గెలవలేకపోయింది.

ఆ తరువాత…టిడిపిలో చాలా మార్పులు వచ్చాయి. తన కుమారుడైన లోకేష్‌కు పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని, తమ కుటుంబాన్ని పక్కనపెడుతున్నారన్న భావన నందమూరి వారసుల్లో కలిగింది. దాంతో హరిక్రిష్ణ, జూనియర్‌ ఎన్‌టిఆర్‌ తదితరులు టిడిపికి దూరమయ్యారు. గత ఎన్నికల్లోనూ తెలుగుదేశం కోసం వాళ్లు ప్రచారం చేయలేదు. ఈ క్రమంలోనే….చంద్రబాబు నాయుడు బాలకృష్ణ కుమార్తెను లోకేష్‌కు తీసుకున్నారు. దీంతో నందమూరి కుటుంబంలో బాలకృష్ణ పూర్తిగా చంద్రబాబుతో ఉన్నారు. ఆయనకు హిందూపురం టికెట్టు ఇచ్చి ఎంఎల్‌ఏని చేశారు. అక్కడికే పరిమతం అయింది. లోకేష్‌కు మాత్రం ఎంఎల్‌సి ఇచ్చి, మంత్రిని చేశారు. 2019లో టిడిపి గెలిస్తే లోకేష్‌ ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు.

నందమూరి కుటుంబంలో ఎంతమంది వారసులున్నా జూనియర్‌ ఎన్‌టిఆర్‌లో నాయకత్వ లక్షణాలు కనిపించాయి. 2004 ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ఉపన్యాసాలు ఈ భావన కలిగించాయి. భవిష్యత్తులో టిడిపిని నడిపించగల శక్తి జూనియర్‌కు మాత్రమే ఉందన్న ప్రచారం జోరుగా సాగింది. ఈక్రమంలో చంద్రబాబు నాయుడు జూనియర్‌ను పక్కన పెట్టేశారన్న విమర్శలు వచ్చాయి. ఇటీవల కాలంలో టిటిడి ఛైర్మన్‌ పదవి పేరుతో హరిక్రిష్ణను దువ్వే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇప్పటికీ నందమూరి కుటుంబంలో ఎక్కువ మంది చంద్రబాబు తీరుపట్ల ఆగ్రహంతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి చేసిన విమర్శలు కొత్త చర్చకు దారితీసే అవకాశాలున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*