మ్యూజియం పేరుతో మరో తలనొప్పికి శ్రీకారం..! టిటిడి అధికారుల అనాలోచిత నిర్ణయాలు..!!

  • ఇప్పటికే భక్తులతో తిరుమల కిటకిట
  • ఒకవైపు సదుపాయాలు కల్పించలేక సతమతం
  • మరోవైపు ఆర్బాటపు పనులతో రద్దీ పెంచే చర్యలు

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తరచూ హడావుడిగా, అనాలోచితంగా చేసే నిర్ణయాలు వివాదాస్పదమవుతుంటాయి. అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఈవోగా ఇచ్చిన తరువాత ఇటువంటి వివాదాలు తరచూ తెరపైకి వస్తున్నాయి. శ్రీవారి ఆలయం నుంచి భక్తులు బయటకు రావడానికి మెట్లు ఏర్పాటు చేయడంగానీ, మహాసంప్రోక్షణ సందర్భంగా భక్తులను తిరుమలకు రానివ్వకుండా కట్టడి చేయాలని తొలుత నిర్ణయించడంగానీ, ఆకస్మికంగా రమణ దీక్షితులు తొలగింపు వ్యవహారంగానీ, చెన్నై నుంచి బంగారు తరలింపు అంశంగానీ….ఇలా చాలా విషయాలు వివాదాస్పదమయ్యాయి.

తాజాగా మ్యూజియం ఆధునీకరణ, అభివృద్ది పేరుతో మరో హడావుడి నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆలయంలోని నిర్మాణాలను వర్చువల్‌, 3డి, ఆగ్మంటెడ్‌ రియాలిటీ పద్ధతుల్లో మ్యూజియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.30 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నారు. అదేవిధంగా శ్రీవారికి అలంకరించే ఆభరణాలను (1200 ఆభరణాలను) 3డి ఇమేజెస్‌ రూపంలో ప్రదర్శించాలని నిర్ణయించారు. దీనికి రూ.40 కోట్లు వెచ్చించనున్నారు. మొత్తంగా మ్యూజియం పేరుతో రూ.80 కోట్లుదాకా ఖర్చు చేయడానికి రెడీ అయ్యారు. ఈ మొత్తాన్ని దాతలు ఇస్తారని, టిటిడిపైన పైసా ఖర్చు ఉండదని చెబుతున్నారు.

మ్యూజియానికి సంబంధించిన ఈ ప్రాజెక్టును చూస్తే….చాలా ఆకర్షణీయంగా ఉందనడంలో సందేహం లేదు. అయితే…ఏదో అద్భుతం చేసినట్లు చెప్పుకోవాలన్న తపనలో….తిరుమలకు సంబంధించి ఇప్పటికే ఉన్న వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నట్లు అనిపించడం లేదు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రోజుకు 70 వేల నుంచి లక్ష మంది దాకా వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భక్తులకు దర్శనమే కాదు…బస, తాగునీరు, ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించడం టిటిడికి తలకుమించిన భారంగా ఉంటోంది. అందుకే….ఈ పరిస్థితిని అధిగమించేందుకు అనేక రకాల ఆలోచనలు చేస్తున్నారు.

భక్తులు…స్వామివారి దర్శన సమయానికి కొండకు చేరుకుని, తిరిగి కిందకు వెళ్లిపోవాలన్నది టిటిడి మొదటి నుంచి చేస్తున్న ఆలోచన. ఇందులో భాగంగానే శ్రీవారి దర్శనానికి టైం స్లాట్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. తిరుపతిలోనే దర్శనం సమయం తీసుకుని, అప్పటిదాకా తిరుపతి, చుట్టుపక్కల ఉన్న ఆలయాలను సందర్శించి, ఆపై తిరుమలకు రావాలన్నది ఆలోచన. అదేవిధంగా ఇకపై గదులు తిరుమలలో కాకుండా తిరుపతిలోనే నిర్మించాలని నిర్ణయించారు. వాస్తవంగా ఈ చర్యలన్నీ ఎంతోకొంత ఫలితాన్ని ఇస్తున్నాయి.

ఇప్పుడు మ్యూజియం పేరుతో టిటిడి చేస్తున్న ఆలోచన ఇప్పటిదాకా తీసుకున్న చర్యలకు, లక్ష్యాలకు పూర్తి భిన్నంగా ఉంది. మ్యూజియాన్ని రూ.80 కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దాక….తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడూ దాన్ని చూడాలనుకుంటారు. నిత్యం తిరుమలకు వచ్చే 70 వేల మందిలో కనీసం 40 వేలు – 50 వేల మంది మ్యూజియాన్ని చూడాలనుకున్నా…అదేపెద్ద తతంగంగా మారిపోతుంది. అదో శ్రీవారి దర్శనంలాగా మారినా మారిపోవచ్చు. మ్యూజియం చూడటం కోసం ఒకరోజు అదనంగా తిరుమలలో ఉండాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అప్పుడు….తిరుమలలో రద్దీ మరింతగా పెరిగిపోతుంది. టిటిడినే భక్తులను కొండపైన నిలబడిపోయేలా చేస్తుందని చెప్పాల్సివుంటుంది. ఇది కచ్చితంగా ఇప్పటిదాకా టిటిడి చేస్తున్న ఆలోచనకు, తీసుకున్న చర్యలకు పూర్తి విరుద్ధమైనదనడంలో సందేహం లేదు.

అలాగని మ్యూజియాన్ని ఆధునీకరించొద్దని చెప్పడం లేదు. అయితే…ముందూ వెనకా ఆలోచించి, హడావుడి లేకుండా నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం మ్యూజియం ఉన్న స్థానంలోనే ఆధునీకరిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. వేలమంది అక్కడికి చేరుకున్నప్ప్డుడు…ఆ ప్రాంతంలో రద్దీ పెరిగిపోతుంది. ఇప్పటికే ఆ దారి మొత్తం వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతోంది. అటువంటిది వేలాది మంది అక్కడికి వస్తే అనేక ఇబ్బందులు తలెత్తుతాయని తిరుమల గురించి తెలిసినవారు చెబుతున్నారు. అందుకే మ్యూజియాన్ని తిరుమలలో కాకుండా అలిపిరి వద్ద ఏర్పాటు చేస్తే ఏ ఇబ్బదీ ఉండదన్నది కొందరి సలహా. ఇక్కడ భూమికూడా ఉంది. భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లేలోపు…మ్యూజియాన్ని చూసుకుని వెళ్లే అవకాశం ఉంటుంది.

మ్యూజియం తిరుమలలోనే ఉండాలనుకుంటే….ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో కాకుండా….కొత్తగా నిర్మిస్తున్న రింగ్‌ రోడ్డుకు ఆనుకుని, అనుకూలమైన ప్రదేశంలో నిర్మిస్తే….భక్తులకూ సౌకర్యవంతంగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్నచోటే ఏర్పాటు చేస్తే….భక్తుల రద్దీ వల్ల భవిష్యత్తులో దాన్ని తరలించాలంటే ఇబ్బంది అవుతుందని, అందుకే ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.

అయినా…తిరుమల క్షేత్రాన్ని ఆకర్షణీయంగా మార్చడం కంటే ఆధ్యాత్మికంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నది తిరుపతికి చెందిన ఓ సీనియర్‌ పాత్రికేయుని అభిప్రాయం. తిరుమలకు వచ్చిన భక్తులు ఇప్పటికీ స్నానం లేకుండా దర్శనానికి వెళుతున్న పరిస్థితి ఉంది. అటువంటి వారి కోసం ఎలాంటి సదుపాయాలు కల్పించాలో, ప్రశాంత చిత్తంతో, చుచీ శుభ్రతతో దర్శనం చేసుకోడానికి ఏమి చేయాలో ఆలోచించకుండా….ఇటువంటి ఆర్భాటపు, ఆకర్షణీయ విధానాల వల్ల తిరుమల క్షేత్రం శోభిల్లబోదని ఆయన చెప్పారు.

ఇటువంటి విషయాలను చర్చంచారా లేదా అనేది తెలియదుగానీ….ఏకంగా రూ.80 కోట్లతో మ్యూజియాన్ని అభివృద్ధి చేయాలని ఆర్బాటం చేస్తున్నారు. అయినా పూర్తిస్థాయి బోర్డు ఒకటి రెండు రోజుల్లో ఏర్పాటుకాబోతోంది. ఇంతలోనే అధికారులు దీనిపై హడవుడి మొదలుపెట్టారు. ఇప్పటికైనా ఆలస్యమైపోలేదు. కొత్త బోర్డు ఏర్పాటయిన తరువాత…అన్ని కోణాల్లో సమగ్రంగా చర్చించిన తరువాతే….మ్యూజియం విషయంలో ముందడుగు వేయాలి. ఈ అంశంపై టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*