మోహన్‌ బాబు శ్రీకాళహస్తికి రారు…బియ్యపు మధుకే టికెట్టు!

శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా సినీ నటుడు మోహన్‌బాబు పోటీ చేస్తారని ధర్మచక్రం ప్రచురించిన కథనంపై వైసిపి శ్రేణులు స్పందించాయి. ప్రధానంగా నియోజకవర్గ ఇన్‌చార్జి బియ్యపు మధుసూదన్‌ రెడ్డి అనుచరులు….మోహన్‌ బాబు పోటీచేస్తారనే వార్తలను కొట్టిపా రేస్తున్నారు. వైసిపి టికెట్టు బియ్యపు మధుసూదన్‌ రెడ్డికే వస్తుందని, ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నుంచి భరోసా ఉందని చెబుతున్నారు. మోహన్‌బాబుకు కూడా శ్రీకాళహస్తి నుంచి పోటీచేసే ఆలోచన లేదని అంటున్నారు.

బియ్యపు మధుసూదన్‌ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడూ ఎలాంటి పదవులూ అనుభవించలేదు. వైఎస్‌ఆర్‌ ఉన్నప్పుడు…టిడిపి నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎస్‌సివి నాయుడికి టికెట్టు ఇచ్చి గెలిపించమని చెబితే….ఆయన మాటను ఆదేశంగా భావించి పని చేశారు. ఎస్‌సివిని గెలిపించారు. వైఎస్‌ఆర్‌ మరణం తరువాత జగన్‌ వెంట నడుస్తున్నారు. జగన్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి, కొన్ని స్వీయ పొరపాట్ల వల్ల విజయానికి కాస్త దూరంలో ఆగిపోయారు. అయినా…నిరాశ పడకుండా పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలూ కృషి చేస్తున్నారు. ఇవన్నీ పార్టీ అధినేత దృష్టిలోనూ ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో మధుకు వైసిపి టికెట్టు గ్యారెంటీ. ఇది ఎప్పుడో ఖరారైపోయింది. మధుసూదన్‌ రెడ్డిలో ఆత్మవిశ్వాసం దెబ్బతీయడానికి, నిరాశపరచడానికి ఆయనంటే గిట్టని కొందరు….మోహన్‌ బాబు వస్తారనే వార్తలను ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి వాస్తవమూ లేదు – అంటూ మధుసూదన్‌ రెడ్డి అనుచరులు గట్టిగా వాదిస్తున్నారు.

రాష్ట్ర వ్యాపితంగా ఉన్నట్లే శ్రీకాళహస్తిలోనూ వైసిపికి సానుకూల పవనాలు వీస్తున్నాయని, మొదటి నుంచి వైఎస్‌ కుటుంబంతో ఉన్న మధుసూదన్‌ పట్ల సానుభూతి కూడా ప్రజల్లో ఉందని, ఈ ఎన్నికల్లో ఆయన గెలవడం ఖాయమని ధీమాగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కొత్త ప్రయోగాలు చేయబోదని అంటున్నారు. మొత్తంమ్మీద ‘అసెంబ్లీ రౌడీ’ శ్రీకాళహస్తికి వస్తున్నారన్న వార్తలను మధు అనుచురులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతున్నారు.

ఈ వెబ్‌సైట్‌లోని పాత క‌థ‌నాల కోసం క్లిక్ చేయండి….
www.dharmachakram.in

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*