మ‌ళ్లీ మావోయిస్టు తుపాకీ మోగింది…అర‌కు ఎమ్మెల్యే కాల్చివేత‌!

రా్ష్ట్రంలో చాలాకాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు మళ్లీ త‌మ ఉనికిని చాటుకున్నారు. ఆదివారం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు(తెదేపా)ను కాల్పిచంపారు. దీంతో రా్ష్ట్రం పోలీసు యంత్రాంగం, ప్ర‌జాప్ర‌తినిధులు ఒక్క‌సారిగా ఉలికిప‌డ్డారు. మావోయిస్టుల‌ను అణ‌చివేశామ‌ని, వారి జాడ లేద‌ని పోలీసులు, ప్ర‌భుత్వాలు భావిస్తున్న త‌రుణంలో…అధికార పార్టీ ఎంఎల్ఏనే కాల్చిచంప‌డం పోలీసుల‌కు స‌వాలుగా మారింది.

విశాఖ మన్యంలో మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు(తెదేపా)ను కాల్పిచంపారు. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కాల్పుల్లో మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ కూడా మరణించారు. డంబ్రీగూడ మండలం లిప్పిట్టిపుట్టు వద్ద మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 60 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల దాడిని విశాఖ ఎస్పీ రాహుల్‌దేవ్‌ నిర్ధారించారు. ఘటనాస్థలానికి భద్రతా బలగాలు బయలుదేరి వెళ్లాయని తెలిపారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఈరోజు ఉదయం 11 గంటల వరకూ అరకులోనే ఉన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సివేరు సోమతో కలిసి నిమిటిపుట్టు గ్రామానికి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. అక్కడ గ్రామస్థులతో చర్చిస్తుండగా సుమారు 60 మంది మావోయిస్టులు వారిని చుట్టుముట్టారు. ఇటీవల చోటుచేసుకున్న పలు అంశాలపై వారు ఎమ్మెల్యేతో గంటసేపు చర్చించారు. ఎమ్మెల్యేకు చెందిన గూడ క్వారీపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్వారీ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నందున మూసివేయాలని డిమాండ్‌ చేశారు. అయితే దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. ఏదైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని.. బెదింపులకు దిగడం సరికాదని వారించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మావోయిస్టులు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోముకు తుపాకుల ఎక్కుపెట్టి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*